Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బలాబలాలపై పవార్
- 12 మందిపై సస్పెన్షన్ వేటు వేయండి
- డిప్యూటీ స్పీకర్‌కు శివసేన లేఖ
- మాకు 'మహాశక్తి' అండదండలున్నారు : షిండే
- రాజీ పడొద్దు: ఉద్దవ్‌కు శివసేన కార్యకర్తల విజ్ఞప్తి
ముంబయి : మహారాష్ట్రలో మహా వికాస్ అఘాదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఒక వైపు తన యత్నాలను ముమ్మరం చేస్తుండగా, మరోవైపు దీనికి చెక్ పెట్టేందుకు ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ అసెంబ్లీలో బలపరీక్ష ద్వారానే ఉద్దవ్ ప్రభుత్వ భవిష్యత్తు తేలాలని అన్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విశ్వాస పరీక్షలో నెగ్గుకొస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో జరిగే బలపరీక్షకు హాజరు కావాల్సివుంటుందని అన్నారు. అంతకుముందు మహారాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీహరి అనీ కూడా అసెంబ్లీ వేదికగానే బలనిరూపణ జరగాలని చెప్పారు. తమకు ఇంత మంది మద్దతు ఉందని, అంతమంది మద్దతు వుందని అంకెలు చెప్పడం వల్ల ప్రయోజనమేమీ ఉండదని, అసెంబ్లీ లో విశ్వాస ఓటు ద్వారానే ఎవరికి ఎంత బలం ఉందో తేలుతుందని ఆయన అన్నారు. పలువురు రాజ్యాంగ నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎంవిఎ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి చేపట్టిన 'ఆపరేషన్ కమలం' కుట్రను మరింత బలపరిచేలా తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే మాట్లాడారు. గౌహతిలోని ఒక హోటల్లో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి షిండే చేసిన ప్రసంగానికి సంబంధించిన ఒక వీడియోను ఆయన కార్యాలయం గురువారం ముంబయిలో విడుదల చేసింది. ఆ వీడియోలో షిండే ఇలా పేర్కొన్నారు.
'ఉద్దవ్ నేతృత్వంలోని 'సంకీర్ణ ప్రభుత్వంపై మన తిరుగుబాటును ఒక జాతీయ పార్టీ చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించింది. మనకు అన్ని విధాలుగా సాయం అందజేస్తామని హామీ ఇచ్చింది' అని అనుచర ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు. 'మన ఆందోళనలు, ఆనందాలు ఒక్కటే. మనం ఐక్యంగా ఉన్నాం. విజయం మనదే. ఒక జాతీయ పార్టీ ఉంది. చాలా శక్తివంతమైనది (మహాశక్తి)..మీకు తెలుసు వాళ్లు పాకిస్థాన్‌ను జయించారు. మనం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ అభినందించింది. అన్ని విధాల సాయం చేస్తామని హామీ ఇచ్చింది' అని ఆ వీడియోలో షిండే పేర్కొన్నారు. తమ తరపున తదుపరి నిర్ణయం తీసుకునే అధికారాన్ని షిండేకి అప్పగిస్తూ ఎమ్మెల్యేలు తీర్మానించడం కూడా అదే వీడియోలో ఉంది.
ప్రస్తుతం తిరుగుబాటు శిబిరంలో షిండే వెంట శివసేనకు చెందిన 37 మంది ఎమ్మెల్యేలు, 9 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకోవాలంటే షిండేకు 37 మంది ఎమ్మెల్యేలు అవసరం..తమకు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు షిండే వర్గీయులు చెబుతున్నారు.. అదే సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణపై షిండే శిబిరంలో ఉన్న 12 మంది శివసేన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని శివసేన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు శుక్రవారం రాసిన లేఖలో విజ్ఞప్తి చేసింది. అంతకు ముందు తిరుగుబాటు నేతలు ముంబయికి 24 గంటల్లో తిరిగివస్తే, ఎన్‌సిపి, కాంగ్రెస్‌తో ఏర్పాటు చేసిన సంకీర్ణం నుంచి బయటకు వస్తామని శివసేన నేత సంజరు రౌత్ అన్నారు.
శివసేన శాసనసభాపక్ష నేతగా అజయ్ చౌదరి
ఇదిలావుండగా శివసేన శాసన సభా పక్ష నేతగా ఉన్న ఏక్నాథ్ షిండేను తొలగించడంతో ఆయన స్థానంలో అజయ్ చౌదరీని శివసేన నియమించింది. అజరు చౌదరీని శివసేన శాసనసభాపక్ష నేతగా గుర్తిస్తూ అసెంబ్లీ ఉపసభా పతి నరహరి జిర్వాల్ గురువారం నాడు ఆమోదం తెలిపారు.
తిరిగొచ్చేస్తారు : ఎన్సీపీ
దేశవ్యాప్తంగా 'ఆపరేషన్ కమలం' పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం ఈ విషయంలో నెమ్మదించినట్లు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ఎన్సీపీ మహారాష్ట్ర ఛీఫ్ జయంత్ పాటిల్ వద్ద ఒక విలేకరి ప్రస్తావించగా ఆయన కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 'ఇప్పటి వరకు బీజేపీ అధినాయకత్వం' రంగంలోకి దిగలేదని ఆయన తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వం సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. తిరుగుబాటు నేతలు ఇప్పుడు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారని, త్వరలోనే వారు తిరిగొచ్చేస్తారని పాటిల్ తెలిపారు.