Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశవ్యాప్తంగా నిరసనల హోరు
త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం కొత్తగా ప్రకటించిన 'అగ్నిపథ్' పథకం దేశంలో అగ్గి రాజేస్తున్నది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ పథకానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, ఆర్మీలో చేరాలనే ఉత్సాహంతో ఉన్న దేశంలోని యువత కేంద్రం స్వల్ప కాలిక తాత్కాలిక నియామక పథకంపై ఆగ్రహంతో ఉన్నది. 'అగ్నిపథ్'ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నది.
- బీహార్‌లో హింసాత్మకం.. రైళ్లకు నిప్పు
- యూపీ, ఎంపీ, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, జమ్మూ, జార్ఖండ్‌లోనూ ఆందోళనలు
- రోడ్ల దిగ్బంధం.. రైళ్ల అడ్డగింత.. టైర్ల దహనం..ప్లకార్డుల ప్రదర్శన..
- పలు ప్రాంతాల్లో నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జీ
- మోడీసర్కారు రక్షణ శాఖ పథకంపై ప్రతిపక్షాల ఆగ్రహం
న్యూఢిల్లీ : అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా పలు నిరసనలు వ్యక్తమయ్యాయి. యూపీ, బీహార్ లలో ఆందోళనలు రెండో రోజూ కొనసాగాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జమ్మూ, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ నిరసనకారులు ఆందోళన చేశారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులు పలు ప్రాంతాల్లో ఈ పథకానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు. రోడ్లను దిగ్బంధించారు. రైళ్లను అడ్డుకున్నారు. రైళ్లకు నిప్పంటించారు. టైర్లను దహనం చేశారు. ముఖ్యంగా, బీహార్‌లో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ పథకాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. నిరసనకారులపై పోలీసులు పలు ప్రాంతాల్లో లాఠీ చార్జీ చేశారు. నిరసనకారులు, పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పలువురికి గాయాలయ్యాయి.
బీహార్ రణరంగం.. రైళ్లకు నిప్పు
ఎన్డీయే పాలిత రాష్ట్రం బీహార్లోనే కేంద్రం నిర్ణయంపై నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఛప్రా, జెహానాబాద్, ముంగర్, నవాడా, ముజఫర్‌పూర్, బక్సార్, బెగుసరారు లలో ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగాయి. నిరసనలలో యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో పోలీసులు, నిరసనకారుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నది. కేంద్రం ఆర్మీ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. జెహానాబాద్, బక్సార్, నవాడా జిల్లాల్లో వందలాది మంది నిరసనకారులు రోడ్డు, రైలు మార్గాలను దిగ్బంధించారు. ఛప్రాలో టైర్లను దహనం చేశారు. బస్సును ధ్వంసం చేశారు. జెనాబాద్, బక్సార్ జిల్లాల్లో రైల్వే ట్రాకులపై నిరసనకారులు పడుకొని పలు రైళ్లను అడ్డుకున్నారు. అనంతరం రైల్వే పోలీసులతో కలిసి బీహార్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నిరసనకారులను అక్కడ నుంచి చెదరగొట్టారు. గురుగ్రామ్, రేవారి ప్రాంతాల్లోని బిలాస్పూర్, సిధ్రావలి లలో వందలాది మంది యువకులు వీధుల్లోకి చేరి కేంద్రం పథకానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. గురుగ్రామ్-జైపూర్ రహదారిని దిగ్బంధించారు. బిలాస్పూర్ చౌక్‌లో నిరసన చేపట్టారు.
సరన్ జిల్లాలోని చప్రాలో ఆందోళనకారులు ఒక రైలు కు నిప్పు పెట్టారు. భభువాలో ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ కోచ్‌కూ నిరసనకారులు నిప్పంటించారు. కిటికీలను ధ్వంసం చేశా రు. పలు రైల్వే ట్రాకులు బ్లాక్ చేసి వాటిపై టైర్లను దహనం చేశారు. అరా రైల్వే స్టేషన్లో రాళ్లు రువ్విన ఘటన చోటు చేసుకున్నది. నిరసనకారులు మొత్తం ఐదు రైల్వే కోచ్‌లకు నిప్పుపెట్టారు. నవాడాలో వార్సాలింగంజ్ బీజేపీ ఎమ్మెల్యే అరుణా దేవి వాహనంపై నిరసనకారులు దాడి చేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. బీజేపీ ఎమ్మెల్సీ సీఎం గుప్తా ఇంటిపై నిరసనకారులు దాడి చేశారు.
పాత పద్దతిలోనే నియామకాలు జరపాలి : నిరసనకారుల డిమాండ్
నాలుగేళ్ల సర్వీసు అంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పలువురు యువకులు ఆందోళన తెలిపారు. ము ఖ్యంగా, సర్వీసు కాలం,పెన్షన్ నిబంధనలు లేకపోవటం, 17.5 నుంచి 21 ఏండ్ల మధ్య ఉన్నవారినే నియామకానికి అర్హులను చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. '' రిక్రూ ట్మెంట్ గతంలో ఎలా జరిగిందో అలానే జరగాలన్నది మా డిమాండ్. నాలుగేండ్ల సర్వీసు కోసం ఆర్మీలోకి ఎవరూ వెళ్లరు'' అని ముంగర్లోని ఒక నిరసనకారుడు అన్నాడు. నాలుగేండ్లు ఆర్మీలో పని చేసిన తర్వాత తాము ఎటు వెళ్లాలని జెహానాబాద్కు చెందిన నిరసనకారుడు మరొకరు ఆందోళన వ్యక్తం చేశాడు. '' నాలుగేండ్ల సర్వీసు తర్వాత మేము నిరాశ్రయులమవుతాం. అందుకే మేము రోడ్లను దిగ్బంధించాం'' అని వివరించాడు.
