Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా
- ఎన్నుకొన్నందుకు యశ్వంత్ లేఖ
- భారత రాజ్యాంగ ప్రాథమిక విలువలు కాపాడతానని హామీ
న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నం దుకు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక లేఖను విడుదల చేశారు. తన పట్ల ప్రతిపక్ష పార్టీల నమ్మకానికి, విశ్వాసానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒకవేళ తాను రాష్ట్రపతిగా ఎన్నికైతే ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా భారత రాజ్యాంగ ప్రాథమిక విలువలు, ఆదర్శాలను నిలబెడతానని ప్రతిపక్ష పార్టీల నాయకులు, భారత ప్రజలకు ఆయన హామీనిచ్చారు. ప్రజాస్వామ్యం, సెక్యులరిజాన్ని మసకబారనివ్వనని వివరించారు. స్వతంత్ర, ప్రజాస్వామ్య సంస్థలను రాజకీయ ప్రత్యర్థుల పైకి ఆయుధంగా ప్రయోగించే అవకాశాన్ని కల్పించనని పేర్కొన్నారు. భారత పార్లమెంటు గౌరవాన్ని కాపాడేందుకు తన శాయశక్తుల పని చేస్తానని వివరించారు. రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా కొనసాగుతున్న ప్రస్తుత దాడులు పూర్తిగా ఆమోదింపబడవని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజల తీర్పు, భారత ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా జరిగే చర్యలపై తన అధికారాన్ని వినియోగిస్తానని ఆయన వివరించారు. భారత్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదన్నారు. రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువత, మహిళలు, సమాజంలో అణగారిన వర్గాల సాధారణ ప్రజల కోసం తన గొంతును వినిపిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈనెల 27న నామినేషన్ పర్వం అనంతరం ఆయా రాష్ట్రాలలో పర్యటించి ప్రచారం ప్రారంభించాలను కుంటున్నట్టు వివరించారు. మద్దతు కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడతానని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ గొప్ప దేశ ప్రజల (జనతా జనాదర్ధన్) మద్దతు, మార్గనిర్దేశాన్ని యశ్వంత్ సిన్హా కోరారు.