Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రపతి పదవికి అభ్యర్థుల ఖరారు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్రపతి పదవికి పోటీ పడే అభ్యర్థుల విషయమై గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది. అత్యున్నతమైన ఈ రాజ్యాంగ పదవికి అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నరు ద్రౌపది ముర్ము బరిలోకి దిగుతుండగా, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా రంగ ప్రవేశం చేస్తున్నారు. గిరిజన కమ్యూనిటీకి చెందిన ద్రౌపది ముర్ము పేరుతో సహా 20 మంది పేర్లు చర్చకు వచ్చినప్పటికీ చివరికి ముర్ము పేరునే ఎన్డీయే ఖరారు చేసినట్లు బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా తెలిపారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, గోపాల కృష్ణ గాంధీ పేర్లు పరిశీలించినప్పటికీ ఆ ముగ్గురూ పోటీకి విముఖత చూపడంతో చివరికి యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేశారు. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా మంగళవారం రాత్రి ప్రకటించగా, అంతకు ముందే ప్రతిపక్షాలు
తమ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించాయి.
ముర్ము అభ్యర్థిత్వం వెనుక...
అధికార ఎన్డీయే తరపు రాష్ట్రపతి అభ్యర్థిగా జార్ఖండ్‌్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము పేరును బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఖరారు చేసినట్లు ఆ ఆ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంగతి వెల్లడిం చారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగిందని, 20 మంది పేర్లు సమావేశం ముందుకు వచ్చాయని, చివరికి ఆదివాసీ మహిళ నేత ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేశామని ఆయన అన్నారు. ముర్ము 16వ రాష్ట్రపతిగా ఎన్నికైతే దేశ తొలి ఆదివాసీ మహిళ ప్రథమ పౌరురాలిగా రికార్డుకెక్కనున్నారు. అలాగే స్వాతంత్రం వచ్చిన తరువాత పుట్టిన తొలి రాష్ట్రపతిగా కూడా ఆమె నిలవనున్నారు.
ద్రౌపది ముర్ము జీవిత విశేషాలు
ద్రౌపది ముర్ము 1958 జూన్ 20న ఒరిస్సాలోని మయూర్ భంజ్ జిల్లా బైదాపోసి గ్రామంలో గిరిజన సంతాల్ కమ్యూనిటీలో జన్మించారు. ఆమె తండ్రి బిరంచి నారాయణ్ తుడు. శ్యామ్ చరణ్ ముర్మును ఆమె వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితం మొత్తం విషాదాలే. భర్త, ఇద్దరు కుమారులు మరణించారు. 1997లో బీజేపీలో చేరారు. అదే ఏడాది రాయరంగపూర్ జిల్లాలో కౌన్సిలర్‌గా ఎన్నిక అయ్యారు.ఒరిస్సాలోని రాయరంగ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2000, 2004ల్లో రెండు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒరిస్సాలోని బీజేెడీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఆమె రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2000 మార్చి 6 నుంచి 2002 ఆగస్టు 6 వరకు రాష్ట్ర వాణిజ్య, రవణా శాఖ మంత్రిగా, 2002 ఆగస్టు 6 నుంనచి 2004 మే 16 వరకు మత్య్స, పశు గణాభివద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2002 నుంచి 2009 వరకు మయూర్ భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహించారు. 2006 నుంచి 2009 వరకు బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. 2010లో మరోసారి మయూర్ భంజ్ జిల్లా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2013లో మూడోసారి ఆమె అదే జిల్లాకి అధ్యక్షురాలు అయ్యారు. ఆమె 2015 వరకు జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె బిఎ చదివారు. రయరంగపూర్లో అరబిండో ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. 2007లో ఉత్తమ ఎమ్మెల్యే నీలకంథా అవార్డును ఒరిస్సా అసెంబ్లీ అందజేసింది. 2015 మేలో ఆమె జార్ఖండ్ మొదటి ఆదివాసీ మహిళా గవర్నర్‌గా నియమితులయ్యారు. దేశంలో అదే తొలిసారి ఆదివాసీ మహిళ గవర్నర్‌గా నియామకం జరిగింది. జార్ఖండ్ 2000 సంవత్సరంలో ఏర్పడినప్పటి నుండి ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని (2015-2021) పూర్తి చేసిన జార్ఖండ్ మొదటి గవర్నర్‌గా ఆమె రికార్డు కెక్కారు.
