Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్నిపథ్ నిరసనలతో బయటకు
- మోడీ సర్కారు ఏకపక్ష విధానాలు
- సాగు చట్టాల నుంచి నేర్వని పాఠాలు
- 'సొంత లాభం' కోసమే ప్రస్తుత వివాదాస్పద పథకం
- విశ్లేషకులు, నిపుణుల ఆందోళన
న్యూఢిల్లీ : భారత్ 'అగ్నిపథ్' ఆందోళనలతో అట్టుడుకుతున్నది. వివాదాస్పద పథకాన్ని కేంద్రం ప్రకటించి వారం రోజులవుతున్నది. అయితే, త్రివిధ దళాల్లో నాలుగేండ్ల కాలానికి కొత్త నిబంధనలతో నియామకాలు చేపట్టటంపై దేశ యువత ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీంతో గత బుధవారం నుంచి అనేక రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ పథకాన్ని రద్దు చేయాలని పలు రకాలుగా దేశ యువత నిరసనల్లో పాల్గొంటున్నది. రోడ్ల దిగ్బంధం, మానవ హారాలు, ప్లకార్డుల ప్రదర్శన, రైల్ రోకోలు, బంద్‌లు.. ఇలా అనేక ఆందోళనల్లో భాగస్వామ్యమవుతున్నది. కేంద్రం తీరుపై సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలతో పాటు అనేక ప్రాంతీయ పార్టీలూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. పథకం రద్దును కోరాయి. మోడీ సర్కారు మాత్రం ఈ పథకం విషయంలో యువత, ప్రతిపక్షాల అభ్యర్థనను పట్టించుకోకుండా ఏకపక్షంగా ముందుకెళ్తున్నది. ఈ నేపథ్యంలోనే అగ్నిపథ్ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ సైతం వెలువడటం గమనార్హం.
అప్పుడు సాగు చట్టాలు.. ఇప్పుడు అగ్నిపథ్
వివాదాస్పద సాగు చట్టాలను తీసుకొచ్చి దేశంలోని రైతుల్లో ఆందోళనలకు మోడీ సర్కారు కారణమైందని నిపుణులు గుర్తు చేశారు. అయితే, రైతులు కేంద్రంపై గట్టిగా పోరాటం చేయటంతో ప్రధాని దిగి వచ్చి.. సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటన చేసిన విషయం విదితమే. ఇప్పుడు అదే ధోరణితో అగ్నిపథ్ ద్వారా సైనిక నియామకాల్లో దేశ యువతతో మోడీ సర్కారు వ్యవహరిస్తున్నదని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఐక్య పోరాటాలే యువతకు ఆదర్శంగా నిలిచాయనీ, ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న నిరసన జ్వాలలే దీనికి నిదర్శనమని చెప్పారు. రైతు పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని వారు యువతకు సూచించారు. యువత పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, దీక్షలు చేయటాన్ని బట్టి చూస్తే దేశంలో నిరుద్యోగ యువతలో మోడీ సర్కారుపై ఆగ్రహం ఎంత స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు వివరించారు.
నిరుద్యోగ యవత పోరాటం
దేశ యువత చేస్తున్న ఈ నిరసనల పర్వం.. ఈ ఒక్క పథకం విషయానికి సంబంధించే కాదనీ, మోడీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలు, ఉపాధి, ఉద్యోగాలు సృష్టించటంలో కేంద్రం వైఫల్యంపై పోరాటంగా అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు తెలిపారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దానిని విస్మరించిందని గుర్తు చేశారు. దీనిని నిరుద్యోగ యువత పోరాటంగా అభివర్ణించారు. '' దేశ యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. గతంలో ఇంతటి మహోధృతమైన నిరసనలను చూడలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలూ నిరసనలతో అట్టుడుకుతున్నాయి. ఇందుకు బీహార్‌లోని పరిస్థితులు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు. ఇటీవల ఆందోళనకారులు.. ఆ రాష్ట్ర ఉప ముఖమంత్రి, బీజేపీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ఆ పార్టీ ఇతర నాయకుల ఇండ్లే టార్గెట్‌గా నిరసనలు చేశారు'' అని విశ్లేషకులు వివరించారు.
