Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిడ్నాప్ చేసి..గుజరాత్‌కు తీసుకెళ్లారు : ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్
- రాజీనామాకు సిద్ధమన్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే
- పదవి కోసం వెంపర్లాడనని వెల్లడి
- శివసేన ఆదేశాలు చెల్లవు : ఏక్నాథ్ షిండే ట్వీట్
- బీజేపీతో కలుద్దామని మరోమారు ప్రకటన
న్యూఢిల్లీ : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం బుధవారం మరింత ముదిరింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే దిశగా ఏక్నాథ్ షిండే పావులు కదుపుతున్నారు. ఆయనకు బీజేపీ అధినాయకుల నుంచి పెద్ద ఎత్తున అండదండలు లభిస్తున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి ఆయన సూరత్ నుంచి ఛార్డెడ్ విమానంలో అసోంలోని గౌహతీకి తరలివెళ్లారు. బుధవారం మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు గౌహతీకి చేరుకోవటం సంక్షోభాన్ని మరింత పెంచింది. శివసేనకు చెందిన మొత్తం 55మంది ఎమ్మెల్యేల్లో షిండే వైపు 33మంది ఉన్నారని జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేద్దామని ఏక్నాథ్ షిండే బుధవారం మరోమారు ప్రకటించారు. తమదే అసలైన శివసేన అంటూ ఏక్నాథ్ షిండే, ఆయన వెనుకున్న 30మంది ఎమ్మెల్యేలు గవర్నర్ కోశ్యారీకి లేఖ రాయటం తీవ్ర కలకలం రేపింది. శివసేన శాసనసభా పక్ష నేతగా ఏక్నాథ్ షిండేను గుర్తించాలని లేఖలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోరారు. శివసేన తన సిద్ధాంతంతో రెండేండ్ల క్రితమే రాజీపడిపోయిందని ఆరోపించారు.
కర్నాటకలో చేసినట్టుగానే..
కర్నాటకలో కాంగ్రెస్, జేడీయూ ప్రభుత్వాన్ని కూల్చినట్టుగానే..ఇక్కడా కుట్రలు, కుతంత్రాలతో అధికారంలోకి రావడానికి బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీ చేపట్టిన 'ఆపరేషన్ కమల్' కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తనను కిడ్నాప్ చేసి గుజరాత్‌కు బలవంతంగా తీసుకెళ్లారని శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపింది. బుధవారం ఉదయం ఆయన సూరత్ నుంచి ముంబయికి చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..''ఏక్నాథ్ షిండే నన్ను తప్పుదోవ పట్టించి సూరత్ తీసుకెళ్లారు. మహా సీఎంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నామనే విషయం ముందు చెప్పలేదు. అక్కడకు వెళ్లాకే విషయం తెలిసింది. దాంతో నేను హోటల్ నుంచి బయటకు వచ్చాను. కానీ నన్ను పోలీసులు అడ్డుకుని, గుండెపోటు వచ్చిందని బలవంతంగా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. నన్ను హత్య చేయడానికి కుట్రలు జరిగాయి. ఎలాగోలా తప్పించుకొని ముంబయికి చేరుకున్నా''అని చెప్పారు.
సీఎం పదవి వదులుకుంటా : ఉద్ధవ్ ఠాక్రే
ఇదిలా ఉండాగా సొంత ఎమ్మెల్యేలు తనను వద్దనుకుంటున్నారా? అంటే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ సంక్షోభం మొదలయ్యాక మొదటిసారిగా ఉద్ధవ్ ఠాక్రే మీడియా ముందుకు వచ్చారు. ఫేస్బుక్ లైవ్ ద్వారా రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ''సీఎంగా తన బాధ్యతలను నిర్వర్తించాను. కరోనా సమయంలో నా వంతు కృష్టి చేశాను. నన్ను అసమర్థుడని ఒక్క ఎమ్మెల్యే అన్నా..సీఎం పదవి వదులుకుంటా. రాజీనామా లేఖ సిద్ధంగా ఉంది. బాల్‌ఠాక్రే కుమారుడిని. పదవి కోసం వెంపర్లాడను. నా తర్వాత కూడా శివసేన నేత సీఎం అయితే సంతోషిస్తా. శరద్ పవార్ కోరిన తర్వాత సీఎం పదవి చేపట్టా. సంకీర్ణ ప్రభుత్వంలో చేరాను. సీఎం పదవి కోసం పోరాటం చేయను. కొందరు ప్రేమతో గెలుస్తారు. ఇంకొందరు కుట్రలతో గెలుస్తారు. నాకు సీఎంగా కొనసాగాలని లేదు. అసంతృప్త ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తే శివసేన అధినేత పదవి కూడా వదులుకుంటా'' అని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు.
ఏం చెప్పగలను?
ఇదంతా నాకు చాలా దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రభుత్వంలోని ప్రధాన భాగస్వామ పక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు నన్ను సీఎంగా వద్దనుకుంటే అది వేరు. ఈరోజుకీ..కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ నన్ను సీఎంగా ఉండాలని కోరారు. కానీ నా సొంత పార్టీ ఎమ్మెల్యేలే నన్ను సీఎంగా వద్దనుకుంటున్నప్పుడు నేనేం చెప్పగలను?..అని ఠాక్రే ఆవేదన వ్యక్తం చేశారు.
శివసేన శాసనసభా నేత షిండే : రెబల్ ఎమ్మెల్యేలు లేఖ
ఏక్నాథ్ షిండే శివసేన శాసనసభా పక్ష నేతగా పేర్కొంటూ రెబల్ ఎమ్మెల్యేలు గవర్నర్, డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాశారు. ''ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి పట్ల మేం అసంతృప్తిగా ఉన్నాం. రాజకీయ వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీటిని పార్టీ నాయకత్వం పట్టించుకోవట్లేదు. అందుకే మేం తిరుగుబాటు చేస్తున్నాం. అయితే అసెంబ్లీలో శివసేన పార్టీ అంటే మాదే. అందుకే ఏక్నాథ్ షిండేను శివసేన శాసనసభా పక్ష నేతగా కొనసాగించాలని నిర్ణయించుకున్నాం. పార్టీ చీఫ్ విప్‌గా సునిల్ ప్రభు స్థానంలో భరత్ గోగవాలేను నియమించుకున్నా''మని లేఖలో రెబల్స్ పేర్కొన్నారు.