Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిరుద్యోగుల చావులకు మోడీది బాధ్యత కాదా?
- జగన్, కేసీఆర్ ఎందుకు స్పందించరు?
- తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఆందోళనలు
- మీడియాతో ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
న్యూఢిల్లీ : సాయుధ దళాల్లో కాంట్రాక్టీకరణ ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఈ నెల 21న దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్టు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పోలీసు కాల్పుల్లో మరణించిన యువకుడికి ఏఐఏడబ్ల్యూయూ సంతాపం తెలుపుతుందన్నారు. నిరుద్యోగ యువత చావులకు, కాల్పులకు ప్రధాని మోడీది బాధ్యత కాదా? కేంద్ర ప్రభుత్వానిది బాధ్యత కాదా? అని ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఘటనపై స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. నిజాలను అవాస్తవాలుగా ప్రచారం చేయడంలో బీజేపీ దిట్ట అనీ, అందుకే నిరుద్యోగుల గోస వారికి కుట్రలా కనబడుతున్నదని విమర్శించారు. సైనికులకు ఇవ్వడానికి నిధులు లేవంటున్న మోడీ సర్కార్, అదాని, అంబానీలకు మాత్రం లక్షల కోట్లు రాయితీలు ఇస్తున్నదని విమర్శించారు. మోడీ సర్కార్‌కు సైన్యం ముఖ్యం కాదనీ, అదాని, అంబానీలే ముఖ్యమని ఎద్దేవా చేశారు. అగ్నిపథ్ పథకం వల్ల దేశ భద్రత, రక్షణకు నష్టం జరుగుతుందని అన్నారు. సైన్యంలో గ్రామీణ, పట్టణ పేద, మధ్య తరగతి వర్గాల వారే చేరుతున్నారని, మిలినీయర్ పిల్లలు చేరటం లేదని అన్నారు.
జగన్, కేసీఆర్‌లు ఎందుకు స్పందించరు?
అగ్నిపథ్‌పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు ఎందుకు స్పందించటం లేదని వెంకట్ ప్రశ్నించారు. కేంద్రానికి ఊడిగం చేస్తున్నారా అని ప్రశ్నించారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలని ప్రధాని మోడీకి జగన్, కేసీఆర్‌లు లేఖలు రాయాలని డిమాండ్ చేశారు. దేశంలో చారిత్రాత్మక రైతు పోరాటానికి దిగొచ్చి రైతు వ్యతిరేక చట్టాలను మోడీ సర్కార్ ఎలా రద్దు చేసిందో, అలానే దేశ యువత వ్యతిరేక అగ్నిపథ్ పథకాన్ని కూడా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసేవరకు కలిసొచ్చే సంఘాలతో ఆందోళన కొసాగిస్తామని పేర్కొన్నారు. నేడు, రేపు (శని, ఆదివారాల్లో) ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన చేస్తామని తెలిపారు.