Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజుకు 12 గంటల పని
- వేతనాల్లో కోతలు
- ఉద్యోగుల తొలగింపు సులభతరం
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు కార్మిక చట్టాలను (కోడ్స్) జులై 1 నుంచి అమల్లోకి తేవాలని యోచిస్తున్నది. ఇప్పటివరకూ 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కొత్త కార్మిక చట్టాలకు సంబంధించి నియమ, నిబంధనలను రూపొందించాయి. కొన్ని రాష్ట్రాలు ఇంకా రూపొందించలేదు. అయితే చట్ట నిబంధనలు రూపొందించాలని మిగిలిన రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నది. 29 చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ అనే నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.
న్యూఢిల్లీ : ఈ లేబర్ కోడ్స్ చట్టాలను పార్లమెంట్ ఆమోదించినప్పటికీ ఉమ్మడి జాబితాలో ఉండటం వల్ల ఆయా రాష్ట్రాలు కూడా వీటిని నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ చట్టాలు అమల్లోకి వస్తే ఉద్యోగుల వేతనం, పీఎఫ్ కాంట్రిబ్యూషన్, పని సమయం, వారాంతపు సెలవులు (వీక్లీ ఆఫ్‌లు) వంటి వాటిలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. కార్మికుల సంక్షేమం కోసమే ఈ కోడ్స్ తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఈ కోడ్స్ వల్ల కార్మికులకు తీవ్రనష్టం జరుగుతుందని ఈ లేబర్ కోడ్స్‌ను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవలి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ కార్మిక కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
8 గంటల పని దినం ఔట్..
కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ వల్ల రోజువారీ పని సమయం 12 గంటలకు పెరగనుంది. ప్రస్తుతం ఉన్న 8 గంటలకు బదులు 12 గంటల పాటు పనిచేయాలని ఉద్యోగులను కంపెనీ యాజమాన్యం ఆదేశిస్తుంది. అయితే, వారానికి గరిష్ఠంగా 48 గంటలు పనిచేయాల్సి ఉంటుందని ప్రస్తుత ఫ్యాక్టరీ చట్టం చెబుతున్నది. ఒకవేళ సదరు కంపెనీ 8 గంటలు మాత్రమే పనిచేయించుకుంటే వారంలో ఒక వీక్లీ ఆఫ్ మాత్రమే వస్తుంది. 12 గంటలు చేయించుకుంటే.. నాలుగు రోజుల తర్వాతి మూడు రోజులు ఆఫ్ ఉంటుందని చెబుతున్నారు. అన్ని రంగాలలో కొత్త చట్టాల ప్రకారం ఓవర్‌టైమ్ గరిష్ట గంటలు 50 గంటల నుంచి 125 గంటలకు పెరుగుతాయి.
వేతనం తగ్గుదల
కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం మొత్తం వేతనంలో మూల వేతనం (బేసిక్ శాలరీ) సగం ఉండాలి. అంటే అలవెన్సులు 50 శాతానికి మించి ఉండకూడదు. ఈ లెక్కన బేసిక్ పెరిగినప్పుడు ఆ మేర పిఎఫ్ కాంట్రిబ్యూషన్ మొత్తం పెరుగుతుంది. దీనివల్ల చేతికొచ్చే వేతనం తగ్గుతుంది. అయితే, పదవీ విరమణ తరువాత వచ్చే మొత్తంతో పాటు, గ్రాట్యూటీ ఎక్కువ మొత్తంలో లభిస్తుందని ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ సంస్థల్లో పనిచేసేవారి వేతనంలో ఎక్కువ శాతం అలవెన్సులే ఉంటాయి. ఇటువంటి వారికి ప్రయోజనం ఉండొచ్చు. కానీ, కార్మికులందరికీ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం హైప్ ఇస్తున్నది. ఇది మోసపూరితం.
ఉద్యోగుల తొలగింపు సులభతరం
కొత్త లేబర్ కోడ్ కంపెనీలకు కార్మికులను తొలగించడాన్ని సులభతరం చేస్తుంది. 300 కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు ఉద్యోగులను తొలగించడానికి ముందు ప్రభుత్వ అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. అంటే.. మొత్తం కంపెనీల్లో అత్యధిక శాతం కంపెనీలు ఏ అనుమతీ లేకుండా కార్మికులను తొలగించే సౌకర్యం కల్పిస్తున్నారు. ఉద్యోగికి ఏడాదిలో ఇచ్చే సెలవుల్లో ఎలాంటి మార్పూ ఉండబోదు. అలాగే, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు 180 రోజులు దాటిన తరువాత సెలవులు పొందొచ్చు. ప్రస్తుతం 240 రోజులు దాటాకే సెలవులు వస్తున్నాయి. ఇటువంటి వాటిని చూపి.. ఈ కోడ్స్‌పై కేంద్రం ప్రచారం చేస్తున్నది.
లేబర్ కోడ్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్‌ను సీఐటీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆ సంఘం జాతీయ అధ్యక్షురాలు కె.హేమలత పేర్కొన్నారు. 'సీఐటీయూ తొలి నుంచి ఈ లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తున్నది. ఈ కోడ్ల వల్ల కార్మికుల జీవితాలు దుర్భరమవుతాయి. కనీస వేతనాలపై 1957లో ఐఎల్సీ ఆమోదించిన ఫార్ములా ఉంది. దాని ప్రకారమే కనీస వేతనం రూ.26 వేలు డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇప్పటికీ ఐఎల్సీ ప్రకారం కనీస వేతనం కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. లేబర్ కోడ్ల వల్ల సంఘం పెట్టుకొనే హక్కు పోతుంది. దీంతో పాటు కార్మికుల హక్కులన్నీ కాలరాయబడతాయి. సామాజిక భద్రత ఉండదు. అందువల్లే ఈ లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తున్నాం. లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే సమ్మె చేస్తాం'' అని హేమలత హెచ్చరించారు.
- కె.హేమలత, సీఐటీయూ