Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీనిపై జోక్యం చేసుకుని చర్యలు తీసుకోండి
- లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మెన్‌కు కాంగ్రెస్ ఎంపీల ఫిర్యాదు
న్యూఢిల్లీ : ఈ నెల 13, 14, 15 తేదీల్లో తమ ఆందోళనల సందర్భంగా పలువురు ఎంపీలపై ఢిల్లీ పోలీసులు దాడికి పాల్పడ్డారనీ, దీనిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మెన్ ఎం వెంకయ్య నాయుడును కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గురువారం కలిశారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి నేతృత్వంలోని లోక్‌సభ ఎంపీల బృందం పార్లమెంటులోని స్పీకర్ కార్యాలయంలో ఓం బిర్లాను కలవగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని రాజ్యసభ ఎంపీల బృందం రాజ్యసభ చైర్మెన్ నివాసంలో వెంకయ్య నాయుడును కలిశారు. ఇందులో పి చిదంబరం, కెవి వేణుగోపాల్, జైరాం రమేష్‌లు కూడా ఉన్నారు.
'మా ఆందోళనల సందర్భంగా ఎంపీలతో ఢిల్లీ పోలీసులు అనుచితంగా, దారుణంగా ప్రవర్తించారు. కాంగ్రెస్ కార్యాలయం వెలుపల ఢిల్లీ పోలీసుల చర్యలు, అక్బర్ రోడ్డులో పూర్తిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. నిబంధనలను ఉల్లంఘించారు. జూన్ 15న, ఢిల్లీ పోలీసు సిబ్బంది కాంగ్రెస్ కార్యాలయంలోకి ప్రవేశించి, ఎంపీలు, జర్నలిస్టులు, కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు' అని చైర్మెన్‌కు అందించిన లేఖలో తెలిపారు. ఇందుకు సంబంధించి వీడియో ఫుటేజీని కూడా అందచేశారు. ''చాలా మంది ఎంపిలను వివిధ పోలీసు స్టేషన్లలో నిర్బంధించారు. ఎటువంటి వివరణ లేకుండా పది గంటలకు పైగా కస్టడీలో ఉంచారు. ఇది ఎంపీల అధికారాల ఉల్లంఘనకు సంబంధిం చిన స్పష్టమైన కేసు. ఈ ఘటనలను గమనించి తగిన విధంగా వ్యవహరించాలని మేం మిమ్మల్ని కోరుతున్నాం' అని లేఖలో పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన అనంతరం అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ 'మేము ఎదుర్కొన్న హింస, దౌర్జన్యాల గురించి వివరించాం. స్పీకర్ మా మాటలు ఓపికగా విన్నారు. మా ఎంపీలపై పక్కా ప్రణాళికతో దాడి చేసిన పోలీసు అధికారులపై చర్య తీసుకోవాలని మేం డిమాండ్ చేసాం. మా ఎంపీలు చాలా మంది గాయపడ్డారు. అలాగే పోలీస్ స్టేషన్లలోనూ ఎంపీలతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మా ఎంపీలను తీవ్రవాదులుగా చూశారు'' అని ఆరోపించారు.
ఢిల్లీ పోలీసులు నా బట్టలు చింపేశారు: మహిళా ఎంపీ
ఢిల్లీ పోలీసులు తన బట్టలు చింపేశారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళా ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యులపై పోలీసులు ఇలా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించా లంటూ లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు తమిళనాడు ఎంపీ జోతిమణి విజ్ణప్తి చేశారు. ''పోలీసులు మాపై భీకర దాడకి పాల్పడ్డారు. వాళ్లు నా బట్టలు చింపేశారు. నా బూట్లు తొలగించారు. నన్ను ఒక క్రిమినల్లాగ తీసుకెళ్లారు'' అని జోతిమణి అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అమ్మ ఆస్పత్రిలో ఉంది
- విచారణను సోమవారానికి వాయిదా వేయండి: ఈడీకి రాహుల్ లేఖ
అమ్మ సోనియాగాంధీ ఆస్పత్రిలో ఉన్నారనీ, కాబట్టి తన విచారణను సోమవారా నికి వాయిదా వేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి రాహుల్ గాంధీ గురువారం లేఖ రాసారు. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధిం చిన మనీలాండరింగ్ కేసులో రాహుల్‌ను వరసగా మూడు రోజుల పాటు విచారణించిన ఈడీ శుక్రవారం కూడా విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. కోవిడ్‌కు గురైన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమ్మ వద్ద ఉండాల్సిన అవసరం ఉందనీ, కాబట్టి తన విచారణను సోమవారానికి వాయిదా వేయాలని రాహుల్ లేఖలో కోరారు. ఈ నెల 2న కోవిడ్ సోకినట్టు వెల్లడైన సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో సోనియాగాంధీకి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.
కాంగ్రెస్ నాయకులపై ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్
రాహుల్‌గాంధీని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న సమయంలో ఏఐసీసీ ప్రధానకార్యాలయంలోకి ఢిల్లీ పోలీసులు బలవంతంగా ప్రవేశించారనీ, తమను కొట్టారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించిన ఒక రోజు తరువాత, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారనీ, తమ సిబ్బందిపై దాడి చేశారని ఆరోపిస్తూ గుర్తు తెలియని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్పెషల్ సీపీ (శాంతి భద్రతలు) సాగర్‌ప్రీత్ హూడా గురువారం మీడియాతో మాట్లాడుతూ 'పోలీసులపై దాడి చేయడం, వారి విధులకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఆస్థులను ధ్వంసం చేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశాం' అని తెలి పారు. 'ఆందోళనకారులు బారికేడ్లను విరగొట్టారు. కొందరు టైరుకు నిప్పంటించి మా సిబ్బంది పై దాడి చేశారు. మేం ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం' అని చెప్పారు.