Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాలను సంక్షోభంలోకి నెట్టి కూల్చుతోంది..
- వేర్వేరు సిద్ధాంతాలు, భావజాలాల మధ్య పోటీ : యశ్వంత్ సిన్హా
- ప్రభుత్వ పాలన, రాజకీయాల్లో నా ట్రాక్ రికార్డ్ స్పష్టంగా ఉంది..
వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న బీజేపీతో ఇప్పటి బీజేపీకి పోలికే లేదు. ఇప్పుడున్న బీజేపీ కుట్రలు, కుతంత్రాల్ని నమ్ముకుంది. ప్రభుత్వాల్ని కూల్చుతోంది. రాజకీయ సంక్షోభాల్ని సృష్టిస్తోంది. అవకాశవాద రాజకీయాలకు ప్రధాని మోడీ, అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ తెరలేపింది. రాష్ట్రపతి పదవికి జరుగుతున్న ఎన్నికలో ద్రౌపదీ ముర్మునీ బీజేపీ నిలబెట్టింది. రాజకీయాల్లో, ప్రభుత్వ పాలనలో..ఆమెకన్నా నా ట్రాక్ రికార్డే స్పష్టంగా ఉంది.
- ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.
భారత రాష్ట్రపతి పదవికి కోసం జరుగుతున్న ఎన్నిక రసవత్తరంగా మారింది. మోడీ సర్కార్ ప్రకటించిన ద్రౌపదీ ముర్ము, విపక్షాల అభ్యర్థిగా బరిలో నిలిచిన యశ్వంత్ సిన్హా మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టు సాగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఒక గిరిజన మహిళగా ద్రౌపదీ ముర్ముకు ఉండే సానుకూల అవకాశాలు ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో తన ట్రాక్ రికార్డ్ తక్కువేమీ కాదని యశ్వంత్ సిన్హా అంటున్నారు. ప్రభుత్వ పాలన, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవముందని, ప్రజా సేవ చేశానని చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపు సాధించే ప్రజాప్రతినిధుల సంఖ్యాబలం తనకుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఒక ఆంగ్ల న్యూస్ వెబ్‌పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇంకా ఏమన్నారంటే..
మీకు సంఖ్యాబలం లేదు కదా! ఓడిపోతారని తెలిసీ ఎన్నికల్లో ఎందుకు నిలబడ్డారు?
ప్రతిపక్షాలకు సంఖ్యాబలం లేదని మీరెలా చెబుతారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచే సంఖ్యాబలం ఉందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుస్తాననే పూర్తి విశ్వాసం నాకుంది. మీకున్న సమాచారం పూర్తిగా కరెక్ట్ కాదు.
ప్రతిపక్షాల మొదటి ఛాయిస్ మీరు కాదు.
ముగ్గురు తప్పుకోగా..మీరు వచ్చారు?
శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, గోపాల కృష్ణ గాంధీ పోటీలో నిలబడకపోవటానికి వారి కారణాలు వారికి ఉన్నాయి. నేను మొదటి ఛాయిసా..నాలుగోదా? అన్నదానికి ఇప్పుడు ప్రాధాన్యత లేదు. ఎన్నో రాజకీయ పార్టీలతో కూడిన ప్రతిపక్షాల కూటమి నన్ను ఎంచుకున్నది. ఇది చాలా ముఖ్యమైన అంశం.
సంఖ్యాబలం ఉందా? లేదా? అన్నదికాదు..రెండు సిద్ధాంతాల మధ్య పోటీ అంటున్నారు?
అవును. రెండు వేరు వేరు భావజాలాలు, సిద్ధాంతాల మధ్య పోటీ ఇది. ఒక వ్యక్తి గుర్తింపు, అస్తిత్వం ఆధారంగా జరుగుతున్న పోటీ కాదు. రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీయటం, ప్రజాస్వామ్య విలువలను పాతరేయటమే పనిగా మోడీ సర్కార్ ముందుకు వెళ్తోంది. బుల్డౌజర్ రాజకీయాలు ఇంతకు ముందు ఉన్నాయా? ఇప్పుడు ఎందుకు వచ్చాయి? కేంద్రంలో నియంతృత్వం ప్రభుత్వం ఉంది కాబట్టే. ఈ తరహా రాజకీయాల్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. సంయుక్తంగా నన్ను అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబెట్టాయి.
ఇదే బీజేపీలో ఒకప్పుడు మీరున్నారు. ఇదే ఆర్ఎస్ఎస్ వెనుకుండి నడిపించింది కదా?
ఎల్.కె.అద్వానీ, వాజ్‌పేయ్ నేతృత్వంలో నడిచిన బీజేపీలో నేను 1993లో చేరాను. అప్పటి బీజేపీకి, మోడీ, అమిత్ షా నేతృత్వంలో నడుస్తున్న ఇప్పటి బీజేపీకి చాలా తేడా ఉంది. ఇంకా చెప్పాలంటే..అసలు పోలికే లేదు. ఉదాహరణకు జమ్మూకశ్మీర్ విషయమే తీసుకుంటే, ప్రధానిగా వాజ్‌పేయ్ ఆనాడు అన్ని రాజకీయ పక్షాలతో మాట్లాడారు. హురియత్ నాయకులతో అద్వానీ చర్చలు జరిపారు. ఏకాభిప్రాయం సాధించి ముందుకు వెళ్లాలని వాజ్‌పేయ్ ప్రభుత్వం పనిచేసింది. ఇప్పుడున్న మోడీ సర్కార్ సంక్షోభాల్ని సృష్టించి, కుట్రలు, కుతంత్రాలను నమ్ముకొని పనిచేస్తోంది.
ద్రౌపదీ ముర్ము అభ్యర్తిత్వంపై మీ అభిప్రాయం?
జార్ఖండ్ గవర్నర్‌గా ఆమె గురించి నాకు తెలుసు. వాజ్‌పేయ్ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థికమంత్రిగా ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఎన్నో నిధులు ఖర్చు అయ్యేలా చూశాను. ప్రభుత్వ పాలనలో సుదీర్ఘ అనుభవం నాకుంది. కేంద్రరాష్ట్ర సంబంధాలు బాగా తెలిసినవాడ్ని. రాజకీయ అనుభవముంది. ఇదంతా నా ట్రాక్ రికార్డ్. దీనిని తెలుసుకొని ఇద్దరి మధ్యా ఒక అంచనాకు రావాలని కోరుతున్నా. ద్రౌపదీ ముర్ము ఒడిషా మంత్రిగా, జార్ఖాండ్ గవర్నర్‌గా పనిచేశారు. అణగారిన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీలకు ఆమె ఏం చేశారన్నది..మీరు పరిశీలించుకోవచ్చు.