27న యశ్వంత్ సిన్హా నామినేషన్
ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఎంపికయ్యారు. మంగళవారం నాడిక్కడ పార్లమెంట్ హౌస్‌లో ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో శరద్ పవార్, ప్రఫుల్ పటేల్ (ఎన్‌సీపీి), మల్లికార్జున్ ఖర్గే, జైరాం రమేష్, రణదీప్ సుర్జేవాలా (కాంగ్రెస్), సీతారాం ఏచూరి (సీపీఐ(ఎం), డి.రాజా (సీపీఐ), మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ), రాంగోపాల్ యాదవ్ (ఎస్పీ), అభిషేక్ బెనర్జీ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐఎంఎల్), ఇమ్తియాజ్ జలీల్ (ఎంఐఎం), ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్ (ఆర్ఎస్పీ), తిరుమావళవన్ (వీసీకే), హస్నైన్ మసూది (నేషనల్ కాన్ఫరెన్స్) తదితరులు పాల్గొన్నారు. యశ్వంత్ సిన్హా టీఎంసీికి రాజీనామా చేయాలని, అప్పుడే సమావేశంలో మద్దతు ఇస్తామని కాంగ్రెస్, వామపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో సమావేశం ప్రారంభానికి ముందే యశ్వంత్ సిన్హా టిఎంసి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈనెల 27న యశ్వంత్ సిన్హా నామినేషన్ వేసే అవకాశం ఉంది.
యశ్వంత్ సిన్హా జీవిత విశేషాలు
1937 నవంబర్ 6న బీహారీ కాయస్త బ్రాహ్మణ కుటుంబంలో యశ్వంత్ సిన్హా జన్మించారు. 1958లో రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1962లో పాట్నా యూనివర్శిటీలో అధ్యాపకుడిగా చేరారు. 1960లో ఐఎఎస్‌లో చేరారు. తన 24 ఏళ్ల పదవీ కాలంలో అనేక ముఖ్యమైన పదవులు నిర్వహించారు. 1971 నుండి 73 వరకు జర్మనీలోని బాన్‌లో ఇండియన్ ఎంబసీలో మొదటి కార్యదర్శిగా పని చేశారు. 1973 నుండి 74 వరకు ఫ్రాంక్‌ఫర్ట్‌లో భారత కాన్సల్ జనరల్‌గా పని చేశారు. 1984లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి జనతా పార్టీలో చేరారు. 1986లో ఆపార్టీ ప్రధాన కార్యదర్శిగా నియుక్తులయ్యారు. 1988లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1989లో జనతాదళ్ ఏర్పడినప్పుడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శగా నియమితులయ్యారు. 1990 నవంబర్ నుండి 1991 జూన్ వరకు చంద్రశేఖర్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. 1996 జూన్‌లో బీజేపీ లో చేరారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా కొంత కాలం వ్యవహరించారు.1998, 1999, 2009లో హజారీబాగ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1998 మార్చిలో వాజ్‌పేయి మంత్రివర్గంలో రెండోసారి ఆర్థిక మంత్రి అయ్యారు. 2002 జూలై 1న విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో హజారీబాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2005లో రాజ్యసభకు ఎన్నికైన ఆయన తిరిగి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2009 జూన్ 13న బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2018లో ''పార్టీ పరిస్థితి, దేశంలో ప్రజాస్వామ్యం చాలా ప్రమాదంలో ఉంది'' అని పేర్కొంటూ బీజేపీని విడిచిపెట్టారు. ఆ తరువాత స్వచ్చంధంగా 2018 జనవరి 30న రాష్ట్రీయ మంచ్ ఏర్పాటు చేశారు. 2021 మార్చి 13న ఆయన టీఎంసీలో చేరారు. మార్చి 15న టీఎంసీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయనకు ఇద్దరు కుమారులు (జయంత్ సిన్హా, సుమంత్ సిన్హా), ఒక కుమార్తె (షర్మిల) ఉన్నారు.