Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెరిగిన భారతీయుల డిపాజిట్లు
- 2021నాటికి రూ.30,500కోట్లకు చేరిక
- రెండేండ్లుగా పెరుగుతున్న నగదు జమ
- ఖాతాదార్ల వివరాలు ఇస్తున్నా..బయటపెట్టని మోడీ సర్కార్
- రహస్యంగా ఉంచుతామని మాటిచ్చాం..చెప్పబోమన్న కేంద్ర ఆర్థికశాఖ
న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన బడా కార్పొరేట్లు, అత్యంత ధనికులు స్విస్ బ్యాంకుల్లో సొమ్ము దాచుకోవటం మళ్లీ ఊపందుకుంది. గత ఏడాది(2021) చివరినాటికి ఈ నిధులు 14ఏండ్ల గరిష్టస్థాయి 383 కోట్ల స్విస్ ఫ్రాంక్‌లకు (సుమారు రూ.30,500కోట్లు) చేరాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 50శాతం ఎక్కువ. జ్యూరిచ్‌లోని 'స్విట్జర్లాండ్ జాతీయ బ్యాంక్' తాజాగా ఈ గణాంకాలు విడుదల చేసింది. భారత్‌కు చెందిన వ్యక్తులు, సంస్థల డిపాజిట్లు, రుణ పత్రాలు, ఇతర పెట్టుబడుల రూపంలో స్విస్ బ్యాంకుల్లో ఈ నిధులు దాచిపెట్టారు. ఇందులో సేవింగ్స్, డిపాజిట్ల రూపంలో ఉన్న నిధులే ఏడేండ్ల గరిష్ట స్థాయి రూ.4,800 కోట్లకు చేరాయి. అయితే 2006 నాటికి స్విస్ బ్యాంకుల్లో మనదేశానికి చెందిన వ్యక్తులు, సంస్థలకు 650 కోట్ల స్విస్ ఫ్రాంక్‌ల (రూ.52,500కోట్లు) నిధులు ఉండేవి. అక్రమ ఆర్థిక లావాదేవీలకు స్విస్ బ్యాంకులు కేంద్రంగా నిలుస్తున్నాయన్న ఆరోపణలు ఊపందుకోవటంతో, ఇక్కడ్నుంచి ఇతర దేశాల్లోని బ్యాంకులకు నిధులు తరలిపోయినట్టు నిపుణులు చెబుతున్నారు. అయినా ఇదంతా కూడా అకౌంటెడ్ (అధికారంగా నమోదైన వివరాలు) మనీ మాత్రమే. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం పెద్ద ఎత్తున ఉందని ఆరోపణలున్నాయి. ప్రసాస భారతీయులు, భారత్‌కు చెందిన వ్యక్తులు, సంస్థలు...స్విస్ బ్యాంకులకు తరలించిన పెట్టుబడులు ఇంకా పెద్దమొత్తంలో ఉంటాయని అంచనా.
అబ్బే చెప్పం..చెప్పం..
ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో బడా కార్పొరేట్లు, పన్ను ఎగవేతదారులు, ఆర్థిక నేరగాళ్లు, అవినీతి రాజకీయ నాయకులు.. అక్రమంగా సంపాదించిన సొమ్ము దాచుకోవడానికి ప్రధాన కేంద్రం స్విట్జర్లాండ్. అక్కడి బ్యాంకులు వీరికి తలుపులు బార్లా తెరిచి ఉంచుతాయి. ఖాతాదార్ల వివరాలు చాలా రహస్యంగా ఉంచుతాయన్న భరోసా ఆ బ్యాంకుల నుంచి లభిస్తోంది. అయితే ఆయా దేశాల నుంచి వచ్చిన ఒత్తిడి తర్వాత కొన్ని బ్యాంకులు తమ నిబంధనల్ని మార్చాయి. ఖాతాదార్ల వివరాల్ని 2018 నుంచి ఆయా దేశాల ప్రభుత్వాలతో బ్యాంకులు పంచుకుంటున్నాయి. ఖాతాదారుడి పేరు, దేశం, చిరునామా, ఐటీ గుర్తింపు నెంబర్..మొదలైనవన్నీ ఇస్తోంది. ఖాతాలో బ్యాలెన్స్ సైతం చెబుతోంది. భారతీయుల ఖాతాల వివరాలు ఇవ్వాలని అక్టోబర్, 2019లో స్విట్జర్లాండ్-భారత్ మధ్య ఒప్పందం కుదిరింది. మోడీ సర్కార్‌కు ఆ వివరాలు అందుతున్నాయి. నల్లధనం బయటకు తీసుకువస్తానని ప్రజలకు వాగ్దానం చేసిన ప్రధానిమోడీ, ఆ వివరాల్ని మాత్రం బయటపెట్టడం లేదు. కేంద్ర ఆర్థిక శాఖ ససేమిరా అంటోంది. ఖాతాదార్ల వివరాలు బహిర్గతం చేయమని స్విట్టర్లాండ్కు మాటిచ్చాం..కాబట్టి బయటకు వెల్లడించమని కేంద్రం చెబుతోంది.
భారత్..44వ స్థానంలో..
స్విట్జర్లాండ్‌లోని దాదాపు 239 బ్యాంకుల్లో భారతీయులకు, ప్రవాస భారతీయులకు పెద్ద సంఖ్యలో ఖాతాలున్నాయి. వీటిల్లో కస్టమర్ డిపాజిట్లు 2021నాటికి దాదాపు 2 లక్షలా 25వేల స్విస్ ఫ్రాంక్స్‌కు (సుమారుగా రూ.180లక్షల కోట్లు) పెరిగాయి. విదేశీ కస్టమర్ల నిధులకు సంబంధించిన జాబితాలో బ్రిటన్, అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉంది. భారత్ 44వ స్థానంలో ఉంది. 2020, 2021 సంవత్సరాల్లో స్విస్ బ్యాంకులకు తరలిన భారతీయుల సంపద గణనీయంగా పెరిగింది. జాతీయత, చిరునామా, ఐటీ నెంబర్..మొదలైన వివరాలున్న భారతీయుల ఖాతాల వివరాలు చాలా తక్కువగా ఉన్నాయని, మారు పేర్లతో, రహస్యంగా, ఇతర దేశాల ద్వారా స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న సొమ్ము భారీ ఎత్తున ఉందని వార్తలు వెలువడుతున్నాయి.