ఆగ్రహజ్వాలలకు కారణాలేంటి..?
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆర్మీ, నేవీ, ఏయిర్‌ఫోర్స్ త్రివిధ దళాల్లో నాలుగేండ్ల స్పల్పకాలిక తాత్కాలిక సర్వీసు కోసం నియామకాలు చేపట్టటం యువత ఆగ్రహానికి కారణమవుతున్నది. అంతేకాకుండా, గత రెండేండ్లుగా నియామకాలు జరపకపోవటం, ఇప్పటికే చేపట్టిన ఆర్మీ నియామక ర్యాలీల్లో అనేక రౌండ్లు దాటి వచ్చి రాత పరీక్ష కోసం ఎదురు చూస్తున్నవారికి మోడీ సర్కారు వివాదాస్పద పథకంతో 'అగ్ని' పరీక్ష పెట్టిందని విశ్లేషకులు తెలిపారు. సైనిక నియామకాల్లో జీత, భత్యాలపై చేసే ఖర్చును తగ్గించుకోవటంలో భాగంగానే మోడీ సర్కారు కొత్త ప్రయోగంతో ముందుకు వచ్చిందని చెప్పారు.
అనుకూల వర్గం నుంచీ వ్యతిరేకత..!
సైనిక నియామక ప్రక్రియనే మార్చే ఇలాంటి పథకంపై రాజకీయంగా కానీ, సంబంధిత నిపుణులతో కానీ ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే అకస్మాత్తుగా తీసుకొచ్చి యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నదని విశ్లేషకులు ఆరోపించారు. 'అగ్నిపథ్'పై మోడీ సర్కారుకు మద్దతుదారుల నుంచే వ్యతిరేకత వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఈ పథకం లోపాల పుట్ట అనీ, దీనిని అమలు చేయొద్దని మాజీ మేజర్ జనరల్ (డాక్టర్) జీడీ భక్షీ చేసిన వ్యాఖ్యలను విశ్లేషకులు ఉటంకించారు.
కేంద్రానికి ఎందుకు మొండి పట్టు?
పథకంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్పటికీ మోడీ ప్రభుత్వం దీనిపై ముందుకెళ్లటానికి గల కారణాలను విశ్లేషకులు వివరించారు. ఇందులో అధికార బీజేపీకి ఉన్న 'సొంత లాభాన్ని' కొట్టిపారేయలేమని చెప్పారు. భారత్ సాధారణంగా మిలిటరీ వేతనాలు, పెన్షన్లపై అధికంగా ఖర్చు చేస్తుంది. అయితే, ఈ ఖర్చులను తగ్గించుకునే క్రమంలోనే అగ్నిపథ్‌ను కేంద్రం తీసుకొచ్చిందని వారు చెప్పారు. రక్షణ రంగ నిపుణుడు లక్ష్మణ్ కుమార్ బెహ్రా విశ్లేషణ ప్రకారం.. '' 2020-21 రక్షణ బడ్జెట్లో భద్రతా సిబ్బందికి అయ్యే ఖర్చు 64 శాతంగా అంచనా. ఈ నేపథ్యంలో సంక్షేమ రంగంపై చేసే ఖర్చును కేంద్రం తగ్గించింది. జీఎస్టీ ప్రదర్శనా ఆశించినంతగా లేదు'' అని తెలిపారు. ఈ పథకం రాజకీయంగానూ బీజేపీకి లబ్దిని చేకూరుస్తుందని మరికొందరు విశ్లేషకులు తెలిపారు. నాలుగేండ్ల సర్వీసు తర్వాత బయటకు వచ్చి నిరుద్యోగులుగా మారే అగ్నివీర్లను బీజేపీ, హిందూత్వ గ్రూపులు, అనుబంధ సంస్థలు ఆకర్షించి వాటి ఉనికిని విస్తరించుకునే అవకాశమున్నదని చెప్పారు.