Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బీజేపీ ప్రభుత్వం తీసుకున్న దేశ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చర్య అగ్నిపథ్ పథకాన్ని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఖండించింది. ఈ పథకాన్ని రద్దు చేయాలని ఏఐకేఎస్ 21న దేశవ్యాప్త ఆందోళనకు పిలుపు ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ ధావలే, హన్నన్ మొల్లా ప్రకటన విడుదల చేశారు. దేశ యువతకు ఉపాధి కల్పించడంలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి ఇది ఒక ప్రయత్నమనీ, ఇది వృత్తి నైపుణ్యం, ఉపాధి నాణ్యత, సాయుధ దళాల సామర్థ్యంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుందని విమర్శించారు. నిరసనకారులపై బీజేపీ - ఆర్ఎస్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నాయనీ, యువతను క్రూరమైన శక్తిని ఉపయోగించి అణిచివేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఏఐకేఎస్ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఈ చర్య ఉద్యోగాలను పొందాలనే ఆశతో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆకాంక్షలను అవమానించిందనీ, ఇది దేశ సాయుధ బలగాలను కూడా అణగదొక్కుతుందని విమర్శించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన ప్రభుత్వం, ఇప్పుడు పింఛను లేకుండా ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ (నాలుగేండ్లు) ప్రకటించి నిరుద్యోగ యువతను మోసం చేస్తోందని విమర్శించారు. రైల్వేలు, విశ్వవిద్యాలయాలు మొదలైన వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో రిక్రూట్మెంట్ నిషేధాన్నీ తప్పనిసరిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం, సంఫ్‌ు పరివార్ రెచ్చగొట్టే చర్యలకు లోనుకాకుండా 21న ఈ మోసపూరిత పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు నిర్వహించాలని ఏఐకేఎస్ అన్ని యూనిట్లకు పిలుపునిచ్చిందని తెలిపారు.