Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేరు..శివసేన బాలాసాహెబ్ ఠాక్రే !
- ఆ పేరుతో పార్టీకి అనుమతించవద్దని ఈసీకి సీఎం ఉద్ధవ్ లేఖ
- ముంబయి, థానేలో 144 సెక్షన్ విధించిన పోలీసులు
న్యూఢిల్లీ : మహారాష్ట్ర రాజకీయాలు రోజులు గడుస్తున్న కొద్దీ మరింత వేడేక్కుతున్నాయి. ఇటు ఉద్ధవ్ వర్గం, అటు షిండే వర్గం ఏ నిర్ణయం తీసుకుంటోందోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. షిండే వర్గం కొత్తపార్టీపై ప్రకటన చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలు తమ బృందానికి 'శివసేన బాలాసాహెబ్ ఠాక్రే' అనే పేరు పెట్టనున్నట్టు సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. శనివారం శివసేన జాతీయ కార్యవర్గంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కీలక సమావేశం ఏర్పాటుచేసిన సమయంలో రెబల్ ఎమ్మెల్యేల పార్టీ పెడుతున్నారని, దానికి శివసేన బాలాసాహెబ్ ఠాక్రే పేరు గురించి బయటకు వచ్చింది. మరోపక్క అసమ్మతి ఎమ్మెల్యేల వైఖరిని నిరసిస్తూ..శివసేన కార్యకర్తలు రాష్ట్రంలో పలు చోట్ల నిరసనలు చేపడుతున్నారు. పూణెలోని రెబల్ ఎమ్మెల్యే తానాజీ సావంత్ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. ఇది ప్రారంభం మాత్రమేనని, మరికొన్ని కార్యాలయాలను ధ్వంసం చేస్తామంటూ కొందరు పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ఈ పరిస్థితులను గమనించిన హోంశాఖ రాజధాని నగరం ముంబయి, థానెలలో 144 సెక్షన్ విధించింది. ముంబయిలో హై అలర్ట్ ప్రకటించి, అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో థానేలో షిండే ఇంటివద్ద భద్రత పెంచారు. ప్రస్తుతం ఆయన అసమ్మతి వర్గ నేతలకు నాయకత్వం వహిస్తున్నారు. వారంతా అసోంలోని గౌహతిలో మకాం వేశారు.
బాలాసాహెబ్, శివసేన పేర్లు వాడొద్దు..
- ఈసీని ఆశ్రయించిన ఉద్ధవ్ వర్గం!
అసమ్మతి నేతలు శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే పేరును ఉపయోగించకుండా ఆపాలని ఆ పార్టీ జాతీయ కార్యవర్గం శనివారం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ముంబయిలో పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో దానికి ఆమోదం లభించింది. బాలాసాహెబ్, శివసేన పేర్లను ఏ వర్గం ఉపయోగించకుండా చూడాలంటూ ఉద్ధవ్ వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ''పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న కొందరు ఎమ్మెల్యేలు, బాలాసాహెబ్, శివసేన పేర్లను దుర్వినియోగం చేసి, గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మేం అనుమానిస్తున్నాం. షిండే ఆయన వర్గం కోరుకున్నట్టుగా వారు రాజకీయ పార్టీ పెట్టుకోవడాన్ని మేం నిషేధించలేం. అయితే ఈ రెండు పేర్లను ఉపయోగించడాన్ని మాత్రం మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయాన్ని ముందస్తుగా మీ దృష్టికి తీసుకువస్తున్నా''మని ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నది. షిండే వర్గం కొత్త పార్టీ స్థాపించనుందని, దానికి శివసేన బాలాసాహెబ్ ఠాక్రే అనే పేరు పెట్టనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఉద్ధవ్ వర్గం ఈసీని ఆశ్రయించింది. అలాగే ఈ రెండు పేర్లను ఉపయోగించిన వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తామని పార్టీ ప్రతినిధి సంజరు రౌత్ హెచ్చరించారు.