Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానాలో ఫైరింగ్.. డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి
- ఒకరు మృతి
- పలు ప్రాంతాల్లో హింసాత్మకం
- 12 రైళ్లకు నిప్పు.. సర్వీసులకు అంతరాయం : భారత రైల్వే
- బీహార్‌లో అదే తీరు..
- యూపీ, ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఎంపీలలో కొనసాగిన నిరసనలు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద పథకం 'అగ్నిపథ్'పై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. పలు ప్రాంతాల్లో యువత, ఆర్మీ ఉద్యోగార్థులు, నిరసనకారులు ఆందోళనల్లో పాల్గొన్నారు. పథకాన్ని రద్దు చేయాలని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించారు. అగ్నిపథ్ నిరసనలతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనకారులు 12 రైళ్లకు నిప్పు పెట్టారు. దీంతో అనేక రైల్వే జోన్లలో పలు రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని భారత రైల్వే శాఖ తెలిపింది.
బీహార్, యూపీలలో మూడో రోజూ నిరసనలు కొనసాగాయి. పలు ప్రాంతాల్లో నిరసనకారులు బయటకు వచ్చి కేంద్రం పథకంపై ఆందోళనను తెలిపారు. ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ లలోనూ కొత్త పథకంపై నిరసన జ్వాలలు ఎగిసి పడ్డాయి. హింసాత్మక పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
బీహార్‌లో ఉప ముఖ్యమంత్రి ఇంటిపై దాడి
బీహార్‌లో ఉప ముఖ్యమంత్రి రేణూ దేవీ ఇంటిపై దాడి జరిగింది. పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టారులో గల ఆమె ఇంటిపై నిరసనకారులు దాడి చేశారు. పాట్నాలో ఉన్న ఆమె.. ఇలాంటి ఘటనలు మంచివి కావన్నారు. బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజరు జైస్వాల్ ఇంటిని నిరసనకారులు ధ్వంసం చేశారు. బెట్టియా పట్టణంలో ఇది చోటు చేసుకున్నది. ఔరంగబాద్‌లో నాలుగు స్కూల్ బస్సులకు నిప్పు పెట్టారు. సాసారామ్లోని మాధేపురలో బీజేపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఆఫీసుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. సమస్తిపూర్‌లో లోహిత్ ఎక్స్‌ప్రెస్‌కు నిరసనకారులు నిప్పంటించారు.
దానాపూర్ రైల్వే స్టేషన్లో దాదాపు 1500 మంది ఆందోళనకారులు నిరసనలు వ్యక్తం చేశారు. విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ 24 మంది నిరసనకారులను అరెస్టు చేశారు. హాజీపూర్ రైల్వే స్టేషన్ వద్ద నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్నిపథకంపై బీహార్‌లో బుధవారం నుంచి తీవ్ర నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడి పరిస్థితులు క్షణక్షణం ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) నేడు (శనివారం) బీహార్ బంద్‌కు పిలుపునిచ్చింది. అర్రా, లఖిసరారులోనూ ఆందోళనలు కొనసాగాయి.
యూపీలో ఆగని ఆందోళనలు
యూపీలోని బల్లియాలో గల రైల్వే స్టేషన్లోకి నిరసనకారులు ఉదయం చేరుకున్నారు. అక్కడ ఒక రైల్వే కోచ్‌కు నిప్పు పెట్టారు. రైల్వే ఆస్థిని ధ్వంసం చేశారు. అనంతరం పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. ఈ నిరసనలు మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం వారణాసితో పాటు ఫిరోజాబాద్, అమేథీ లకూ వ్యాపించాయి. ఈ ఆందోళనల్లో బస్సులు, ఇతర ప్రభుత్వాస్థులకు నష్టం వాటిల్లింది. అలీఘర్‌లో స్థానిక బీజేపీ నాయకుడి కారుకు ఆందోళనాకారులు నిప్పు పెట్టారు. బల్లియా, అలీఘర్,తో పాటు 17 ప్రాంతాల్లో ఆందోళనలు చోటు చేసుకున్నట్టు తమకు సమాచారమందిందని యూపీ శాంతి భద్రతల విభాగం ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
ఢిల్లీలో కొనసాగిన ఆందోళనలు
ఢిల్లీలో ఆందోళనల పర్వం కొనసాగింది. ఈశాన్య ఢిల్లీలోని ఖజురీ ప్రాంతంలో గల వజియారాబాద్ రోడ్డుపై పరిస్థితులు హింసా త్మకంగా మారాయి. నిరసనకారులను బస్సుల ను లక్ష్యంగా చేసుకున్నారు. అగ్నిపథ్‌పై నిరసన చేసిన చేసిన ఆప్ విద్యార్థి విభాగం కార్యకర్తల ను పోలీసులు నిర్బంధించారు. ఢిల్లీ గేట్, జామా మజీద్ మెట్రో స్టేషన్ల అన్ని గేట్లను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మూసివేసింది.
