Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షా ఆదేశాలతో రంగంలోకి గుజరాత్ ఏటీఎస్ బృందం
- అరెస్టును తీవ్రంగా ఖండించిన సీపీఐ(ఎం)
ముంబయి : సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌ను గుజరాత్ తీవ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. 2002 గుజరాత్ నరమేధం కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి క్లీన్చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన మరుసటి రోజే ఆ పిటిషన్ దాఖలు చేసినవారిలో ఒకరైన తీస్తా సెతల్వాద్‌ను లక్ష్యంగా చేసుకొని ఏటీఎస్ రంగంలోకి దిగడం అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలతోనే ఏటీఎస్ పోలీసులు ఆమెను అరెస్టు చేసినట్టు కథనాలు వెలువడ్డాయి. గుజరాత్ నరమేధం కేసుకు సంబంధించి నకిలీ పత్రాలను తయారు చేశారనే ఆరోపణలతో తీస్తా సెతల్వాద్, పోలీసు మాజీ అధికారులు ఆర్బి శ్రీకుమార్, సంజీవ్ భట్‌లపై అహ్మదాబాద్ సిటీ క్రైం బ్యాచ్‌లో శనివారం ఉదయం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ముంబయిలో శాంతాక్రూజ్‌లోని ఆమె నివాసానికి వెళ్లిన గుజరాత్ పోలీసులు ముందస్తు నోటీసులేవీ ఇవ్వకుండానే అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సెతల్వాద్‌తో పాటు ఆర్బి శ్రీకుమార్‌ను కూడా గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1990 కస్టడీ మృతి కేసులో సంజీవ్ భట్ జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్ట దిగజార్చడానికి తీస్తా సెతల్వాద్ ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శనివారం ఉదయం ఆరోపించగా..ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆమెను గుజరాత్ పోలీసులు ఆమెను నిర్భంధంలోకి తీసుకోవడం గమనార్హం. 2002 గుజరాత్ నరమేధం కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి క్లీన్చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపి ఇషాన్ జఫ్రి భార్య జకియా జఫ్రి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసిన సంగతి తెలిసిందే.
సీపీఐ(ఎం) ఖండన
తీస్తా సెతల్వాద్‌ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. అలుపెరగని మానవ హక్కుల ఉద్యమ కార్యకర్త సెతల్వాద్‌ను సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో గుజరాత్ పోలీసులు అరెస్టు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని సీపీఐ(ఎం) ట్వీట్ చేసింది. ఈ అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఆమెపై తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలని, వెంటనే విడుదల చేయాలని చేసింది.