Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వినతి
న్యూఢిల్లీ: సాయుధ దళాల్లో కాంట్రాక్టు పేరుతో ఉద్యోగాల భర్తీ కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. శుక్రవారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జిల్లా, మండల కేంద్రాల్లో ఆందోళన జరిగింది. శాంతియుత ప్రదర్శలను జరిగాయి. అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లో వందలాది ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువకులు, మహిళలు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. రైతు వ్యతిరేక, దేశ వ్యతిరేక పథకమని నినదించారు.
రైతు సంఘాలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వినతి పత్రాన్ని పంపించాయి. ''అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే పూర్తిగా రద్దు చేయాలి. సైన్యంలో గతంలో ఖాళీగా ఉన్న 1,25,000 పోస్టులకు, ఈ సంవత్సరం ఖాళీగా ఉన్న సుమారు 60,000 పోస్టులకు రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌ను జరపాలి. కొనసాగుతున్న రిక్రూట్మెంట్లను పూర్తి చేయడం, గత రెండేండ్లుగా నాన్ రిక్రూట్మెంట్కు బదులుగా జనరల్ రిక్రూట్మెంట్ కోసం యువతకు 2 సంవత్సరాల వయస్సు సడలింపు ఇవ్వాలి. అగ్నిపథ్ వ్యతిరేక చర్యలో పాల్గొన్న యువకులపై నమోదు చేసిన అన్ని తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి, అరెస్టు చేసిన యువకుల విడుదల చేయాలి'' అని వినతి పత్రంలో పేర్కొన్నాయి. అగ్నిపథ్ పథకం వల్ల దేశానికి, సాయుధ దళాలలో చేరాలని ఆకాంక్షిస్తున్న యువతకు, దేశంలోని రైతు కుటుంబాలకు జరిగే పెద్ద మోసమని ఎస్కేఎం పేర్కొంది. నాలుగున్నరేండ్లపాటు సేవలందించిన మూడు వంతుల అగ్నివీరులు రోడ్డున పడేలా చేయడం యువతకు తీరని అన్యాయమని దుయ్యబట్టింది. ''రెజిమెంట్ సామాజిక లక్షణాన్ని ''ఆల్ క్లాస్ ఆల్ ఇండియా'' రిక్రూట్లతో భర్తీ చేయడం తరతరాలుగా జరగుతుందని, దేశానికి సేవ చేసిన ప్రాంతాలు, వర్గాలకు ఇది భారీ దెబ్బని ఎస్‌కెఎం పేర్కొంది. వీటిలో పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, తూర్పు రాజస్థాన్ వంటి ప్రాంతాలు ఉన్నాయని తెలిపింది.