Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు ప్రధాని మోడీ ఆదేశాలు
- ఖాళీగా ఉన్న కోటికి పైగా ఖాళీల మాటేంటీ ?: వరుణ్ గాంధీ
- మహా జుమ్లా: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : రాబోయే ఎడాదిన్నరలో పది లక్షల ఉద్యోగాలను భర్తీచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) మంగళవారం ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో మానవ వనరుల పరిస్థితిని సమీక్షించారు. పది లక్షల మందిని నియమించాల్సిందిగా ప్రధాని ఆదేశించారని పీఎంఓ ఒక ట్వీట్లో తెలిపింది. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు గత కొన్నేండ్లుగా తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. డిసెంబరు 2023 నాటికి 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కేంద్రం డెడ్ లైన్ విధించింది.
కోటి ఉద్యోగాల మాటేమిటి? : వరుణ్ గాంధీ
10 లక్షల కొత్త ఉద్యోగాలు భర్తీ చేయాలని వివిధ ప్రభుత్వ విభాగాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశించిన కొద్దిసేపటికే సొంత పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ పరోక్షంగా పదునైన విమర్శలు చేశారు. మంజూరై ఖాళీగా ఉన్న కోటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్థవంతమైన చర్యలు చేపట్టాలని ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయం చేసిన ప్రకటనకు ట్విటర్ ద్వారా బదులిస్తూ 'నిరుద్యోగ యువత బాధను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు ప్రధాన మంత్రి గారూ.. కొత్త ఉద్యోగాలను సృష్టించటంతో పాటు మంజూరై ఖాళీగా ఉన్న ఒక కోటి ఉద్యోగాలను కూడా భర్తీ చేసేందుకు అర్థవంతమైన ప్రయత్నాలు జరగాలి. అలాగే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నెరవేర్చే దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలి' అని పేర్కొన్నారు.
రెండు కోట్లు పోయి...
10 లక్షల వంతు వచ్చింది : రాహుల్
మోడీ ప్రకటన మహా జుమ్లా అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి కార్యాలయ ప్రకటనపై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'ఎనిమిదేండ్ల క్రితం యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అది ఇప్పుడు 10 లక్షల ఉద్యోగాల వంతుకు వచ్చింది. ఇది 'జుమ్లా' ప్రభుత్వం మాత్రమే కాదు. 'మహా జుమ్లా' ప్రభుత్వం. ప్రధాని ఉద్యోగాలు కల్పించటంలో నిపుణుడు కాదు. ఉద్యోగాలపై 'వార్తలు' తయారు చేయడంలో నిపుణుడు'' అని రాహుల్ విమర్శించారు.
వైఫల్యాల్ని కప్పిపుచ్చు కోవటానికే : సీపీఐ(ఎం)
ఉద్యోగ నియామకాలపై ప్రధాని మోడీ ప్రకటన పచ్చి మోసమని సీపీఐ(ఎం) ఆగ్రహం వ్యక్తం చేసింది. ''మోడీ సర్కార్ విధానాల వల్ల నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూలేనంతగా నిరుద్యోగం రికార్డ్స్థాయికి చేరుకుంది. ప్రతి ఏడాది రెండు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, నిరుద్యోగం తీవ్రస్థాయికి చేరుకోవడానికి కారణమయ్యారు. తన వైఫల్యాల్ని కప్పిపచ్చు కోవటం కోసం ఇప్పుడు మళ్లీ కొత్తగా ప్రధాని మోడీ 10లక్షల ఉద్యోగ నియామకాల భర్తీ ప్రకటన చేశారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తటంతో ఉద్యోగ నియామ కాలపై ఒక ప్రకటన వదిలారు'' అని ట్విట్టర్లో సీపీఐ(ఎం) ఒక ప్రకటన విడుదల చేసింది.