Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొగ్గు దిగుమతుల్లో మోడీ ప్రభుత్వ నిర్వాకం
న్యూఢిల్లీ : అదానీ గ్రూపుతో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కుబేరుల్లో మొదటి రెండు, మూడు స్థానాలకు ఎగబాకిన అదానీకి లబ్ధి చేకూర్చడం కోసం మోడీ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా అటువంటి వ్యవహారమే మరొకటి వెలుగులోకి వచ్చింది. కొంత కాలం కిందట దేశ వ్యాప్తంగా బొగ్గుకు తీవ్ర కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. ఫలితంగా అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు అమలు చేయాల్సి వచ్చింది. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన వివిధ అంశాల నేపథ్యంలో అప్పట్లో దేశ వ్యాప్తంగా బొగ్గు కొరతను కృత్రిమంగా సృష్టించారని, అదానికి భారీ మొత్తంలో లబ్ధి చేకూర్చడానికే ఈ అడ్డదారులు తొక్కారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలల పాటు సాగిన ఈ వ్యవహారంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు భారీ లబ్ధి చేకూరింది. దీనికోసం అప్పటికే అమలులో ఉన్న సాంప్రదాయాలకు కేంద్ర ప్రభుత్వం గండికొట్టింది. దేశంలో బొగ్గుకు కృత్రిమ కొరత సృష్టించడంతో పాటు, విదేశాలతో హడావిడిగా వాణిజ్య ఒప్పందాలను చేసుకుంది. దిగుమతి సుంకాలను తగ్గించింది. రాష్ట్రాలు చేసుకున్న దిగుమతి ఒప్పందాలను సస్పెండ్ చేసి కోల్ఇండియా నేరుగా అదాని సంస్థ నుండి బొగ్గును దిగుమతి చేసుకుంది. కోల్ఇండియా దిగుమతులు చేసుకోవడం 2015వ సంవత్సరం తరువాత ఇదే మొదటిసారి. ఇప్పటివరకు బొగ్గు దిగుమతుల ఒప్పందాలు, బేరసారాలు ఆయా సంస్థలు లేదా కంపెనీలు చేసుకునేవి. తాజాగా ప్రభుత్వం, ప్రభుత్వాల మధ్య (గవర్నమెంటు టు గవర్నమెంటు) విధానంలో దిగుమతులను చేపడుతోంది. ఈ విధానంలో విదేశాంగశాఖ, ఆర్థికశాఖ ప్రధానపాత్ర వహిస్తాయి. తద్వారా అస్మదీయులకు లబ్ధి చేకూరుతుంది.
ఎలా జరిగింది....?
ఆస్ట్రేలియాలోని కార్మికెల్ గని నుండి అదానీ మైనింగ్ సంస్థ గత ఏడాది డిసెంబర్లో బొగ్గు ఎగుమతులకు సిద్ధమైంది. అంతకుముందు దాదాపు ఏడు సంవత్సరాల పాటు పర్యావరణ వివాదాలను ఆ సంస్థ ఎదుర్కుంది. సంవత్సరానికి పది మిలియన్ టన్నుల బొగ్గును ఎగుమతి చేయాలన్నది ఆ సంస్థ ప్రారంభ లక్ష్యం. ఆ మేరకు తమకు ఆర్డర్లు కూడా ఉన్నాయని అప్పట్లో ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఎగుమతి చేసుకునే దేశము, ధరల వివరాలను ఆ సంస్థ ప్రకటించ లేదు. అయితే, సంస్థ ఉత్పత్తుల్లో అత్యధిక భాగం భారత్‌కు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని మీడియాలో కథనాలు వచ్చాయి. నిజానికి, అప్పటికి మన దేశానికి అవసర మయ్యే బొగ్గును ఇండోనేషియా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అంతర్జాతీయ ఒప్పందాల నేపథ్యం లో ఈ దిగుమతులను అప్పటికప్పుడు ఆపివేయడం అసాధ్యం. ఇండోనేషియా నుండి వస్తున్న బొగ్గు దేశీయ డిమాండ్‌ను అందుకోకపోతే ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా బొగ్గు కొరతను సృష్టించారన్న వాదన వినిపిస్తోంది.
రంగంలోకి కేంద్రం...
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఆస్ట్రేలియా నుండి చేసుకునే బొగ్గు దిగుమతులు పెంచడానికి అవసరమైన చర్యలను చేపట్టింది. ఆస్ట్రేలియా నుండి దిగుమతయ్యే బొగ్గుకు 2.5శాతం డ్యూటీ ఉండగా, దీనిని సున్నా శాతం చేయాలని నిర్ణయించింది. చైనా ప్రభుత్వం ఆస్ట్రేలియా దిగుమతులను పూర్తిగా నిలిపివేయడంతో సౌహార్ధ్ర చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. మే నెల 23, 24 తేదీల్లో టోక్యోలో క్వాడ్ దేశాధినేతల సమావేశం జరగగా, అంతకు రెండు రోజుల ముందే ఈ మేరకు అధికారిక నిర్ణయం వెలువడింది. క్వాడ్ సమావేశంలో భాగంగా భారత ప్రధాని ఆస్ట్రేలియా ప్రధానితో జరిపిన ముఖాముఖి భేటీలోనూ బొగ్గు దిగుమతుల విషయం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.
కోల్ ఇండియాకు అదేశాలు..
క్వాడ్ దేశాల సమావేశం నుండి ప్రధాని స్వదేశానికి చేరుకున్న కొద్దిరోజులకే 12 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతులకు సిద్ధం కావాలని కోల్‌ఇండియాకు ఆదేశాలు అందాయి. జూన్ 3న కేంద్ర ప్రభుత్వం నుండి ఈ మేరకు ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. అప్పటివరకు రాష్ట్రాలు తమకు అవసరమైన బొగ్గును నేరుగా దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే, నాణ్యతను సాకుగా చూపుతూ కోల్ ఇండియానే మొత్తం బొగ్గును దిగుమతి చేసుకోవాలని, జులై 2023 వరకు (రానున్న 13 నెలల కాలనానికి) తలెత్తే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది.
అదానీ సంస్థకు 8 వేల కోట్ల ఆర్డర్
కోల్ ఇండియా నుండి అందిన సూచనల మేరకు ఎన్టిపిసి 6.25 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతుల కోసం టెండర్లు పిలవగా దాదాపుగా 8 వేల కోట్ల రూపాయల ఆర్డర్‌ను అదానీ సంస్థ చేజిక్కించుకుంది. అదానీతో పాటు ఇతర దేశాలకు చెందిన మరో మూడు సంస్థలు కూడా టెండర్ల ప్రక్రియలో పాల్గొనప్పటికీ, ఆస్ట్రేలియా నుండి బొగ్గు దిగుమతులకు డ్యూటీని సున్నా శాతం చేసి ఉండటంతో ఆ సంస్ధలు పోటీలో నిలవలేకపోయాయి.