Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం నోటిఫికేషన్
న్యూఢిల్లీ : దొంగ ఓట్లు, నకిలీ ఓట్ల నమోదుకు చెక్ పెడుతూ... ఓటరు జాబితాకు ఆధార్ కార్డును అనుసంధించాలని కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను శనివారం జారీచేసింది. దొంగ ఓట్లు, నకిలీ నమోదు బెడదను తప్పించి.. ఎన్నికల ప్రక్రియను మరింత సమగ్రం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
ఓటరు నమోదు రిజిస్ట్రేషన్‌కు అవకాశం పెంపు
ఇప్పటివరకు ఏడాదిలో జనవరి ఒకటో తేదీన మాత్రమే ఓటరు నమోదు అవకాశం కల్పిస్తున్నారు. ఇకపై సర్వీస్ ఓటర్ల నమోదులో లింగ తటస్థతకు వీలుకల్పిస్తూ, ఏడాదికి ఒక్కసారే అవకాశమున్న ఓటరు నమోదు రిజిస్ట్రేషన్‌ను నాలుగు సార్లకు పెంచుతూ మరో మూడు నోటిఫికేషన్లు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి ఒకటి, ఏప్రిల్ ఒకటి, జూలై ఒకటి, అక్టోబరు ఒకటో తేదీల్లో.. ఏదో ఒకరోజున 18 ఏండ్లు పూర్తిచేసుకున్న యువతీయువకులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఎన్నికల నిబంధనల్లో లింగ తటస్థతను పాటిస్తాం : న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు
న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ... గత ఏడాది పార్లమెంటు ఆమోదించిన ఎన్నికల నిబంధనల సవరణ చట్టం-2021ను అనుసరించి ఈ నోటిఫికేషన్లను కేంద్రం విడుదల చేసిందన్నారు. ఎన్నికల ప్రక్రియలో రావాల్సిన సంస్కరణల దిశగా మోడీ సర్కారు వేసిన చారిత్రక అడుగుగా వర్ణించారు. నోటిఫికేషన్ల విడుదలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘాన్ని తాను సంప్రదించానని అన్నారు. ఇకపై ఎన్నికల నిబంధనల్లో లింగ తటస్థతను పాటిస్తూ.. సర్వీస్ ఓటర్ల గడిలో భార్య లేక భర్త అనే పదాన్ని తొలగించి.. జీవిత భాగస్వామి అనే మాట కొత్తగా చేర్చినట్టు తెలిపారు. సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులు, విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబాలను సర్వీసు ఓటర్లుగా పరిగణిస్తారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.