Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిరుగుబావుటా ఎగురవేసిన రాష్ట్రమంత్రి ఏక్నాథ్ షిండే
- తన అనుచర ఎమ్మెల్యేలతో గుజరాత్‌కు పయనం
- బీజేపీతో కలుద్దాం : సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్లో ఏక్నాథ్ షిండే
న్యూఢిల్లీ : మహారాష్ట్ర మహా వికాస్ అఘాడీ (శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి) ప్రభుత్వం మళ్లీ సంక్షోభంలో చిక్కుకుంది. రాష్ట్రమంత్రి, శివసేన కీలక నేత ఏక్నాథ్ షిండే తిరుగుబావుటా ఎగురవేశారు.
సోమవారం సాయంత్రం నుంచి షిండే సహా కొంతమంది ఎమ్మెల్యేలు ఠాక్రే సర్కార్‌కు అందుబాటులో లేరు. తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి ఆయన గుజరాత్‌కు వెళ్లిపోవటం పలు అనుమానాలకు దారితీసింది. బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలియగానే, ఠాక్రే సర్కార్‌ను కూల్చేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోందని శివసేన ఆరోపించింది. షిండే వర్గం బీజేపీలో చేరటమో! వేరే పార్టీ పెట్టటమో? చేయొచ్చని వార్తలు వెలువడుతున్నాయి.
పార్టీ చీఫ్ విప్, ఇతర హోదాల నుంచి ఏక్నాథ్ షిండేను సీఎం ఉద్ధవ్ ఠాక్రే తొలగించారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ ముఖ్యనేతలతో ఠాక్రే అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి..సమాలోచనలు జరిపారు. సాయంత్రం సీఎం ఠాక్రే, ఏక్నాథ్ షిండే మధ్య ఫోన్ సంభాషణ జరిగిందని, బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని షిండే డిమాండ్ చేశారని వార్తలు వెలువడ్డాయి. ఆయన వెంట దాదాపు 22మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. మంగళవారం నాటి ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం బలం నిరూపించుకునే పరిస్థితి మళ్లీ ఏర్పడింది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 288. ఇందులో ఒక శివసేన ఎమ్మెల్యే ఇటీవల మరణించారు. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 287గా ఉంది. అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 144దాటాలి.
శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరితో ప్రస్తుతం మహా వికాస్ అఘాడీ కూటమి సంఖ్యా బలం 152 అవుతోంది. కొన్ని చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు కూడా తమకు ఉందని అధికార కూటమి చెబుతోంది. అయితే మంగళవారం ఏక్నాథ్ షిండే తన అనుచర ఎమ్మెల్యేలు 22మందితో సూరత్‌లోని ఓ హోటల్లో ఉన్నారని జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఏక్నాథ్ షిండే సహా వీరంతా రాజీనామా చేస్తే శివసేన సంఖ్యాబలం 33కు తగ్గుతుంది. అప్పుడు సంకీర్ణ ప్రభుత్వం బలం కూడా 130కి పడిపోతుంది. మెజార్టీ మార్క్ 133గా మారుతుంది.
తాజా సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు శివసేన పార్టీ రంగంలోకి దిగింది. షిండేతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ''ఏక్నాథ్ షిండే తమ పార్టీకి నమ్మకమైన వ్యక్తి. త్వరలోనే తమ ఎమ్మెల్యేలు తిరిగి వస్తారు. మహా వికాస్ కూటమిని కూల్చేందుకు చేస్తోన్న ప్రయత్నాలు ఫలించబోవు'' అని అన్నారు. సోమవారం రాత్రి ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో లేరనేది నిజమేనని, షిండే సహా ఎమ్మెల్యేలు కొంతమంది ముంబయిలో లేరని సంజరు రౌత్ అన్నారు.