Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేలో 15.88 శాతానికి టోకు ధరల ద్రవ్యోల్బణం
- నింగికంటిన అహారోత్పత్తుల ధరలు
న్యూఢిల్లీ : దేశంలో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) వరుసగా 14వ మాసంలోనూ ఎగిసిపడింది. ప్రస్తుత ఏడాది మేలో ఈ సూచీ ఏకంగా 15.88 శాతానికి చేరింది. ఇంతక్రితం ఏప్రిల్‌లో 15.08 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది కాలంగా ఈ సూచీ రెండంకెల స్థాయికి తగ్గకుండా నమోదు కావడం ఆందోళనకరం. కూరగాయలు, పళ్లు ధరలు మరింత పెరిగాయి. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ''చమురు, సహజ వాయువు, ఇంధన, ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం కారణంగా గత మే నెలలో ద్రవ్యోల్బణం ఎగిసింది. మినరల్ ఆయిల్స్, ప్రాథమిక లోహాలు, ఆహారేతర వస్తువులు, రసాయనాలు, అహార్పోత్తుల ధరలు మరింత పెరిగాయి.'' అని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. మరోవైపు మే నెలలో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 7.04 శాతంగా చోటు చేసుకుంది. 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా నమోదు కావచ్చని ఆర్బీఐ ఇటీవలే పేర్కొంది. ఇంతక్రితం 5.6 శాతంగా అంచనా వేసింది. భారత చరిత్రలో తొలిసారి టోకు ద్రవ్యోల్బణం సూచీ 1991లో గరిష్టంగా 16.06 శాతంగా చోటు చేసుకుంది. 2012లో కొత్త సీరిస్‌లో డబ్ల్యూపీఐని గణించడం ప్రారంభించిన తర్వాత ఈ ఏడాది మేలో ఆల్‌టైం గరిష్ట స్థాయి 15.88 శాతంగా చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. అహారోత్పత్తుల ధరలు 12.34 శాతానికి పెరిగాయి. ఇంతక్రితం ఏప్రిల్‌లో ఇది 8.35 శాతంగా నమోదయ్యింది. క్రితం నెలో కూరగాయల ధరలు 56.36 శాతం పెరిగాయి. ఆలు, మాంసం, గ్రుడ్లు, చేపల ధరలు మరింత పెరిగాయి. ఇంధన ద్రవ్యోల్బణం సూచీ 40.62 శాతం, తయారీ ఉత్పత్తులు, చమురు గింజల ద్రవ్యోల్బణం వరుసగా 10.11 శాతం, 7.08 శాతంగా నమోదయ్యింది. ముడి చమురు మరియు సహజ వాయువు ద్రవ్యోల్బణం ఏకంగా 79.50 శాతంగా చోటు చేసుకుంది. ప్రభుత్వ విధానాల వల్ల ఇప్పట్లో ధరలు దిగి వచ్చే సంకేతాలు కానరావడం లేదని నిపుణులు భావిస్తున్నారు. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి వడ్డీ రేట్లను పెంచచడానికి అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.