Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1975లో వచ్చిన ఫలితమే..మళ్లీ వస్తుంది..
- మోడీ సర్కార్ నియంతృత్వ పాలనకు ఓటమి తప్పదు : సీతారాం ఏచూరి
- బాధితుల తరఫున పోరాడిన తీస్తా సెతల్వాద్ దోషి అవుతారా : సీపీఐ(ఎం)
- న్యాయవ్యవస్థను నమ్ముకుంటే అరెస్టు చేస్తారా?
న్యూఢిల్లీ : నేడు భారతదేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని, ప్రజాస్వామ్య వాదుల్ని, హక్కుల కార్యకర్తల్ని, జర్నలిస్టుల్ని జైల్లో నిర్బంధిస్తున్నారని సీపీఐ(ఎం) ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోడీ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 'మన్‌కీ బాత్'లో ప్రధాని మోడీ 1975 ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. దానిని ఎలా ఎదుర్కొన్నది, చివరికి కాంగ్రెస్‌ను ఓడించింది... ప్రధాని చెప్పుకొచ్చారు. దీనిపై సీతారాం ఏచూరి ట్విట్టర్లో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
''ఆనాడు ఇందిర ప్రభుత్వం ప్రకటిత ఎమర్జెన్సీ విధించింది, నేడు మోడీ సర్కార్ హయాంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోంది. ఆనాడు ప్రజలు ఎలాగైతే కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారో, అదే విధంగా నేడు మోడీ సర్కార్‌కు అదే ఫలితం పునరావృతమవుతుంది. నియంతృత్వాన్ని నమ్ముకున్న పాలకులకు ఓటమి తప్పదు. ప్రజాస్వామ్యానికి మళ్లీ మంచి రోజులొస్తాయి. అందుకోసం ప్రజా పోరాటాన్ని ఉధృతం చేస్తా''మని ట్విట్టర్లో ఏచూరి సందేశాన్ని పోస్ట్ చేశారు.
ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తున్నారు : సీపీఐ(ఎం)
ప్రముఖ హక్కుల కార్యకర్తల, జర్నలిస్టు తీస్తా సెతల్వాద్ అరెస్టును సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఆమె అరెస్టును పౌరుల ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయటంగా అభివర్ణించింది. న్యాయవ్యవస్థను నమ్ముకొని పోరాడినవారిని దోషులుగా పేర్కొంటూ కేసులు పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గుజరాత్ అల్లర్ల కేసులో సిట్ ప్రధాని మోడీకి క్లీన్చిట్ ఇవ్వటాన్ని తీస్తా సెతల్వాద్ న్యాయస్థానంలో సవాల్ చేశారు.
అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఆమెకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వెలువడిన మరుసటి రోజే గుజరాత్ ఏటీఎస్ పోలీసులు తీస్తా సెతల్వాద్‌ను అరెస్టు చేయటం సంచలనం సృష్టించింది. ఫోర్జరీ, కుట్రపూరిత నేరాలు..మొదలైన ఆరోపణలతో ఆమెపై పోలీసులు కొత్త కేసు నమోదుచేశారు. ఈ అరెస్టును, కేంద్రం తీరును సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఈమేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రజాస్వామ్యవాదుల్ని బెదిరిస్తోంది...
తీస్తా సెతల్వాద్ అరెస్టు ద్వారా మొత్తం ప్రజాస్వామ్యవాదులను కేంద్రం బెదిరిస్తోంది. ఇప్పుడు అధికారంలో ఉన్న పాలకుల హయాంలోనే మత ఘర్షణలు, హింస చోటుచేసుకున్నాయి. వారిని ప్రశ్నించే హక్కుల కార్యకర్తల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని పాలకులు జైల్లో నిర్బంధిస్తున్నారు. తమను ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో ఒక సందేశాన్ని పంపుతున్నారు. న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినవారిని, బాధితుల తరఫున పోరాడినవారిని గుజరాత్ ప్రభుత్వం దోషులుగా పరిగణిస్తోంది. పైకోర్టులో అప్పీల్‌కు వెళ్లటం తప్పెలా అవుతుంది? సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు 'క్యూరేటివ్ పిటిషన్'కు (తీర్పును సమీక్షించాలని కోర్టును కోరటం) పూర్తి అర్హమైంది. తీస్తా సెతల్వాద్‌పై మోపిన ఆరోపణలు, కేసుల్ని ఉపసంహరిం చుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.
ఆమెను వెంటనే విడుదల చేయాలి : డి.రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి
తీస్తా సెతల్వాద్ అరెస్టును సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఖండించారు. మానవ హక్కుల కార్యకర్తలను వేధించటం ఆపేయాలని పాలకులను కోరారు.