Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆరు లేదా అంతకంటే ఎక్కువ నెలల గర్భిణీ అయిన మహిళా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయకూడదనే ఇండియన్ బ్యాంక్ తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించు కోవాలని ఐద్వా డిమాండ్ చేసింది. కొన్ని నెలల క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుందనీ, అయితే అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో తరువాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుందని ఐద్వా గుర్తు చేసింది. ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇండియన్ బ్యాంక్ తాజాగా జారీ చేసిన మార్గ దర్శకాల్లో నూతన షరతును జత చేసింది. దీని ప్రకారం 12 వారాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న గర్భిణీలను తాత్కాలికంగా అనర్హులుగా ప్రకటిస్తారు. ఇండియన్ బ్యాంక్ స్పాన్సర్ చేసిన తమిళనాడు గ్రామ బ్యాంక్ కూడా ఇలాంటి నిబంధననే విధించింది. ఆరు నెలలు, లేదా అంతకంటే ఎక్కువ నెలలు ఉన్న గర్భిణీల ను ఎంపిక చేయకుండా నిషేధించింది. ప్రసవం అయిన మూడు నెలల తరువాత మాత్రమే ఉద్యోగాల్లో చేరడానికి అనుమతి ఇచ్చింది. ఇలాంటి నిబంధన మహిళల పట్ల చాలా వివక్ష చూపుతుందని ఐద్వా విమర్శించింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత నుంచి ప్రస్తుతం మహిళల పని భాగస్వామ్యం చాలా అత్యల్పంగా ఉందని, బ్యాంక్ యాజమాన్యాలు జారీ చేసే ఇటు వంటి మార్గదర్శకాలు మహిళల ఉద్యోగ అవకాశాలపై మరింత ప్రతికూల ప్రభావం చూపుతాయని ఐద్వా విమర్శించింది. ఇలాంటి నిబంధనలు మెటర్నిటీ బెనిఫిట్ (సవరణ)చట్టం 2017నూ ఉల్లంఘిస్తుం దని తెలిపింది. ఇండియన్ బ్యాంక్ తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించు కోవాలని ఐద్వా డిమాండ్ చేసింది. అలాగే ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన తిరోగమన సర్క్యులర్ జారీ చేయడానికి కారణమైన కార్యనిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని, నియామకాల్లో ఏ సంస్థ కూడా మహిళల పట్ల వివక్ష చూపకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐద్వా డిమాండ్ చేసింది.