Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోపాలకృష్ణ గాంధీ ప్రకటన
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల విషయంలో మహాత్మా గాంధీ మనవడు, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకష్ణ గాంధీ కూడా వెనక్కి తగ్గారు. రాష్ట్రపతి రేసు నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలపాలనే ప్రతిపక్ష పార్టీల విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. 'ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసే విషయాన్ని లోతుగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రస్తుత జాతీయ రాజకీయాల దష్ట్యా ప్రతిపక్షాల ఐక్యతతో పాటు జాతీయ స్థాయి భావన కలిగించే వ్యక్తి ఈ రేసులో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఆ బాధ్యతను నాకంటే వేరేవాళ్లు మెరుగ్గా నిర్వర్తించగలరని భావిస్తున్నాను' అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.దేశంలో అత్యున్నత పదవికి ఉమ్మడి అభ్యర్థిగా తనను పరిగణలోకి తీసుకున్నందుకు ప్రతిపక్ష నేతలకు ధన్యవాదాలు తెలిపారు. జాతీయ పరిణామాలను సమర్థవంతంగా నిర్వహించగలిగే వ్యక్తి ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉండాలని తాను భావిస్తున్నాను. ఈ విషయంలో తనకంటే మెరుగైనవారు ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. . రాష్ట్రపతి ఎన్నికల దష్ట్యా ఇటీవల ప్రతిపక్ష పార్టీలు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈభేటీలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకష్ణ గాంధీ, ఫరూఖ్ అబ్దుల్లా పేర్లను మమత ప్రతిపాదించారు. అంతకు ముందు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శరద్‌పవార్ నిరాకరించగా.. ఇటీవల ఫరూక్ అబ్దుల్లా కూడా తన పేరును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. దీంతో అందరూ గోపాలకష్ణ గాంధీ పోటీ చేస్తారని అనుకున్నారు. తాజాగా ఆయన కూడా వెనక్కి తగ్గడంతో విపక్షాల మూడో ఆప్షన్ కూడా ఫెయిల్ అయినట్లు అయ్యింది. దీంతో రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాలు ఇంకెవర్నీ ప్రతిపాదిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. విపక్షాల తదుపరి సమావేశం ముంబయిలో నిర్వహించనున్నారు.