Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రపతి ఎన్నికలపై ప్రతిపక్షాలకు సమావేశ సమాచారంపై మమతా బెనర్జీకి ఏచూరి లేఖ
- నేటి సమావేశానికి సీపీఐ(ఎం) పక్ష నేత ఎలమారం కరీం హాజరు
న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు బుధవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో జరగబోయే ప్రతిపక్షాల సమావేశానికి సీపీఐ(ఎం) తరపున రాజ్యసభలో సీపీఐ(ఎం) పక్ష నేత ఎలమారమ్ కరీం హాజరవుతారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ఈ మేరకు ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు. సాధారణంగా ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయడానికి ముందుగా అనుసరించే పద్ధతి ఒకటి వుంటుంది. ఇటువంటి సమావేశాల్లో ఎక్కువమంది పాల్గొనేలా చూసేందుకు గానూ ముందుగానే నేతలు పరస్పరం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా వేరే కార్యక్రమాలతో బిజీగా వుంటే వాటిని మార్చుకుని ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు అవకాశం వుంటుంది. అయితే ప్రస్తుత విషయంలో సమావేశం జరిగే తేదీ, వేదిక, ఎజెండా గురించి తమకు ఏకపక్షంగా సమాచారం అందిందని ఏచూరి ఆ లేఖలో పేర్కొన్నారు. 'ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఉమ్మడి వాణిని వినిపించాల్సిన సమయం ఆసన్నమైంది.'' అని మీరు రాసిన లేఖ పేర్కొంటోంది. ఇటువంటి సమావేశంలో పాల్గొనేందుకు వీలుగా సరైన తేదీ, సమయం గురించి ముందుగానే పరస్పరం మాట్లాడుకుని వుంటే మరింత బాగుండేది, కానీ దురదృష్టవశాత్తూ, సమావేశం జరగడానికి కేవలం మూడు రోజులు ముందుగా అంటే 11వ తేదీన తమకు ఈ సమాచారం అందిందని ఏచూరి పేర్కొన్నారు. అయినప్పటికీ, భారత రాజ్యాంగాన్ని, భారత రిపబ్లిక్ లౌకికవాద, ప్రజాస్వామ్య స్వభావాన్ని పరిరక్షించేందుకు అన్ని లౌకికవాద శక్తులను విస్తృత స్థాయిలో సమీకరించడాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని సీపీఐ(ఎం) ఎప్పుడూ నొక్కి చెబుతూ వుంటుంది. ఇందుకు అనుగుణంగానే, భారత రాజ్యాంగ సంరక్షకుడైన భారత రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు సీపీఐ(ఎం) తరపున ఎంపీ ఎలమారం కరీం ఆ సమావేశాల్లో పాల్గొంటారని ఏచూరి తెలిపారు.