Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సామాజిక ఉద్యమకారణి, రచయిత్రి కాకర్ల సజయను ప్రతిష్ఠాత్మక సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వరించింది. శుక్రవారం నాడిక్కడ రవీంద్ర భవన్లో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబర్ అధ్యక్షతన సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2021 ఏడాదికి గానూ అనువాద రచనల విభాగంలో అవార్డులను బోర్డు ఆమోదించింది. ఈ అవార్డలకు దేశంలోని వివిధ భాషలకు చెందిన 22 పుస్తకాలను ఎంపిక చేసింది. మైథిలి, రాజస్థానీ భాషలకు సంబంధించిన అనువాద పురస్కార విజేతలను త్వరలో వెల్లడించనున్నట్టు తెలిపింది. తెలుగు అనువాద రచనలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం కాకర్ల సజయను వరించింది. ప్రముఖ రచయిత్రి భాషా సింగ్ హిందీలో రాసిన అదశ్య భారత్ (నాన్ఫిక్షన్) పుస్తకాన్ని 'అశుద్ధ భారత్' పేరుతో కె. సజయ తెలుగులోకి అనువదించారు. ఈ అనువాద రచన ఎంపికకు జ్యూరీ సభ్యులుగా ఎస్.శేషారత్నం, వై. ముకుంద రామారావు, గుమ్మ సాంబశివరావు వ్యవహరించారు. ఈ పురస్కారం కింద రాగి షీల్డ్, రూ.50వేల నగదును అందజేయనున్నారు. దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల హృదయ విధారక జీవన స్థితిగతులను వివరిస్తూ ప్రముఖ జర్నలిస్టు, రచయిత్రి భాషా సింగ్ హిందీలో రాసిన 'అదృశ్య భారత్' పుస్తకాన్ని సజయ తెలుగులోకి అనువదించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనదేశంలో నేటికీ కొనసాగుతున్న మాన్యువల్ స్కావెంజింగ్ గురించి ఆధార సహితంగా పట్టిచూపిన ఈ పరిశోధనాత్మక గ్రంథాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేశారు. దేశంలో తరతరాలుగా పారిశుద్ధ్య కార్మికులు అనుభవిస్తున్న బాధావ్యధల గాథలు, వారి వాస్తవ జీవనానికి అక్షర రూపమే అశుద్ధ భారత్ పుస్తకం. దీన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 'అశుద్ధ భారత్' శీర్షికన ప్రచురించింది. 2018లో వివిధ సాహిత్య ప్రక్రియల్లో ఉత్తమ రచనలకు గాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనువాద విభాగంలో విశిష్ట పురస్కారాన్ని సజయకు అందజేసింది. సజయ కృష్ణా జిల్లా పెద్దముత్తేవిలో జన్మించారు. మచిలీపట్నం, విజయవాడ, హైదరాబాద్లో ఆమె విద్యాభ్యాసం కొనసాగింది. మహిళ సమస్యలపై ఆమె నిరంతరం పోరాటాలు చేస్తుంది. రచయిత్రిగా, అనువాదకురాలిగా, ఇండిపెండింట్ జర్నలిస్టుగా, ప్రచురణకర్తగా, డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్గా, సామాజిక కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. మహిళ, ట్రాన్స్జండర్ల సమస్యలపై, యురేనియం తవ్వకాలు, దేశంలో వ్యవసాయ సంక్షోభం, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమె వివిధ పత్రికల్లో వ్యాసాలు రాస్తుంటారు. అలాగే టీవీల్లో చర్చా గోష్టుల్లో పాల్గొంటారు.