Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ బంద్.. 700కిపైగా రైళ్లు రద్దు
- వాట్సాప్ గ్రూప్‌లపై నిషేధం
- ఆయా రాష్ట్రాల్లో పెద్దఎత్తున భద్రతా బలగాల మోహరింపు
- ఢిల్లీ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్
న్యూఢిల్లీ : 'అగ్నిపథ్' పథకాన్ని రద్దు చేయాలంటూ సోమవారం తలపెట్టిన భారత్ బంద్..అనేక రాష్ట్రాలపై ప్రభావం చూపింది. సోమవారం దేశవ్యాప్తంగా దాదాపు 700కిపైగా రైళ్లు రద్దయ్యాయి. రద్దయినవాటిలో 181 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 348 ప్యాసింజెర్ రైళ్లు ఉన్నాయని రైల్వే శాఖ తెలిపింది. బంద్ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో భద్రతా బలగాలను, పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. ముఖ్యంగా రైల్వే స్టేసన్ల వద్ద, కేంద్ర ప్రభుత్వ సంస్థ కార్యాలయాల వద్ద, బస్టాండ్ల వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో కనిపించారు. నిఘా వర్గాల సమాచారంతో ఆయా రాష్ట్రాల్లో యువత నేతృత్వంలోని వందలాది వాట్సాప్ గ్రూప్‌లపై పోలీసులు నిషేధం విధించారు. ఆందోళనా కార్యక్రమాలకు వాట్సాప్‌ను యువత పెద్ద ఎత్తున వినియోగిస్తోందన్న సమాచారంతో వాటిలో వచ్చే సమాచారంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు దృష్టిపెట్టాయి.
జూన్ 17న దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల నేపథ్యంలో, అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం రద్దు చేయాలని ఆర్మీ ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు, వివిధ ఆర్గనైజేషన్స్ డిమాండ్ చేశాయి. దీనిపై 72గంటల్లో కేంద్రం నిర్ణయం వెలువరించాలని తెలిపాయి. లేదంటే దేశవ్యాప్తంగా భారత్ బంద్ చేపడతామని ప్రకటించాయి. యువత శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరాయి. ఆర్మీ రిక్రూట్మేంట్ పర్సోనల్ మోర్చా, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, ఐఎన్ఏయూఎస్.. మొదలైనవి ఒక వేదికగా సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ పిలుపును స్వీకరించిన ఆయా రాష్ట్రాల్లోని యువత నిరసన కార్యక్రమాలు చేపట్టింది. హర్యానాలో ఆర్మీ ఆశావాహ అభ్యర్థులు రోడ్లమీదకు వచ్చి ధర్నాలు నిర్వహించారు. లూథియానా, జలంధర్, అమృత్సర్, అంబాలా, రేవారీ, సోనీపాట్ రైల్వే స్టేషన్ల వద్ద భద్రతా బలగాల్ని పెద్ద సంఖ్యలో మోహరించారు. సోమవారం భారత్‌బంద్ నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఎక్కడా కూడా నిరసనలకు చోటు ఇవ్వవద్దని కేంద్ర హోంశాఖ ఆయా రాష్ట్రాల డీజీపీలకు ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. పథకాన్ని నిరసిస్తూ ఆయా సంఘాలు, రాజకీయ పార్టీలు భారత్ బంద్‌లో పాల్గొంటున్నాయన్న సమాచారంతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశాయి.
ఢిల్లీలో..
ఢిల్లీ సరిహద్దులో పోలీసులు విస్రృతంగా తనిఖీలు చేపట్టారు. కిలోమీటర్లమేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీ-గురుగ్రామ్, ఢిల్లీ-నోయిడా హైవేలపై కిలోమీటర్లమేర వాహనాలు నిలిచిపోయాయి. తనిఖీల తర్వాతే వాహనాలను ఢిల్లీ లోపలకు అనుమతిస్తామని పోలీసులు స్పష్టంగా చెప్పడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైవేలపై వేలాది వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. శివాజీ బ్రిడ్జి స్టేషన్లోకి దూసుకెళ్లిన యువజన కాంగ్రెస్ నేతలు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైల్వే ట్రాక్‌పై ఉన్న రైలును కదలనీయకుండా అడ్డుకున్నారు. ట్రాక్‌పై అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు.
జార్ఖండ్‌లో పాఠశాలలకు సెలవు..
అగ్నిపథ్ ఆందోళనల దృష్ట్యా పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. బీహార్‌లోని రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు. జార్ఖండ్‌లో ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లను మూసివేసి సెలవు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డా స్టేషన్ వద్ద పోలీసు బలగాల్ని మోహరించారు. నిరసనల నేపథ్యంలో ఉత్తరాదిలో పలు రైళ్లు రద్దయ్యాయి.