Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నేతలు అరెస్టు... అవి అక్రమ అరెస్టులు : ఏచూరి
న్యూఢిల్లీ . సాయుధ బలగాల్లో కాంట్రాక్టు పద్దతిని తీసుకొచ్చేందుకు ప్రకటించిన ''అగ్నిపథ్'' పథకానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ చలో పార్లమెంట్‌ను నిర్వహించాయి. అయితే ఈ ఆందోళనపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు క్రూరమైన దాడికి పాల్పడ్డాయి. పలువురు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులను అరెస్టు చేశారు. నిరసన తెలుపుతున్న యువత గొంతును అణచివేస్తున్న కేంద్ర ప్రభుత్వ దౌర్జన్యాన్ని ఖండించాలని ఆయా సంఘాల నేతలు పిలుపు ఇచ్చారు. ఈ అక్రమ అరెస్టులను సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఖండించారు. ''అగ్నిపథ్'' స్కీమ్ కి వ్యతిరేకంగా చలో పార్లమెంట్‌ను ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ సంఘాలు ఆదివారం చేపట్టాయి. రాజ్యసభ ఎంపీ, డివైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు ఎ.ఆర్ రహీమ్, డీవైఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమగరాజ్ భట్టాచార్య, ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి మయూఖ్ బిస్వాస్, డీవైఎఫ్ఐ ఢిల్లీ కార్యదర్శి అమన్ సైనీ, ఎస్ఎఫ్ఐ ఢిల్లీ కార్యదర్శి ప్రితీష్ మీనన్, డేఎన్యూఎస్యూు అధ్యక్షురాలు ఐషీ ఘోష్‌తో సహా పార్లమెంటు వైపు మార్చ్ చేస్తున్న ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు క్రూరంగా నిర్బంధించారు. విద్యార్థినీలపై మగ పోలీసులు దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, ఆయా సంఘాల కార్యకర్తలను పోలీసులు వేధించారు. పలువురు విద్యార్థి, యువకులు గాయపడగా, మరో యువకుడి దుస్తులు చిరిగిపోయాయి. డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు రహీమ్ రాజ్యసభ ఎంపీ అని కూడా చూడకుండా దారుణంగా దాడికి పాల్పడ్డారు. అరెస్టు చేసిన నేతలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నేతలు బిస్వాస్, రహీమ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు ఇది కొనసాగింపు అని స్పష్టం చేశారు. యువత గొంతులపై అణచివేత కేంద్ర ప్రభుత్వ నిరంకుశ స్వభావాన్ని ఎత్తిచూపుతోందని విమర్శించారు. యుపిలోని సహరాన్పూర్ కార్యదర్శి సాగర్ గౌతం అరెస్టు, అస్సాం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నిరంకుష్ నాథ్‌ను తిన్సుకియాలో జరిగిన ఒక సదస్సు హాజరైన సందర్భంగా పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించారు. వీరంతా శనివారం జరిగే అగ్నిపథ్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొనడం వల్లనే అరెస్టు చేశారని తెలిపారు.
ఈ కొత్త రిక్రూట్మెంట్ విధానం దేశంలోని ఔత్సాహిక యువతకు విపత్తు తెచ్చిపెట్టిందని విమర్శించారు. 2021 నాటికి దేశ సైన్యంలో 1,04,653 మంది సిబ్బంది కొరత ఉందని తెలిపారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల స్వల్పకాల నిర్బంధం ద్వారా రిక్రూట్మెంట్ చేయాలని నిర్ణయించిందని, ఆ తరువాత నాల్గో వంతు మంది సైనికులు పెన్షన్, గ్రాట్యుటీ లేకుండా రిటైర్ అవుతారని అన్నారు. ఈ విధానం మన దేశ సార్వభౌమత్వానికి ప్రత్యక్షంగా ముప్పు తెస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నయా ఉదారవాద ఎజెండా దేశంలోని ప్రతి ఉద్యోగాన్ని కాంట్రాక్టు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని, మిలిటరీ రిక్రూట్మెంట్కు తాజా ముప్పు దేశంలోని ప్రభుత్వ ఆస్తులను పలుచన చేయడానికి, ప్రైవేటీకరించడానికి మరొక ప్రయత్నమని ధ్వజమెత్తారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, అప్పటి వరకు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ప్రతిఘటిస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. పోలీసుల దౌర్జన్యం, అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత, అన్ని అభ్యుదయ సంఘాలు ఆందోళనలు చేయాలని పిలుపు ఇచ్చారు.