Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికలపై శరద్ పవర్
ముంబయి /న్యూఢిల్లీ : తాను రాష్ట్రపతి అభ్యర్థి రేసులో లేనంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవర్ ప్రకటించారు. తాను రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల అభ్యర్థిని కానని ఎన్సీపీ అధికారిక సమావేశంలో పవర్ పేర్కొన్నారు. జులై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాల అభ్యర్థిగా శరత్ పవర్‌ను బరిలోకి దింపుతున్నట్టు ఆప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు తమ అభ్యర్థికి మద్దతిచ్చేందుకు అవసరమైన సభ్యుల సంఖ్యా బలాన్ని కూడగట్టుకోగలరనే నమ్మకం లేనందునే పవర్ విముఖంగా ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓటమి పాలయ్యే యుద్ధంలో పాల్గొనేందుకు పవర్ అయిష్టత వ్యక్తం చేస్తున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎదురుదెబ్బ తిన్నాయనీ, ముఖ్యంగా మహారాష్ట్రలో శివసేనకు చెందిన సంజరు పవర్‌ను ఓడించి మరీ బీజేపీ ఎంపీ సీటును సాధించిందని తెలిపాయి. శివసేనకు మద్దతిస్తామని వాగ్దానం చేసిన పలువురు స్వతంత్ర అభ్యర్థులే బీజేపీని గెలిపించడం గమనార్హం. అయితే తన అభిప్రాయాన్ని పవార్ ఇంకా ప్రతిపక్షాలకు వెల్లడించలేదని తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని ఎంచుకునేందుకు కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్‌ను సూచిస్తూ ఇప్పటికే ఇతర పార్టీలకు ప్రతిపాదనలు కూడా చేసింది. గత గురువారం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే.. ఈ విషయమై పవర్‌తో చర్చలు జరిపారు. ఆప్ నేత సంజరు సింగ్ కూడా పవర్‌ను కలిశారు. ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా యత్నిస్తున్నారు. ఈ అంశంపై బుధవారం (జూన్ 15) ఢిల్లీలో ఆమె సమావేశాన్ని జరపనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనాలంటూ సోనియా గాంధీ సహా పలు రాష్ట్రాల సీఎంలు, ఇతర నేతలకు లేఖలు రాశారు. శరద్ పవర్ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.