Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైనిక సామర్ధ్యంపై ప్రతికూల ప్రభావం : పెదవి విరిచిన సైనిక నిపుణులు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రకటించిన అగ్నిపథ్ పథకానికి సాయుధ బలగాల ప్రముఖుల నుంచి తీవ్ర ప్రతిస్పందన ఎదురైంది. రాబోయే 90 రోజుల్లో 45వేల మంది సైనికులను సైన్యంలోకి రిక్రూట్ చేయడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని చారిత్రకమైనదిగా ప్రభుత్వం అభివర్ణిస్తుండగా, మెజారిటీ సైనిక నిపుణులు మాత్రం పెదవి విరుస్తున్నారు. లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) వినోద్ భాటియా దీనిపై స్పందిస్తూ, దీనివల్ల సాయుధ బలగాలకు మరణ గంట మోగుతుందని వ్యాఖ్యానించారు. ''టూర్ ఆఫ్ డ్యూటీ స్కీమ్ (టీఓడీడీ)గా పిలిచే ఈ పథకాన్ని పరీక్షించలేదు. పైలట్ ప్రాజెక్టు లేదు, నేరుగా అమలు చేస్తున్నారు. ఇది సమాజాన్ని సైనికీకరణ చేయడానికి దారి తీయగలదు. దాదాపు 40వేల మంది (75శాతం) యువత ప్రతీ ఏడాది సైన్యం నుండి తిరస్కరించబడతారు. ఉద్యోగం కూడా లేకుండా వారు నిరుత్సాహపడతారు. ఆయుధాల్లో పాక్షికంగా శిక్షణ పొందుతారు, ఇదేమీ అంత మంచి ఆలోచన కాదు, దీనివల్ల ఎవరికీ ఉపయోగం వుండదు.'' అని భాటియా ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
అగ్నిపథ్ పథకం కింద ఉపాధి పొందే సైనికులను అగ్నివీరులుగా పిలుస్తారు. తొలుత వీరు సాయుధ బలగాల్లో నాలుగేండ్లు పనిచేస్తారని ప్రభుత్వం తెలిపింది. వారిలో 75శాతం మంది ఆ నాలుగేండ్ల పదవీకాలం చివరిలో రిటైరవుతారని పేర్కొంది. వేతనాల్లో, పెన్షన్లలో కోతలతో కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను రిక్రూట్ చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఆయుధాలను సమకూర్చుకునేందుకు అవసరమైన నిధులను అత్యవసరంగా సమకూర్చుకోవడానికి ఈ చర్య ఉపయోగపడనుంది. భారత వైమానిక దళంలో 22 ఏండ్లు పనిచేసిన గ్రూపు కెప్టెన్ (రిటైర్డ్) నితిన్ వెల్డె ఈ పథకంపై స్పందిస్తూ, ఇప్పుడే ఈ పథకంపై విమర్శించడం లేదా ప్రశంసించడం సరికాదని వ్యాఖ్యానించారు.
మేజర్ జనరల్ (రిటైర్డ్) బి.ఎస్.ధనోవా మాట్లాడుతూ, ఖర్చును తగ్గించుకోవాలనే అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పథకం ఆవిర్భవించిందని, అమలవుతోందని వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దపు మిలటరీలో ఎంతగానో అవసరమైన విస్తృత సంస్కరణలకు ఇదొక ఉత్ప్రేరకంగా మారగలదని పేర్కొన్నారు. 'మన ఉన్నత రాజకీయ నేతలు స్వల్పకాలిక ప్రయోజనాలను మించి ఆలోచించగల సమర్ధులైతే మనం ఇంకా ఎక్కువగానే సాధించి వుండేవారమని' ఆయన ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.
మేజర్ జనరల్ (రిటైర్డ్) యష్ మోర్, ఈ పథకాన్ని విమర్శించారు. అన్నింటికంటే కూడా గత రెండేళ్ళ కాలంలో ఈ రిక్రూట్మెంట్పై లక్షలాదిమంది యువకులు ఆశలు కోల్పోయారని అన్నారు. దీన్ని అమలు చేయడానికి సర్వీస్ హెడ్‌క్వార్టర్స్ కూడా విముఖంగానే వున్నట్లు కనిపిస్తోందని ట్వీట్ చేశారు. మేజర్ జనరల్ (రిటైర్డ్) సత్బీర్ సింగ్ మాట్లాడుతూ, పూర్వపు మిలటరీ సాంప్రదాయాలు, నైతిక విలువలు, నిబంధనలకు అనుగుణంగా ఈ పథకం లేదని విమర్శించారు. సైన్యం సామర్ధ్యంపై ఇది ప్రతికూల ప్రభావాన్ని కనబరుస్తుందన్నారు.
''అనేకమంది సీనియర్ ప్రముఖులు తమ అనుభవంతో, విజ్ఞతతో ఇప్పటికే అభిప్రాయాలు వెల్లడించారు. దీంతో ఒక ఉమ్మడి వాణి ఆవిష్కృతమైంది. టూర్ ఆఫ్ డ్యూటీ పథకం మంచి ఆలోచనగా కనిపించడం లేదు. అత్యంత జాగ్రత్తగా, ఆచితూచి ముందుకు సాగాల్సి వుంది.'' అని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) పి.ఆర్.శంకర్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. కిండర్‌గార్టెన్ విద్యార్ధి నుండి సూపర్‌మేన్‌ను ఊహించేలా ఈ ప్రతిపాదన వుందని వ్యాఖ్యానించారు. ''అభిమన్యుడిని మనం పొందవచ్చు, కానీ అతడు పద్మ వ్యూహం నుండి బయటపడలేడు. ఐదేళ్ళ తర్వాత అర్జునులు మన తదుపరి మహాభారతంలో అందుబాటులో వుండరు. ఇటువంటి సైనికులతో రంగంలోకి దిగే యూనిట్లు వాటి పూర్తి శక్తి సామర్ధ్యాలతో పనిచేయలేవు. ఈ యుద్ధంలో పరాజితులంటూ ఎవరూ వుండరు.'' అని ట్విట్టర్లో పేర్కొన్నారు.