Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ సర్కార్‌కు సుప్రీం ఆదేశం
- చట్టబద్ధంగా సాగాలి తప్ప ప్రతీకారంతో కాదని వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ప్రతీకారేచ్ఛతో జరుగుతున్న అక్రమ కూల్చివేతలు ఆపాలని సుప్రీం కోర్టు యూపీ ప్రభుత్వాన్ని గురువారం ఆదేశించింది. చట్ట ప్రకారం, నిబంధనలకు అనుగుణంగానే కూల్చివేతలు వుండాలని స్పష్టం చేసింది. మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో జరిగిన హింసాత్మక ఘటనలతో సంబంధమున్న వారి నివాసాలను ప్రతీకారంతో ప్రభుత్వ అధికారులు భయంకరంగా ధ్వంసం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన అనంతరం సుప్రీం పై వ్యాఖ్యలు చేసింది. ''అంతిమంగా, చట్టబద్ధ పాలన నెలకొనాలి. మీరు తీసుకునే ఏ చర్య అయినా చట్ట నిబంధనలకు అనుగుణంగానే వుండాలి.'' అని వెకేషన్ బెంచ్‌కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఎ.ఎస్.బొపన్న పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, వచ్చే వారం విచారణకు ఈ కేసును వాయిదా వేసింది. ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ వంటి చోట్ల ఆస్తులను ధ్వంసం చేయడానికి ముందుగా చట్టపరంగా అనుసరించాల్సిన క్రమాన్ని ప్రభుత్వం అనుసరించిందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న అని బెంచ్ పేర్కొంది. ఈ వారాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరింది. ''కొంత సంయమనం పాటించాలి. ప్రతీ ఒక్కటీ సక్రమంగా జరగాలి. వాటికి ఎలాంటి హాని జరగరాదు. చేపట్టాల్సిన క్రమాన్ని చేపట్టారా లేదా అనేదే ఇక్కడ ప్రశ్న.'' అని జస్టిస్ బొపన్న మౌఖికంగా వ్యాఖ్యానించారు. ఈ కూల్చివేతల ఉద్దేశ్యం, వాటి స్వభావంపై కేవలం మీడియాలో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకునే జమైత్ ఉలేమా-ఇ-హింద్ వంటి తృతీయ పక్షాలు కోర్టును ఆశ్రయించాయని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనకు కోర్టు ప్రాధాన్యత ఇవ్వలేదు. ''చట్టబద్ధంగానే అంతా జరగాలి, ఎవరు కోర్టుకు వచ్చారనేది ఇక్కడ ప్రశ్న కాదు, ఇక్కడ ఇది, న్యాయ పరిశీలనలోకి తీసుకోవాల్సిన అంశమే.'' అని జస్టిస్ బొపన్న వ్యాఖ్యానించారు. ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాతనే నివాసాలను కూల్చివేశామని, అవన్నీ కూడా అక్రమంగా కట్టినవేనన్న తమ వాదనలకు మద్దతిచ్చేలా అన్ని వివరాలతో అఫిడవిట్‌ను అందచేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ సూచనకు కోర్టు అంగీకరించింది. ఈలోగా కూల్చివేతలపై స్టే విధిస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. ఎఫ్ఐఆర్ల్లో నమోదైన వారి కుటుంబాలకు చెందిన నివాసాలనే చాలావరకు కూల్చివేశారని పిటిషనర్ల తరపు న్యాయవాది సి.యు.సింగ్ తెలిపారు. రాళ్ళు విసిరినవారిపై, అల్లర్లకు పాల్పడిన వారిపై ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రతీకార ప్రకటనలు చేశారని, ఆ తర్వాతనే కూల్చివేతలు చోటు చేసుకున్నాయని చెప్పారు. తర్వాత వాటిని సమర్ధించుకునేందుకు ఇవన్నీ అక్రమమైనవేనని అంటున్నారని సింగ్ వాదించారు.