Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరల దెబ్బ ప్రభావం
- వస్త్రాలు, ఇంధన వ్యయాల్లో కోత
- సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో నానాటికి పెరుగుతున్న అధిక ధరల నేపథ్యంలో ప్రజలు అచీతూచి కొనుగోళ్లు చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రజలు గత ఆరు నెలలుగా వస్త్రాలు, ఇంధనం, బయట అహారంపై వ్యయాలను తగ్గించుకుంటున్నారని గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ 'యుగోవ్' సర్వేలో వెల్లడయ్యింది. గతేడాదితో పోల్చితే మెజారిటీ పట్టణ ప్రజల నివాస వ్యయం పెరిగింది. ''గత ఎనిమిదేండ్లలో ఎప్పుడూ లేని విధంగా ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి ఎగిసింది. అధిక పెట్రోల్ ధరలు టోకు ద్రవ్యోల్బణం సూచీని 30 ఏండ్ల గరిష్టానికి చేర్చడంతో ప్రజలపై వ్యయ భారం పెరిగింది.'' అని ఈ సర్వే రిపోర్ట్ తెలిపింది.
ప్రస్తుత ఏడాది ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ 7.79 శాతానికి ఎగిసి ఎనిమిదేండ్ల గరిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. దీంతో అనేక కుటుంబాలు తమ వ్యయాలను తగ్గించుకుంటున్నాయి. ఈ సర్వేలో 1,013 మంది పట్టణ వినియోగదారుల అభిప్రాయాలను సేకరించారు. జూన్ 7-10 తేదిల్లో నిర్వహించిన ఈ ఆన్లైన్ సర్వేలో 46 శాతం మంది కూడా తమ జీవన వ్యయాలు భారీగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్వల్పంగా వ్యయాలు పెరిగాయని 33 శాతం మంది పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణీ నగరాలతో పోల్చితే ప్రథమ శ్రేణీ నగర వాసులు తమపై అధిక ద్రవ్యోల్బణ ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయని వాపోయారు. సగం మంది పైగా తమ వ్యయాలు పెరిగాయని ప్రథమ శ్రేణీ నగరాల వాసులు ఆందోళన వ్యక్తం చేయగా.. టైర్ 2 నగరాల్లో 44 శాతం, టైర్ 3 నగరాల్లో 43 శాతం మంది అధిక ధరలపై ఆవేదన వ్యక్తం చేశారు.
అధిక ధరల నేపథ్యంలో ముఖ్యంగా వస్త్రాలపై వ్యయాలపై తగ్గించుకున్నట్టు అధిక మంది తెలిపారు. తమ అనేక అలవాట్లకు కోత పెట్టుకున్నామని 31 శాతం మంది పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించుకున్నట్లు 29 శాతం, బయటి అహారంపై ఖర్చులను తగ్గించుకున్నట్లు 28 శాతం మంది వెల్లడించారు. కాగా వచ్చే 12 మాసాల్లో తమ పరిస్థితి మెరుగుపడొచ్చని ప్రతీ ఐదుగురిలో ఇద్దరు మాత్రమే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి మార్పు ఉండకోవచ్చని 32 శాతం మంది, దుర్బరంగా ఉండొచ్చని 17 శాతం ఆందోళన వ్యక్తం చేశారు.