Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీయూజే ఖండన
న్యూఢిల్లీ : మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలపై బీజేపీ నేత నుపుర్ శర్మతో పాటు పలువురిపై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో జర్నలిస్టు సభా నఖ్వి పేరు చేర్చడాన్ని ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (డీయూజే) సోమవారం ఖండించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. సభా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రజలను ప్రేరేపిస్తున్నారంటూ పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత బీజేపీ నుంచి సస్పెండైన అధికార ప్రతినిధులు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌తో పాటు 31 మందికి పైగా ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా... వారిలో నఖ్వి ఒకరు. ప్రశాంతతకు భంగం కల్గించేలా, ప్రజలను విభజన మార్గాల ద్వారా రెచ్చగొట్టేలా వ్యక్తిగతంగా ట్వీట్లు చేశారంటూ సోషల్ మీడియా పోస్టులను పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చిన తర్వాత.. నఖ్వీ స్పందిస్తూ... ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద తన పేరు చేర్చారని తెలిసి షాక్‌కు గురయ్యానని అన్నారు. తాను జర్నలిస్టుననీ, నిజాలు మాట్లాడే అధికారం కల్పించే విధుల్లో ఉన్నానని పేర్కొన్నారు. తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. దేశ లౌకిక విధానాలకు కట్టుబడి ఉన్నానని, ద్వేషపూరిత ప్రసంగాలు, అన్యాయానికి వ్యతిరేకంగా తాను నిలబడతానని అన్నారు. తాను ప్రస్తుతం దేశంలో లేననీ, స్వదేశానికి వచ్చిన తర్వాత వీటికి సమాధానం చెబుతానని తెలిపారు. ఎఫ్ఐఆర్లో ఆమె పేరును చేర్చడాన్ని ఖండిస్తూ డీయూజే ప్రకటన విడుదల చేసింది. తన రచనలు, టీవీ చర్చల్లో ఆమె వ్యక్తీకరణ సమతుల్యంగా పాటించగల ప్రముఖ పాత్రికేయురాలని పేర్కొంది.