Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇదే బీజేపీ విధానం
- ప్రతి నిర్ణయంలోనూ కేంద్రం తీరు ఇదే
- ప్రజలు, రాజకీయ వర్గాల్లో విభజన తీసుకొచ్చిన కాషాయపార్టీ : రాజకీయ విశ్లేషకులు, నిపుణులు
న్యూఢిల్లీ : కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ అనుసరిస్తున్న విధానాలు వివాదాస్పదంగా మారాయి. సాధారణ ప్రజలు మొదలుకొని విద్యార్థులు, నిరుద్యోగ యువత, రైతులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు ఇలా ప్రతి రంగానికి చెందినవారూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్నార్సీ, అయోధ్య రామ మందిరం, సాగుచట్టాలు, అగ్నిపథ్.. ఇలా మోడీ సర్కారు తీసుకున్న ఏ నిర్ణయమైనా దేశంలోని ఆందోళనలకు కారణమైందనీ, ప్రజలు, రాజకీయ వర్గాల్లో విభజనను తీసుకొచ్చిందని నిపుణులు, రాజకీయ విశ్లేషకులు గుర్తు చేశారు. 'విభజించు.. పాలించు' మోడీ సర్కారు విధానమని ఆరోపించారు.
'కేంద్రం విధానాలతో గందరగోళం'
మోడీ సర్కారు తీసుకున్న అన్ని విధానాలూ గందరగోళానికి, అశాంతికి కారణమయ్యాయని తెలిపారు. ఇప్పుడు అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చి అదే తీరులో వ్యవహరించిందన్నారు. '' ఈ పథకంపై విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఆర్మీ ఉద్యోగార్థులలో ఆగ్రహజ్వాలలు కట్టలు తెంచుకున్నాయి. వారు మోడీ సర్కారుపై తమ అసంతృప్తిని నిరసనల రూపంలో చూపెట్టారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ పథకం ప్రకటనతో ఇలాంటి నిరసనలు వెల్లువెత్తుతాయని మోడీ సర్కారుకు ముందే తెలుసు. అయితే, 'విభజన' ఆయుధంతో ఈ పథకంపై ప్రజలను రెండు విభాగాలుగా చీల్చటంలో కేంద్రం విజయం సాధించింది'' అని విశ్లేషకులు తెలిపారు.
'తప్పులను కప్పిపుచ్చుకోవడానికే..'
'' మోడీ సర్కారు ఈ పథకం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయిందని ఒక వర్గం చెప్తున్నది. ఈ కారణంగానే ఆందోళనలు, నిరసనలు చెలరేగాయని ఆరోపించింది. సాగుచట్టాల విషయంతో పాటు గత ఎనిమిదేండ్లుగానూ ఇదే విషయాన్ని చెప్తున్నది. అయితే, తన మాటకారితనంతో ఎన్నికలకు ముందు ప్రజలకు వాగ్దానాలను చేర్చిన మోడీ.. ఈ విషయంలో ఎందుకు విఫలమయ్యాడు'' అని విశ్లేషకులు, నిపుణుల ప్రశ్నించారు. తమ తప్పుడు నిర్ణయాలను కప్పిపుచ్చుకునే ఉద్దేశంలో భాగంగానే మోడీ సర్కారు ఈ విధంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు.
'మోడీ విఫలం'
''భూసేకరణ చట్టం నుంచి అగ్నిపథ్ వరకు ప్రజలు ఎందుకు ఆందోళనకు దిగుతున్నారు? ప్రభుత్వ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ప్రజల కోసమే తీసుకొచ్చిన పథకాలు, చట్టాలు అంటూ మోడీ సర్కారు చేసే ప్రకటనలను వారు ఎందుకు పట్టించుకోవటం లేదు?'' అని ప్రశ్నించారు. 'భూ సేకరణ చట్టం' విషయంలోనూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారనీ, వారిలో భయాలను కలుగజేస్తున్నారని మోడీ అన్నారు. అయితే, సదరు చట్టం విషయంలో రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించలేకపోయామన్న నిజాన్ని సాక్షాత్తూ ప్రధానే ఒప్పుకున్నారని విశ్లేషకులు గుర్తు చేశారు. అలాగే, మూడు వివాదాస్పద సాగు చట్టాల విషయంలోనూ మోడీ ఇదే ప్రకటన చేసి విఫలమయ్యాడని తెలిపారు.
