Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ 'బుల్డోజరు చర్యల'పై స్పందించండి
- సుప్రీంకు మాజీ న్యాయమూర్తులతో సహా పలువురు ప్రముఖుల లేఖ
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పాల్పడుతున్న బుల్డోజరు ఎత్తుగడలపై, ఆందోళనకారులను విచక్షణారహితంగా అరెస్టు చేయడంపై తక్షణమే కలగచేసుకుని చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో సహా పలువురు ప్రముఖులు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 12మంది మాజీ న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు లేఖ రాశారు. లేఖపై సంతకాలు చేసిన వారిలో సుప్రీం మాజీ న్యాయమూర్తులు జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, జస్టిస్ వి.గోపాల గౌడ, జస్టిస్ ఎ.కె.గంగూలీ, ప్రశాంత్ భూషణ్, ఇందిరా జైసింగ్సహా పలువురు హైకోర్టుల న్యాయవాదులు, సీనియర్ అడ్వకేట్లు వున్నారు. యూపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక సంఘటనలు, ప్రజలపై రాష్ట్ర అధికారులు పాల్పడుతున్న అణచివేత చర్యల నేపథ్యంలో వారీ విజ్ఞప్తి చేశారు. ఆందోళనల్లో పాల్గొన్నవారి వాదనలు వినేందుకు ఒక అవకాశం కూడా ఇవ్వకుండా వారిపై తీవ్రంగా చర్యలు తీసుకుంటున్నారని తమ లేఖలో వారు విమర్శించారు. ముఖ్యమంత్రే ఈ మేరకు అధికారులను ఉద్బోధిస్తున్నారని అన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు కూడా ఇప్పటికి 300మందికి పైగా అరెస్టు చేశారనీ, ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని తెలిపారు. కస్టడీలో వున్న యువకులను లాఠీలతో బాదడం, ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఆందోళనకారుల ఇండ్లను ధ్వంసం చేయడం, మైనారిటీలకు చెందిన ఆందోళనకారులను వెంటాడి లాఠీలతో తన్నడం వంటి దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయనీ, ఇది చట్టబద్ధపాలనను అపహాస్యం చేయడమేనని ఆ లేఖ విమర్శించింది. రాజ్యాంగాన్ని, అది కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాచేలా వ్యవహరించడం ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇటీవల కొన్ని కేసుల్లో సుప్రీంకోర్టు తనంత తానుగానే స్పందించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ కేసులో కూడా తక్షణమే విషయాలను పరిగణనలోకి తీసుకుని యూపీలో దిగజారుతున్న శాంతి భద్రతల పరిస్థితులను చక్కదిద్దాలని ఆ లేఖలో వారు సుప్రీంకోర్టును కోరారు.