హర్యానాలో ఇంటర్నెట్ నిలిపివేత
హర్యానాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. పల్వాల్లో హింసాత్మక ఘటనల అనం తరం అక్కడి ప్రభుత్వం మహేంద్రగర్, బల్ల భ్గర్లలో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపి వేసింది. నార్నౌల్‌లో సెక్షన్ 144ను ధిక్కరించి నిరసనకారులు ఆందోళనలు చేశారు.
పశ్చిమ బెంగాల్లో రోడ్ల దిగ్బంధం
పశ్చిమ బెంగాల్‌కూ 'అగ్నిపథ్' నిరసనలు పాకాయి. హౌరా బ్రిడ్జిని ఆందోళనకారులు బ్లాక్ చేశారు. ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని భత్పారలోనూ రోడ్లను దిగ్బంధించారు. రైల్వే ట్రాక్‌లను కూడా బ్లాక్ చేశారు. సిలుగురిలోనూ ఇలాంటి ఆందోళనలే చోటు చేసుకున్నాయి. తూర్పు మధ్య రైల్వే ప్రాంతానికి చెందిన రైల్వే సర్వీసులపై అక్కడి నిరసనల ప్రభావం పడింది. మధ్యప్రదేశ్‌లోనూ ఆందోళనకారులు నిరసనలకు దిగటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
300 రైళ్లకు అంతరాయం : రైల్వే శాఖ
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనాకారులు ప్రధానంగా రైల్వే స్టేషన్లకు చేరుకొని నిరసనలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో 12 రైళ్లకు నిప్పు పెట్టారని భారత రైల్వే వెల్లడించింది. అలాగే, 300కు పైగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని వివరించింది. ఇందులో 214 రైళ్లు రద్దు కాగా, 11 ట్రైన్స్‌ను దారి మళ్లించారు. 90 రైళ్లు వాటి గమ్యస్థానాలకు చేరుకోలేదని రైల్వే శాఖ తెలిపింది. హింసాత్మక నిరసనల్లో పాల్గొనద్దనీ, రైల్వే ఆస్థులను ధ్వంస చేయొద్దని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ యువతను కోరారు. అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం గురువారం ప్రకటించిన విషయం విధితమే. దీనిని మార్పును తీసుకొచ్చే పథకంగా అభివర్ణించింది. త్రివిధ దళాల్లో (ఆర్మీ, నేవీ, వాయు సేనలు) నాలుగేండ్ల స్వల్ప కాలిక కాంట్రాక్టు సర్వీసు కోసం ఈ పథకం కింద సైనికుల నియామకం జరుగుతుంది. అయితే, ఈ పథకంలో స్వల్ప కాలిక సర్వీసు, పెన్షన్ లేకపోవటం, 17.5 నుంచి 21 ఏండ్ల మధ్య వయసున్న వారినే అర్హులను చేయటంపై దేశ యువత తీవ్ర ఆందోళనన వ్యక్తం చేస్తున్నది. కాగా, వయో పరిమితిని కేంద్రం 21 ఏండ్ల నుంచి 23కు పెంచింది.
ప్రతిపక్షాల విమర్శల దాడి
దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు విమర్శల దాడికి దిగాయి. పథకంపై కాంగ్రెస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జాతి ప్రయోజనాల దృష్ట్యా దీనిని వెనక్కి తీసుకోవాలని ఆ పార్టీ ఎంపీ దీపేంద్ర హుడా డిమాండ్ చేశారు. 'అగ్నిపథ్'ను రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకు రాలు ప్రియాంక గాంధీ వాద్రా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయం నిర్లక్ష్యపూరితమైనదని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తెలిపారు. రక్షణ రంగ నిపుణులు, అన్ని వర్గాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంపీ కే.సీ వేణుగోపాల్ రక్షణశాఖపై పార్లమెంటు స్టాండి ంగ్ కమిటీని కోరారు. 21 ఏండ్లకే సైనికులను మాజీలుగా ఎలా చేస్తామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'అగ్నివీర్'ల శిక్షణకు ఆర్మీ ప్రణాళిక
అగ్నిపథ్ పథకం కింద ఈ ఏడాది డిసెంబర్లో 'అగ్నివీర్'ల శిక్షణకు ఆర్మీ ప్రణాళిక చేస్తున్నది. వచ్చే ఏడాది మధ్య నాటికి వారిని సర్వీసుల్లోకి పంపించనున్నట్టు ఆర్మీ వెల్లడిం చింది. దీనిపై సోమవారం పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్టు ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నది.