Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెగ్యులర్ క్యాడర్లో నమోదుకు అగ్నివీరులకు దరఖాస్తు అవకాశం
- అవసరాన్ని బట్టీ రెగ్యులర్ క్యాడర్ భర్తీ
- సెలవులు కుదింపు...పెన్షన్, హెల్త్ స్కీమ్‌కు అనర్హులు
- తక్కువ వేతనం... ప్రతినెల వేతనంలో 30శాతం కోత
- ఏ సమయంలోనైనా అగ్నివీర్‌ను తొలగింపు
- అగ్నిపథ్ పథకం నిబంధనలు, షరతులు విడుదల
న్యూఢిల్లీ : అగ్నిపథ్ పథకం కింద ఉద్యోగంలో చేరిన అగ్నివీరులంతా నాలుగేండ్ల తరవాత తిరిగి ఇంటి బాట పట్టనున్నారు. అంటే వంద శాతం అగ్నివీరులను సాగనంపుతారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అగ్నిపథ్ స్కీమ్ నిబంధనలు, షరతులు స్పష్టం చేశాయి. నాలుగేండ్లు పూర్తిచేసిన అగ్నివీరులందరూ డిశ్చార్జ్ అవుతారని అందులో స్పష్టం చేసింది. నాలుగేండ్ల పాటు అగ్నివీరులు వేతనాల్లోంచి 30శాతం కోత విధించిన దానికి, కొంత మొత్తం కేంద్ర ప్రభుత్వం కలిపి డిశ్చార్జ్ అయినప్పుడు వారికి ఇస్తారు. అగ్నివీరులు ఏ రకమైన పెన్షన్ లేదా గ్రాట్యుటీకి అర్హులు కారు. అలాగే వారు ఎక్స్ సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్), క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ (సీఎస్డీ) సౌకర్యాలు, ఎక్స్ సర్వీస్‌మెన్ హోదా, ఇతర సంబంధిత ప్రయోజనాలకు అర్హులుకారు. అగ్నివీర్ల ఆర్మీ చట్టం-1950 కింద నియమించబడతారు. కానీ ఆర్మీ చట్టంలో ఉన్న ప్రయోజనాలు వీరికి లభించవు. సంస్థాగత అవసరాలు, విధానాల ఆధారంగా ప్రతి బ్యాచ్‌లో వారి ఎంగేజ్మెంట్ వ్యవధిని పూర్తిచేసుకున్న అగ్నివీర్లు రెగ్యులర్ క్యాడర్లో నమోదు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అంటే అందులో అవసరాన్ని బట్టే రెగ్యులర్ కేడర్ భర్తీ ఉంటుంది. ఈ దరఖాస్తులను వారి నాలుగేండ్ల వ్యవధిలోని పనితీరుతో సహా ఆబ్జెక్టివ్ ప్రమాణాల ఆధారంగా కేంద్రీకృత పద్ధతిలో పరిగణించబడుతుంది. అగ్నివీర్ల ప్రతి నిర్దిష్ట బ్యాచ్‌లో 25శాతం కంటే ఎక్కువ మంది సాధారణ కేడర్‌లో నమోదు చేయబడరు. అలాగే ప్రస్తుతం ఆర్మీలో చేరిన వారికి ఏడాదికి 90 రోజులు సెలవులు ఉండగా, అగ్నివీర్లకు ఏడాదికి 30 రోజులు మాత్రమే సెలవులు ఉంటాయి.
వేతానానికి సంబంధించి ఉద్యోగంలో చేరిన మొదటి ఏడాది నెలకు రూ.30 వేలు వేతనం ఉండగా, అక్కడ నుంచి ప్రతి ఏడాది పది శాతం వేతనం పెరుగుతుంది. అంటే రెండో ఏడాది నెలకు రూ.33 వేలు, మూడో ఏడాది నెలకు రూ.36,500, నాల్గో ఏడాది నెలకు రూ.40 వేలు ఉంటుంది. ఇందులో తొలి ఏడాది తొలి నెల నుంచే ప్రతినెల 30శాతం వేతనం కోత విధిస్తారు. దానికి ప్రభుత్వం కొంత మొత్తం జమ చేసి, నాలుగేండ్లు పూర్తి అయిన తరువాత అగ్నివీర్లకు ఒక్కొక్కరికి రూ.11 లక్షల చొప్పున ఇస్తుంది. అంటే ఇందులో రూ.5.02 లక్షలు అగ్నివీరులే జమ చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం మరో రూ.5.02 లక్షలు ఇస్తుంది. మొత్తం రూ.10.04 లక్షలు, దీని వడ్డీ కలిపి రూ.11 లక్షల వరకు అగ్నివీరులకు ఇస్తారు. అంటే తొలి ఏడాది నెలవారి అగ్నివీరుల చేతికొచ్చిన మొత్తం కేవలం రూ.22 వేలు మాత్రమే. ఒకవేళ మధ్యలోనే అగ్నివీర్లు ఉద్యోగం నుంచి వైదొలిగితే, వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం ఉండదు. కేవలం వారు అప్పటి వరకు దాచుకున్న మొత్తాన్నే ఇస్తారు. అలాగే అగ్నివీర్లు డీఏ (డియర్‌నెల్ అలవెన్స్), మిలిటరీ సర్వీస్ పేకు అర్హులు కాదు. ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ ప్రావిడెంట్ ఫండ్ లేదా ఏదైనా ఇతర ప్రావిడెంట్ ఫండ్లకు అగ్నివీర్లకు మినహాయింపు ఉంటుంది. ఆర్మీ చట్టం-1950 ప్రకారం ఏ సమయంలోనైనా అగ్నివీర్లను తొలగించవచ్చు. అయితే వారి సొంత అభ్యర్థన మేరకు రిలీవ్ చేయడం జరగదు. 17 ఏండ్ల నుంచి 21 వరకు వయస్సు పరిమితి ఉంది. అభ్యర్థుల వయస్సు అర్హతను నిర్ణయించడానికి రిక్రూటింగ్ సంవత్సరం అక్టోబర్ నెల 1వ రోజు (01 ఏప్రిల్ - 31 మార్చి) ప్రభావవంతమైన తేదీగా పరిగణించబడుతుంది. నాలుగేండ్లు పూర్తి చేసుకున్న అగ్నివీర్లకు సేవా నిధి ప్యాకేజ్, అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్, 12వ తరగతి సర్టిఫికేట్ ఇస్తారు. మరణించిన వారికి 48 లక్షల ఇన్సురెన్సు లభిస్తుంది.