Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: కేరళలోని స్టార్టప్ ఎకో సిస్టమ్‌కు ఆసియాలోనే అత్యంత ఉత్తమమైనదిగా గుర్తింపు లభించింది. నైపుణ్యాల రీత్యా చూసినట్లైతే గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టమ్ రిపోర్ట్ (జీఎస్‌ఈఆర్)లో నాల్గవ స్థానాన్ని పొందింది. అంతర్జాతీయంగా ప్రభుత్వాలను, కార్పొరేట్ నేతలను, స్ఫూర్తిదాయకమైన స్టార్టప్ వ్యవస్థాపకులను, పెట్టుబడిదారులను ఒక్క తాటిపైకి తీసుకువచ్చే లండన్ టెక్ వీక్ జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం జీఎస్ఈఆర్ను విడుదల చేశారు. సమాజాల కొరకు ఉపయోగపడే సాంకేతిక శక్తిపై ఈ టెక్ వీక్‌లో చర్చించారు. 2020లో మొట్టమొదటిసారిగా జీఎస్ఈఆర్ను ప్రచురించారు. ఆనాడు ఆసియాలో కేరళకు ఐదవ ర్యాంక్ లభించగా, మొత్తంగా ప్రపంచంలో 20వ స్థానం లభించింది. విధాన పరిశోధనా, సలహా సంస్థ స్టార్టప్ జీనోమ్, గ్లోబ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నెట్వర్క్ సంయుక్తంగా ఈ ర్యాంకింగ్‌లను ఇస్తాయి. సాంకేతిక రంగంలో నైపుణ్యాలను గుర్తించి వారికి అవకాశాలను కల్పించే సామర్ధ్యాలను బట్టి ఈ ర్యాంకింగ్ వుంటుంది. కేరళలో ఎక్కువ స్టార్టప్‌లు ప్రారంభించి, పరిఢవిల్లడానికి అక్కడి ప్రభుత్వం ఇచ్చే తోడ్పాటు, సాంకేతిక నైపుణ్యాలు ఈ స్థాయికి కారణాలుగా పేర్కొన్నారు.