Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగళూరులో మంత్రి డెవలపర్స్ సీఈఓ సుశీల్ మంత్రి అరెస్టు
బెంగళూరు : ఇండ్లు కట్టిస్తామన్న పేరుతో వేలాదికోట్ల రూపాయిలను స్వాహా చేసిన మంత్రి డెవలపర్స్ సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్ సుశీల మంత్రిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికారులు శనివారం అరెస్టు చేశారు. దక్షిణ భారతంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థగా 'మంత్రి'కి పేరుంది. అరెస్టు అనంతరం సుశీల్ మంత్రిని న్యాయమూర్తి ముందు హాజరు పరచగా, విచారణ నిమిత్తం ఇడి కస్టడీకి అప్పగించారు. బెంగళూరులో ఫ్లాట్ల కొనుగోలుదారుల నుండి సేకరించిన మొత్తాలను ఆయా ప్రాజెక్టులపై ఖర్చు పెట్టడానికి బదులుగా, సుశీల్ తన వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారని దర్యాప్తు సంస్థ విచారణలో వెల్లడైంది. ''వివిధ ఆర్థిక సంస్థల నుండి రూ.5 వేల కోట్లు ఆయన రుణంగా తీసుకున్నారు. మరో వెయ్యి కోట్లు బకాయి పడ్డారు. ఈ రుణంలో కొంత మొత్తాన్ని ఎన్‌పిఎ (నిరర్ధక ఆస్తులు) గా కూడా ప్రకటించారు.'' అని ఇడి అధికారులు పేర్కొన్నారు. మనీ లాండరింగ్ కేసులో ప్రస్తుతం జరుగుతున్న విచారణలకు సంబంధించి మంత్రిని అరెస్టు చేసినట్లు ఇడి తెలిపింది. ''మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు కోసం మేం ఆయనను పిలిపించాం. పిఎంఎల్ఎ సెక్షన్ 19 ప్రకారం ఆయనను కస్టడీలోకి తీసుకున్నాం.'' అని ఇడి వర్గాలు మీడియాకు చెప్పాయి. 2020లో మంత్రిపై, కంపెనీపై, డైరెక్టర్లపై, పలువురు ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో మార్చి 22న ఇడి దర్యాప్తు ప్రారంభించింది. ఒకే ప్రాజెక్టుపై పలు చోట్ల నుండి రుణాలు సంపాదించుకునేందుకు కంపెనీ తన ఆస్తులను వివిధ ఆర్థిక సంస్థలకు తాకట్టు పెట్టిన విషయాన్ని అధికారులు ప్రస్తావించారు. శుక్రవారం సుశీల్ మంత్రి స్టేట్మెంట్ను నమోదు చేయడానికి ఇడి పిలిపించగా, తప్పించుకుంటున్నారని, దర్యాప్తుకు సహకరించడం లేదని పేర్కొన్నారు. ''కంపెనీ వ్యవహారాలను దాచిపెట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇడి అడిగిన డాక్యుమెంట్లను, కోరిన సమాచారాన్ని కూడా ఆయన అందచేయడం లేదని అధికారులు తెలిపారు. ఏడు నుండి పదేళ్ళయినా ఇంతవరకు ఫ్లాట్లను అప్పచెప్పడం లేదని బయ్యర్లు పేర్కొంటున్నారు. ఫ్లాట్లు కొనుక్కోవాలనుకున్న పలువురు పోలీసు స్టేషన్లలో ఈ మేరకు ఫిర్యాదులు దాఖలు చేశారు. కాగా, నిందితుడి సంస్థలు లేదా వారికి సంబంధించిన వ్యక్తులు మనీ లాండరింగ్‌లో పాల్గొన్నాయని ఇడి వర్గాలు తెలిపాయి. ఫ్లాట్లను కొనుగోలు చేయాలని వచ్చేవారికి తప్పుదారి పట్టించేలా బ్రోచర్లు చూపించడం, ఇళ్ళను అప్పచెప్పే సమయాలను తప్పుగా చెప్పడం ద్వారా ఈ పథకాలన్నీ చాలా బాగున్నాయని చెబుతూ వారిని ప్రలోభపెట్టారని ఇడి పేర్కొంది. వేలాదిమంది బయ్యర్ల నుండి రూ.1000 కోట్లను అడ్వాన్స్‌గా కంపెనీ వసూలు చేసింది.