Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజేఐ ఎన్వీ రమణకు మాజీ ఉన్నతాధికారుల లేఖ
న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న 'బుల్డోజర్ న్యాయం' ఆలోచనకు ముగింపు పలకాలని మాజీ ఉన్నతాధికారులు 90 మంది భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణకు బహిరంగ లేఖను రాశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ విధానం పలు రాష్ట్రాల్లో ఒక కట్టుబాటుగా మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. యూపీలోని పరిస్థితులను ఈ లేఖలో వారు ఉటంకించారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం యూపీలో ఆందోళనకారులపై జరిగిన '' అక్రమ నిర్బంధం, ఇండ్ల కూల్చివేతలు, నిరసనకారులపై పోలీసుల హింస''ను సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకోవాలని మాజీ అధికారులు పేర్కొన్నారు. కూల్చివేత కార్యక్రమం, రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాలను దుర్వినియోగం చేయడం, పరిపాలన, పోలీసు యంత్రాంగం క్రూరమైన మెజారిటీ అణచివేత సాధనంగా మారుతున్నదని యూపీలోని పరిస్థితులను వివరించారు. 'ఏదైనా నిరసనను క్రూరంగా అణచివేయటానికి' జాతీయ భద్రతా చట్టం 1980, యూపీ గ్యాంగ్స్టర్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ (నిరోధక) చట్టం 1986 ప్రయోగించాలన్న 'స్పష్టమైన ఆదేశాలు' ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూపీలోని ప్రయాగ్రాజ్, కాన్పూర్, సహరన్పూర్, ఇతర ముస్లిం ప్రభావిత ప్రాంతాలలో చోటు చేసుకున్న ఘటనలు రాజకీయ ఆదేశాలతోనే జరిగాయని మాజీ ఉన్నతాధికారులు ఆరోపించారు. సీజేఐకి లేఖ రాసినవారిలో కేంద్ర హోంశాఖ మాజీ సెక్రెటరీ జీ.కే పిళ్లై, విదేశీ వ్యవహారాల మాజీ సెక్రెటరీ సుజాతా సింగ్, మాజీ ఐపీఎస్ అధికారులు జూలియో రిబెరియో, అవినాశ్ మోహననే, మాక్స్వెల్ పెరీరా, ఏకే సమంత లు ఉన్నారు. యూపీలో చోటు చేసుకున్న ఇటీవల ఘటనలను సుమోటోగా తీసుకోవాలని కొన్ని రోజుల క్రితం సీజేఐకి సుప్రీంకోర్టు, హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు, అడ్వొకేట్లు చేసిన ఫిర్యాదును మాజీ ఉన్నతాధికారులు సమర్థించారు. అత్యున్నత స్థాయిలో ఉన్న న్యాయవ్యవస్థ వేగంగా, ధృఢంగా, నిర్ణయాత్మకంగా జోక్యం చేసుకోని పక్షంలో రాజ్యాంగ పరిపాలన మొత్తం భవనం కూలిపోయే అవకాశమున్నదని తాము విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు.