Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారం చెల్లింపు లేనట్టే
- మార్చి 2026 వరకు లెవీ, సెస్సు మాత్రం వసూలు
- నిబంధనల్ని నోటిఫై చేసిన కేంద్ర ఆర్థికశాఖ
న్యూఢిల్లీ : రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారం చెల్లింపు ఇకపై ఉండబోదని మోడీ సర్కార్ సంకేతాలు ఇచ్చింది. మరో ఐదేండ్లు నష్టపరిహారం చెల్లింపు పొడగించాలని అనేక రాష్ట్రాలు కోరినా కేంద్రం వినిపించుకునే పరిస్థితి కనపడటం లేదు. మరోవైపు పరోక్ష పన్నుల్లో లెవీ, సెస్సు వసూళ్లకు సంబంధించి నిబంధనావళికి ఆమోదముద్ర వేసింది. జీఎస్టీలో వీటి వసూళ్లు మార్చి, 2026 వరకూ ఉంటాయని ఆ నిబంధనల్లో కేంద్రం పేర్కొన్నది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం 28-29 తేదీల్లో జరగనున్నది. ఈనేపథ్యంలో రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారం అనే అంశం మళ్లీ ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుజేయటం వల్ల పన్ను ఆదాయం కోల్పోయిన రాష్ట్రాలకు ఆ లోటును పూడ్చుతామని, 2015-16 పన్ను ఆదాయానికి 14శాతం వృద్ధిని కలుపుకొని జీఎస్టీ నష్టపరిహారాన్ని చెల్లిస్తామని మోడీ సర్కార్ మాటిచ్చింది. ఈ విధానాన్ని జులై 2017 నుంచి జూన్ 2022 వరకు ఐదేండ్లపాటు అమలుజేస్తామని జీఎస్టీ చట్టంలో పేర్కొన్నది. అయితే కరోనా సంక్షోభాన్ని సాకుగా చూపి, రాష్ట్రాలకు కేంద్రం చెల్లింపులు నిలిపివేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహార చెల్లింపు విధానం ఈ ఏడాది జూన్‌తో ముగినున్నది. అయితే రాష్ట్రాల రుణాలు, ఈ ఐదేండ్లలో పెండింగ్ బిల్లులు మాత్రం రాష్ట్రాలకు అందబోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ చెల్లింపుల కింద రాష్ట్రాలకు కేంద్రం రూ.89,783కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.25వేల కోట్లు రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారం కాగా, పెండింగ్ సెస్సు చెల్లింపులు రూ.61,912కోట్లుగా ఉన్నాయి. పన్ను ఆదాయ వృద్ధి గణాంకాల ప్రకారం, మొత్తం 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేవలం ఐదు రాష్ట్రాల్లో మాత్రమే జీఎస్టీ పన్ను వసూళ్లలో వృద్ధి నమోదైంది.