Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్నిపథ్‌పై సుప్రీంలో కేంద్రం కేవియట్ పిటిషన్
న్యూఢిల్లీ : అగ్నిపథ్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన వినాలని సుప్రీంకోర్టుకు కేంద్రం విన్నవించింది. ఈమేరకు న్యాయస్థానంలో మంగళవారం కేంద్ర ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటి వరకు అగ్నిపథ్‌పై సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మూడు పిటిషన్లలో దేనికి సంబంధించి కేంద్రం కేవియట్ దాఖలు చేసిందో మాత్రం వెల్లడించలేదు. న్యాయవాది హరీశ్ అజయ్‌సింగ్ ఈమేరకు ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ వేశారు. ఎంఎల్.శర్మ అనే న్యాయవాది ఇటీవల అగ్నిపథ్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి..పలు అంశాలను ప్రస్తావించారు. వందల ఏండ్ల నుంచి ఉన్న ఎంపిక విధానాన్ని ప్రభుత్వం పక్కనపెట్టిందని ఆరోపించారు. దాంతోబాటు ప్రభుత్వ నిర్ణయానికి పార్లమెంట్ అనుమతి లేదని పేర్కొన్నారు.
జాతీయ భద్రతపై అగ్నిపథ్ పథకం ప్రభావాన్ని విశ్లేషించేందుకు ఒక కమిటీని వేయాలని గతవారం విశాల్ తివారీ అనే మరో న్యాయవాది పిటిషన్ వేశారు. దాంతోపాటు అగ్నిపథ్ ప్రకటన తర్వాత చెలరేగిన హింసపై విచారణ నిర్వహించేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. మాజీ సైనికులు, రక్షణరంగ నిపుణులు, రాజకీయ ప్రముఖులు సైతం అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకించారు. శాశ్వత ప్రాతిపదకన ఆర్మీలో నియామకాలు చేపట్టాలని సూచిస్తున్నారు. పథకాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి.
దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన ఈ అంశంలో కేంద్రం చాలా తొందర తొందరగా నిర్ణయాలు తీసుకుంటోంది. రెండు రోజుల క్రితం అగ్నిపథ్ పథకం నోటిఫికేషన్ జారీచేసింది. పెద్ద ఎత్తున జరిగిన నిరసనలు, హింసపై సిట్‌తో విచారణ జరపాలని విశాల్ తివారీ అనే న్యాయవాది తన పిటిషన్లో సుప్రీంకోర్టును కోరారు. సుప్రీం ముంగిటకు వచ్చిన ఈ పిటిషన్ల విచారణ గురించి జస్టిస్ సి.టి.రవికుమార్ స్పందించారు. ఈ అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని అన్నారు. ఇంతలో కేంద్రం కేవియట్ పిటిషన్ వేసింది. తమ వాదన వినాలని సుప్రీంకోర్టును కోరింది.