Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగేండ్ల తర్వాత వేరే ఉద్యోగమా? చాలా కష్టం..!
- శిక్షణ..ఇతర వ్యయమంతా వృధానే : రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ శక్తి గురుంగ్
న్యూఢిల్లీ : అగ్నిపథ్ పథకంపై మోడీ సర్కార్ ఎన్ని ముచ్చట్లు చెప్పినా..రక్షణరంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు పలు విమర్శలు, సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 'అగ్నిపథ్' పథకం దేశ రక్షణ వ్యవస్థకే ప్రమాదకరమని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ శక్తి గురుంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఇకపై కొత్త విధానంలో సైనిక నియామకాలను చేపట్టబోతోందని అన్నారు. కాంట్రాక్ట్ పద్ధతి తీసుకురాబోతోందన్నారు. సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయనకు రక్షణరంగంలో సుదీర్ఘ అనుభవముంది. తాజాగా ఆయన ఒక న్యూస్ వెబ్‌పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటంటే..
ఆర్మీ ఆఫీసర్లకే కష్టమవుతోంది..
అగ్నిపథ్‌లో నాలుగేండ్ల సర్వీస్ తర్వాత శాశ్వత నియామకానికి ఎంపిక కానివారి గురించి మొదట చెప్పుకోవాలి. వారిపట్ల ఆయా వర్గాల్లో, సమాజంలో ఏర్పడే అభిప్రాయం ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. మన సైనిక బలగాలు శక్తివంతమైనవని ప్రపంచంలో మంచి గుర్తింపు ఉంది. అయినప్పటికీ వివిధ సర్వీసుల్లో పనిచేసి..విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొని ఎంతోమంది రిటైర్ అవుతున్నారు. సర్వీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వారికి మంచి ఉపాధి అవకాశాలు దొరకటం లేదు. షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లకు 14ఏండ్ల సర్వీస్ ఉంటుంది. వారికి వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు రావటం లేదు. చాలా తక్కువమందికి ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు వస్తున్నాయి.
రక్షణ అవసరాలు తీరవు
అగ్నిపథ్‌లో నాలుగేండ్లు సర్వీస్ పూర్తిచేసుకున్న వీరులకు..ఆ తర్వాత ఏంటన్నది గందరగోళమే. అంతేకాదు ప్రభుత్వ నిధులు ఖర్చు చేసి వీరందరికీ శిక్షణ ఇస్తున్నారు. అదంతా వృధా అయినట్టే కదా! ఆర్మీలో కాంట్రాక్ట్ నియామకాల ట్రెండ్‌కు కేంద్రం తెరలేపిందని భావించొచ్చు. అయితే భారతదేశ రక్షణ అవసరాలు మాత్రం తీరవు. ఉపాధి అవకాశాలు దొరకటం లేదని యువత ఎంతో ఆగ్రహంగా ఉంది. సామాజికంగా, రాజకీయంగా అనేక సవాళ్లకు కారణమవుతోంది. కాబట్టి దీనిని తాత్కాలికంగా వాయిదా వేయడానికి 'అగ్నిపథ్'ను తీసుకొచ్చారనటంలో సందేహం లేదు.