Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆగ్రహం
- ఇతర దేశాలపై విమర్శల దాడికి దిగుతున్న మోడీ సర్కార్
న్యూఢిల్లీ : గతకొన్నేండ్లుగా భారత్‌లో విజృంభిస్తోన్న విద్వేష భావజాలంపై అమెరికా సహా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల బీజేపీ నాయకులు చేసిన మత విద్వేష వ్యాఖ్యలు మరోమారు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. గల్ఫ్ దేశాలు, అమెరికా ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టకు భంగం
వాటిల్లింది. భారత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వీటిని మోడీ సర్కార్ ఎదుర్కొన్న తీరు సరిగా లేదని నిపుణులు చెబుతున్నారు. విమర్శలు, ఆరోపణలపై కేంద్రం అధికారికంగా స్పందించిన తీరు అభ్యంతరకరంగా ఉందని వారు అన్నారు. ఆయా దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేయటం, విమర్శలతో ఎదురుదాడికి దిగటం ద్వారా ఆరోపణల నుంచి తప్పించుకోలేమని నిపుణులు చెప్పారు. భారత్‌లో మత విద్వేషం పెచ్చుమీరుతోందని గతంలో అమెరికా కీలక నివేదిక విడుదల చేసింది. దీనిపై భారత్ స్పందిస్తూ, ''మీ దేశాల్లో నల్లజాతీయులపై, భారతీయులపై దాడులు జరుగుతున్నాయి కదా!''అంటూ మోడీ సర్కార్ ఎదురుదాడికి దిగింది. అయితే భారత్‌లోని పరిస్థితులపై కేవలం అమెరికానే కాదు, అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మత హింస, విద్వేషం పెరిగిందని, వాక్ స్వాతంత్య్రంపై అణచివేత..వంటివి అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.
ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రివర్గంలో ఎవ్వరూ కూడా నుపూర్ శర్మ, నవీన్‌కుమార్ జిందాల్ వ్యాఖ్యల్ని ఖండించలేదు. అధికారంలో ఉండీ స్పందించకపోవటం, నష్ట నివారణా చర్యలు చేపట్టకపో వటాన్ని రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. గల్ఫ్, పాశ్చాత్య దేశాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన తర్వాతే కేంద్రం నుపుర్ శర్మపై చర్యలు చేపట్టిందని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.