ప్రజలలో విభజన తెచ్చిన చట్టాలు
సీఏఏ : పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలలో వేధింపులకు గురవుతున్న ముస్లిమేతర మైనారిటీలకు భారత్‌లో పౌరసత్వం కల్పించటానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చామని మోడీ ప్రభుత్వం చెప్పుకున్నది. అయితే, ఈ చట్టంపై ముస్లిం సమాజంలో అనుమానాలు, అపోహాలను మోడీ సర్కారు ఎందుకు తీర్చలేకపోయింది.
ట్రిపుల్ తలాఖ్ : ట్రిపుల్ తలాఖ్‌ను ముస్లిం మహిళ ఎదుర్కొంటున్న సామాజిక వివక్షగా బీజేపీ అభివర్ణించింది. ఆ ఆచారాన్ని రద్దు చేసింది. చట్టాన్ని తీసుకొచ్చింది. 'ముమ్మారు తలాఖ్' చెప్పే ముస్లిం పురుషులను నేరస్థులను చేసి.. మహిళలకు స్వేచ్ఛను కల్పించేదే ఈ చట్టమని మోడీ చెప్పిన మాటలను ముస్లిం మహిళలే నమ్మలేదని విశ్లేషకులు చెప్పారు.
పెద్ద నోట్ల రద్దు : నల్లధనాన్ని వెనక్కి తీసుకురావటం, ఉగ్రవాదానికి, నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట వేయటానికి పెద్ద నోట్ల రద్దును చేపట్టామని మోడీ సర్కారు చెప్పింది. అయితే, ఈ నిర్ణయంతో దేశంలోని సాధారణ ప్రజానీకం బ్యాంకుల ముందు క్యూ కట్టి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నది. పెద్ద నోట్ల రద్దుతో మోడీ ప్రభుత్వం సాధించిందేమిటి? అని విశ్లేషకులు ప్రశ్నించారు. 'సరిహద్దుల వద్ద సైనికుల గంటల కొద్ది దేశం కోసం కాపలా కాస్తున్నారు. బ్యాంకుల ముందు ఒక్క గంట నిలబడలేరా?' అంటూ బీజేపీ, దాని అనుకూల మాద్యమాలు చేసిన ప్రచారాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
జీఎస్టీ : ఒకే దేశం.. ఒకే పన్ను పేరుతో 2017లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను మోడీ సర్కారు తీసుకొచ్చింది. అయితే, ఇది దేశంలోని చిన్న వ్యాపారాలకు ఒక పీడకలను మిగిల్చిందనీ, అవి ఇప్పటికీ కష్టాలను ఎదుర్కొంటున్నాయని విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు చెప్పారు.
ఆర్టికల్ 370 : ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదాను కేంద్రం తొలగించింది. ఉగ్రవాదం, వేర్పాటువాదులకు అడ్డుకట్ట వేయటంతో భాగమే మోడీ సర్కారు చర్యగా ఇతర ప్రాంతాల ప్రజలు భావించారు. అయితే, జమ్మూకాశ్మీర్ ప్రజలు కోల్పోయిన హక్కులు, ప్రత్యేక ప్రతిపత్తి, ఎదుర్కొంటున్న అమానవీయ పరిస్థితులు వెలుగులోకి రాకపోవటం (రాకుండా జాగ్రత్తపడటం) గమనించాల్సిన అంశమని విశ్లేషకులు చెప్పారు.
అసోంలో అమలు చేసిన ఎన్నార్సీని.. దేశవ్యాప్తంగా అమలు చేస్తామని సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి ప్రకటించారు. ఇందులోనూ ఒక వర్గంవారిని లక్ష్యంగా చేసుకుంటూ ప్రచారాలు సాగించిన విషయాన్ని విశ్లేషకులు గుర్తుచేశారు. సుదీర్ఘకాలంల రాజకీయ ఆయుధంగా వాడుకున్న అయోధ్య అంశాన్నీ తన ఖాతాలో వేసుకున్న బీజేపీ.. రామ మందిర నిర్మాణం విషయంలో ప్రజలు, రాజకీయ పార్టీలలో విభజనను తీసుకొచ్చిందని చెప్పారు.
ఇప్పుడు అగ్నిపథ్ విషయంలోనూ మోడీ సర్కారు ఇదే విధంగా వ్యవహరించిందన్నారు. దేశం కోసం సేవ అనే 'జాతీయ భావన' పేరుతో యువతలో చీలిక తీసుకురావటంలో మోడీ సర్కారు విజయం సాధించిందనీ, అయితే, పథకంలో ఉన్న లోటుపాట్లు, అనుమానాలను పరిష్కరించటంలో మాత్రం శ్రద్ధ పెట్టలేకపోయిందని విశ్లేషకులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.