యూపీలోని పలు ప్రాంతాల్లో విద్యార్థుల నిరసనలు
బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలోని ఆందోళనలు కొనసాగాయి. 'అగ్నిపథ్' పథకానికి వ్యతిరేకంగా బల్లియా, బులంద్‌షహర్, ఉన్నావోతో పాటు పలు జిల్లాల్లో నిరసనలు జరిగాయి. ముఖ్యంగా, విద్యార్థులు సైతం ఇందులో భాగమయ్యారు. బులంద్‌షహర్‌లో విద్యార్థులు జీటీ రోడ్డును దిగ్బంధించారు. పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మోడీ సర్కారును వారు డిమాండ్ చేశారు. గోండాలో విద్యార్థులు పథకానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. నినాదాలు వినిపించారు.
హర్యానాలో ఇంటర్నెట్ సర్వీసులు కట్
హర్యానాలోని గురుగ్రామ్, రేవారీ, పల్వాల్ జిల్లాల్లో 'అగ్నిపథ్'పై నిరసనలు జరిగాయి. రేవారీ జిల్లాలో నిరసన కారులపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఆందోళన లతో గురుగ్రామ్-జైపూర్ రహదారి నిలిచిపోయింది. ఆందోళ నలు హింసాత్మకంగా మారటంతో పల్వాల్లో ఇంటర్నెట్ సర్వీసులు రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అసత్య వార్తలను కట్టడి చేయడానికే ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపి వేసినట్టు అధికారులు తెలిపారు. 'అగ్నిపథ్' ను వెంటనే వెనక్కి తీసుకోవాలని హర్యానా ప్రతిపక్షం డిమాండ్ చేసింది.
మధ్యప్రదేశ్‌లోని రైల్వే స్టేషన్లో ఉద్రిక్తం
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బిర్లానగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న వందలాది మంది నిరసనకారులు ఆందోళనల్లో పాల్గొన్నారు. రైళ్లు, సిబ్బంది పైకి రాళ్లు రువ్వారు. ఢిల్లీ-ముంబయి ట్రాక్‌తో పాటు ఏడు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడిందని అధికారులు తెలిపారు.
రాజస్థాన్‌లో ఆర్ఎల్పీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు
రాజస్థాన్‌లో రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) ఆధ్వర్యంలో సికార్, జైపూర్, అజ్మీర్, నగ్వార్, జోధ్‌ఫూర్, ఝున్ఝునీ జిల్లాల్లో నిరసన ర్యాలీలు జరిగాయి. 21 ఏండ్ల యువకుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఢిల్లీలోనూ ఆందోళన లు జరిగాయి.నాన్గ్లోరు రైల్వే స్టేషన్‌కు చేరుకున్న నిరసన కారులు పలు రైళ్లను అడ్డుకున్నారు. జమ్మూకాశ్మీర్‌లోని బీ.సీ రోడ్డు వద్ద ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం వద్ద నిరసనకారులు తివారీ బ్రిడ్జిని దిగ్బంధించారు. వారిపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. నిరసనల కారణంగా దేశవ్యాప్తంగా 34 రైళ్లు రద్దయ్యాయని భారత రైల్వే శాఖ తెలిపింది. ఎనిమిది రైళ్లు పాక్షికంగా రద్దయినట్టు చెప్పింది. 72 రైళ్లు ఆల్యసంగా నడిచినట్టు వివరించింది.
'నిరసనకారుల డిమాండ్లను కేంద్రం వినాలి'
'అగ్నిపథ్' పథకంపై దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల నాయకులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. కేంద్రంపై ఆగ్రహం చూపించారు. మోడీ ప్రభుత్వం ఆర్మీ ఉద్యోగార్థుల డిమాండ్లను వినాలని తెలిపారు. ఈ పథకం ఆర్మీకి ఎలాంటి గౌరవాన్నీ చూపదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అన్నారు. కేంద్రం నిర్ణయం 'అలసత్వ వైఖరి'గా సమాజ్‌వాదీ పార్టీ జాతీయాధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. కేవలం నాలుగేండ్ల కోసమే కాకుండా జీవితాంతం ఆర్మీలో సేవలందించే అవకాశాన్ని దేశ యువత కు కల్పించాలని 'ఆప్' అధ్యక్షులు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్ కోరారు. వేతనాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించు కోవటం కోసం త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర క్యాబినేట్ 'అగ్నిపథ్' పథకాన్ని మంగళవారం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ పథకం ప్రకారం.. 17.5 నుంచి 21 ఏండ్ల మధ్య వయసున్న యువతకు నాలుగేండ్ల స్వల్ప కాలిక కాంట్రాక్టు సర్వీసులో రెగ్యులర్ కేడర్‌తో కలిసి పనిచేసే అవకాశం దక్కుతుంది. అయితే, ఈ సర్సీసు విధానంపై సైన్య నిపుణులు, పలు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. నాలుగేండ్ల పదవీ కాలం, ర్యాంకుల్లో.. పోరాట స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.