Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్
- రాజ్భవన్ల ముట్టడికి పిలుపు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ కార్యకర్తలను ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకో వడం, ఆపై కార్యాలయంలోనే కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాహుల్ గాంధీ మూడో రోజు ఈడీ ముందు హాజ రయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బుధవా రం కూడా ఆందోళన కొనసాగించింది. నిరసనలు కొనసాగుతున్న సమయంలో.. అక్బర్‌రోడ్డు వద్ద ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు ఢిల్లీ పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఒకానొక టైంలో ఏఐసీసీ గేట్లు బద్దలు కొట్టి పోలీసులు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి, తమ నేతలను అరెస్టు చేసినట్టు కాంగ్రెస్ ఆరోపణలకు దిగింది. ఈ పరిణామంపై పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా తీవ్రంగా స్పందించారు. అసలు పార్టీ కార్యాలయంలోకి పోలీసులు ఎలా వస్తారని నిలదీశారు. పోలీసులు గూండాల్లా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు టైర్లు కాల్చి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఏఐసీసీ కార్యాలయం వద్ద జరిగిన పరిణామంపై కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. గురువారం నాడు రాజ్భవన్ల ముట్టడికి ఏఐసీసీ పిలుపు ఇచ్చింది. ఈడీ విచారణకు నిర సనగా ఢిల్లీలో వందలాది మంది కాంగ్రెస్ కార్య కర్తలు వీధుల్లో ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ కార్య కర్తల నిరసనల పర్వంతో కాంగ్రెస్ ప్రధాన కార్యా లయం దగ్గర భద్రతా బలగాలను మోహరించి 144 సెక్షన్ విధించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో నిరసన తెలుపుతోన్న వారిని అదుపులోకి తీసుకొని బస్సుల్లోకి ఎక్కించారు. రాహుల్ గాంధీపై ఈడి చర్య పాలక వ్యవస్థకు నష్టం కలిగిస్తుందని కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్, భూపేష్ బాఘేల్, మల్లికార్జున్ ఖర్గే, రణదీప్ సూర్జేవాలా అన్నారు. 'మేం ఉగ్రవాదులమా ఏంటి? మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? నేతలు, కార్యకర్తల పై పోలీసుల్ని ఎందుకు ప్రయోగిస్తున్నారు?' అంటూ కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌధరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది ప్రజాస్వామ్యానికి
చెడు సంకేతం: సచిన్ పైలట్
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్తుంటే ఎలాంటి కారణాలు లేకుండా తనను అరెస్టు చేయడం, కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్‌లోకి పోలీసులు బలవంతంగా చొచ్చుకుపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ''అసలు పోలీసులు ఎలా ప్రతిపక్ష పార్టీ (కాంగ్రెస్) కార్యాలయంలోకి ప్రవేశించి కార్యకర్తలను చితకబాదుతారు? ఇలాంటివి గతంలో ఎప్పుడూ జరగలేదు'' అని విమర్శించారు.
బీజేపీ ప్రైవేటు సైన్యం: కార్తి చిదంబరం
కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోకి పోలీసులు చొచ్చుకుపోవడం, అక్కడి కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించడంపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీ పోలీసులు బీజేపీ ప్రైవేటు సైన్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసులు పార్టీ ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకుపోతున్న వీడియోను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు.