Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీపీ అధినేత శరద్ పవార్
- రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెడదాం: ప్రతిపక్షాల భేటీలో ఏకగ్రీవ తీర్మానం
- పరిశీలనలో ఫరుఖ్ అబ్దుల్లా,గోపాల్ కృష్ణ గాంధీ
న్యూఢిల్లీ: బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టే విషయంలో ప్రతిపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పార్టీలకతీతంగా ఒక అభ్యర్థిని మాత్రమే రాష్ట్రపతి రేసులో నిలబెట్టాలని ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. అభ్యర్థి పేరు ఖరారు కోసం ఈ నెల 21న మళ్లీ ప్రతిపక్షాలు సమావేశం కానున్నాయి. ఈ మేరకు బుధవారం నాడిక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధ్యక్షతన ప్రతిపక్షాల సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఈ ఎన్నికల్లో ఏకాభిప్రాయంతో ఓ అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడి, శివసేన, సీపీఐ(ఎం), సీపీఐ (ఎంఎల్), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేడీఎస్, ఆర్ఎస్పీ, ఐయూఎంఎల్, ఆర్ఎల్డీ, జేఎంఎం నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశ అనంతరం ప్రతిపక్షాలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ప్రజాస్వామ్యానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న నష్టం నుంచి గట్టెక్కించేందుకు ఓ అభ్యర్థి కావాలని పేర్కొన్నాయి.
శరద్ పవార్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినా...
ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల కోసం ఉమ్మడి అభ్యర్థిని నిలిపే ప్రక్రియకు ఇది నాంది అని చెప్పారు. ఎన్పీపీ చీఫ్ శరద్ పవార్ అభ్యర్థిత్వాన్ని అందరు నేతలు ఏకాభిప్రాయంతో అంగీకరించారని చెప్పారు. ''శరద్ పవార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా అంతా ప్రతిపాదించాం. కానీ, ఆయన దీన్ని తిరస్కరించారు. దేశంలో పేరుకుపోయిన బుల్డోజర్ రాజకీయాలను అడ్డుకునేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలి. రాష్ట్రపతి అభ్యర్థి కోసం సంప్రదింపులు కొనసాగిస్తాం'' అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇతర పార్టీలకు చెందిన ఇతర నేతల పేర్లను పరిశీలిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొనని టీఆర్ఎస్, బీజేడీ వంటి పార్టీల గురించి మమత మాట్లాడుతూ, వారు ఈ సమావేశంలో పాల్గొనకపోవడం పెద్ద విషయమేమీ కాదన్నారు. ఈ సమావేశానికి చాలా పార్టీలు వచ్చాయని, హాజరుకాని పార్టీల నేతలకు ఇతర కార్యక్రమాలు ఉండి ఉంటాయని చెప్పారు. ఈ సమావేశంలో ఎన్పీపీ నేతలు శరద్ పవార్, ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, జైరామ్ రమేష్, రణదీప్ సుర్జీవాలా, జేడీఎస్ నేతలు దేవెగౌడ, కుమార స్వామి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, సీపీఐ(ఎం) ఎంపీ ఎలమారం కరీం, సీపీఐ ఎంపీ బినరు విశ్వం, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ తదితరులు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, టీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ గైర్హాజరయ్యాయి. శరద్ పవార్ రేసులో ఆసక్తి చూపించకపోవడంతో.. ఫరూఖ్ అబ్దుల్లాతో పాటు గోపాలకృష్ణ గాంధీ పేర్లను పరిశీలనలో ఉంచినట్టు సమాచారం.