Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు
- సంతకాలు చేసి పాల్గొన్న వైసీపీ ఎంపీలు
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం నాడిక్కడ పార్లమెంట్‌లోని రాజ్యసభ సెక్రటేరియట్లో రిటర్నింగ్ అధికారి (రాజ్యసభ సెక్రటరీ జనరల్) పిసి మోడీకి నాలుగు సెట్లు నామినేషన్ పత్రాలను అందజేశారు. తొలిత ఒరిస్సా భవన్ నుంచి పార్లమెంట్‌కు చేరుకున్న ద్రౌపది ముర్ము, పార్లమెంట్ ఆవరణలో మహాత్మ గాంధీ, బిఆర్ అంబేద్కర్, బిర్సా ముండా విగ్రహాల వద్ద నివాళులర్పించారు. అనంతరం పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్స్‌లో ఎన్డీయే పక్షాలతో పాటు బీజేడీ, వైసీపీ నేతల సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ నుంచి నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీయే పక్షాలు, బీజేడీ, వైసీపీ నేతలతో రాజ్యసభ సెక్రటేరియట్‌కు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భాగస్వామి పక్షాలతోపాటు బీజేడీ, వైసీపీ నాయకుల సమక్షంలో ద్రౌపది ముర్ము నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ప్రకటించిన వైసీపీ తరుపున ఆ పార్టీ నేత విజయసాయి రెడ్డి హాజరయ్యారు. ద్రౌపది ముర్మును బలపరుస్తూ వీరంతా సంతకాలు చేశారు. ముర్ము పేరుని మొదటిగా ప్రధాని మోడీ ప్రతిపాదించారు. ఆ తర్వాత రెండో వ్యక్తిగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బలపరిచారు. ద్వితీయ స్థాయి ప్రతిపాదకుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. మూడవ స్థాయి బలపరిచినవారిలో హిమాచల్‌ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఇక నాల్గో స్థాయి ప్రతిపాదకుల్లో గుజరాత్‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, భూపేంద్ర యాదవ్, శర్బానంద్ సోనివాల్, ఆర్కె సింగ్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, బి.ఎస్ బొమ్మై, భూపేంద్ర పటేల్, హిమంత బిస్వా శర్మ, పుష్కర్ సింగ్ ధామి, ప్రమోద్ సావంత్, ఎన్ బిరెన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అన్నాడీఎంకే నేత ఓ పన్నీర్ సెల్వం, ఎం.తంబిదురై, జేడీయూ నేత రాజీవ్ రంజన్ సింగ్, అప్నాదల్ నేత అనుప్రియ పటేల్, ఆర్పీఐ నేత రాందాస్ అథ్వాలే, ఆర్ఎల్జేపీ నేత పసుపతి కుమార్ పర్సా తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ పత్రాలపై వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి సంతకాలు చేశారు.