Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 నుంచి 20 వరకు దేశవ్యాప్త ఆందోళనలు
- ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ పిలుపు
న్యూఢిల్లీ :సాయుధ దళాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల భర్తీ కోసం మోడీ సర్కార్ తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలనీ, దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించాలని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ పిలుపు ఇచ్చాయి. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జూన్ 18 నుంచి 20 వరకు దేశవ్యాప్త ఆందోళనలకు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ పిలుపునిచ్చాయి. ఈ మేరకు గురువారం ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూఖ్ బిస్వాస్ ప్రకటన విడుదల చేశారు. అగ్నిపథ్ పథకం ప్రకటించిన తర్వాత ఇప్పటికే 11 మంది ఆత్మహత్య చేసుకున్నారనీ, ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త సైనిక నియామక పథకం ఒక విపత్తనీ, దేశ సార్వభౌమత్వానికి ప్రమాదమని అన్నారు. గత రెండేండ్లుగా సాధారణ సైనిక నియామకాలు జరగడం లేదనీ, 2021 నాటికి దేశ సైన్యంలో 1,04,653 మంది సిబ్బంది కొరత ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రాంతీయ కోటాలను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించుకుందని, ఆరు నెలల శిక్షణ కాలంతో సహా నాలుగు సంవత్సరాల స్వల్పకాలిక ఉద్యోగ కల్పనకు నిర్ణయించిందని విమర్శించారు. నాలుగు సంవత్సరాల తర్వాత దాదాపు మూడు వంతుల మంది సైనికులు పెన్షన్, గ్రాట్యుటీ లేకుండా పదవీ విరమణ చేస్తారని తెలపడం దారుణమన్నారు.
'అగ్నిపథ్'పై సీఐటీయూ తీవ్ర ఆందోళన.. పథకం రద్దుకు డిమాండ్
జాతీయ ప్రయోజనాల దృష్ట్యా 'అగ్నిపథ్' పథకాన్ని రద్దు చేయాలని సీఐటీయూ ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఎలాంటి పెన్షన్ నిబంధనలు లేకుండానే దేశంలోని సాయుధ దళాల్లో నియామకాలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన పథకంపై తీవ్ర ఆందోళనను, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. కేంద్రం తిరోగమన రూపకల్పనను సీఐటీయూ ఖండించింది. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆకస్మిక నిరసనలు వెల్లువెత్తడాన్ని స్వాగతించింది. దేశ సాయుధ బలగాలతో ఇటువంటి వినాశకరమైన ప్రయోగాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించు కోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఇలాంటి దేశ వ్యతిరేక రూపకల్పనపై నిరసనలు, నిరాకరణల స్వరం పెంచాలని ప్రజలకు పిలుపునిచ్చింది. నియామకంలో కాంట్రాక్టరైజేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టడానికి కేంద్రం ధైర్యం చేస్తున్నదని ఆరోపించింది. 'మన జవాన్ల' విషయంలో నకిలీ జాతీయవాదాన్ని, నకిలీ దేశభక్తిని ప్రోత్సహిస్తున్న కేంద్రం కపటత్వాన్ని ఇది బహిర్గతం చేస్తున్నదని వివరించింది. ఇలాంటి తిరోగమన చర్య తీవ్రంగా రాజీ పడటంతో పాటు ఉపాధి నాణ్యతను, మన సాయుధ బలగాల సామర్థ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. సాయుధ దళాల ప్రమాణాల ప్రకారం శిక్షణ పొందిన, 'అగ్నిపథ్' పథకం కింద ఆర్మీలో చేరిన యువ సైనికులు నాలుగు ఏండ్ల తర్వాత ఉద్యోగానికి దూరమవటంతో వారి భవిష్యత్తు అనిశ్చిత పరిస్థితిలోకి వెళ్తుందని పేర్కొన్నది.