Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఉక్కు' ప్రయివేటీకరణ ఆపకుంటే..
- నాలుగున ఎక్కడికక్కడే ప్రజా నిరసనలు
- స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ మహా ప్రదర్శన, సభలో నేతలు
విశాఖ: నిరంతర పోరాటాలతో విశాఖ కార్మిక వర్గం స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వెనక్కి తిప్పికొడు తుందని కార్మిక, ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు. 'ఉక్కు' ప్రయివేటీకరణపై వెనక్కు తగ్గకుంటే వచ్చే నెల నాలుగున ప్రధాని నరేంద్ర మోడీని విశాఖలో దిగనివ్వబోమని తేల్చి చెప్పారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు కూర్మన్నపాలెం కూడలిలో నిర్వహిస్తోన్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 500 రోజులకు చేరిన నేపథ్యంలో విశాఖలో మహా ప్రదర్శన, బహిరంగ సభ జరిగింది. మహా ప్రదర్శనకు నగరంలో కార్మిక వర్గం ఉప్పెనలా కదిలింది. 32 మంది బలిదానాలు, 64 గ్రామాల ప్రజల 22 వేల ఎకరాల భూములు, 16,500 మంది నిర్వాసితుల త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మే హక్కు కేంద్రంలోని బిజెపికి ఎవరిచ్చారంటూ కార్మిక వర్గం ప్రశ్నించింది. తొలుత కూర్మన్నపాలెం నుంచి విశాఖ నగరం వరకూ వేల సంఖ్యలో కార్మికులు తరలివచ్చారు. కార్మిక వ్యతిరేక విధానాలపై వారు చేసిన నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన రైల్వే డిఆర్ఎం కార్యాలయం నుంచి మహా ప్రదర్శన ప్రారంభమై జివిఎంసి వద్దకు చేరుకుంది. అక్కడున్న గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నరసింగ రావు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాటం జరుగుతోందన్నారు. వచ్చే నెల నాలుగున విశాఖకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వస్తున్నారని, ఈలోగా స్టీల్‌ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆయనను విమానం దిగనిచ్చేది లేదని హెచ్చరించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్ట్రాటజిక్ సేల్ చేయాలని 2021 జనవరి 27న కేంద్రంలోని బిజెపి నిర్ణయించిన నుంచీ నేటికి 17 నెలలుగా ఒకే అజెండాతో స్టీల్‌ప్లాంట్‌లోని కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా పోరాడుతున్నాయన్నారు. భవిష్యత్తులోనూ ఉద్యమ ఉధృతిని కొనసాగించి కార్మికులు విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. విశాఖ ప్రభుత్వ రంగ సంస్థ లకు నిలయంగా ఉందని, మోడీ నగరానికి వచ్చే రోజున నల్ల జెండాలతో ప్రయివేటీకరణ వ్యతిరేక నిరసన కార్యక్రమాలను అన్ని కంపెనీల్లోనూ, ప్రజల నివాసిత ప్రాంతాల్లోనూ చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ దేశ ప్రజలు పోరాడితే మోడీ వెనక్కి తగ్గుతారని చెప్పేందుకు నల్ల వ్యవసాయ చట్టాలపై జరిగిన పోరాటమే తార్కాణమన్నారు. 'అమ్మేస్తాం... మూసేస్తాం' అని అంటే దేశ ప్రజలు తరిమేస్తారని మోడీని హెచ్చరించారు. వైఎస్‌ఆర్‌టి యుసి రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ 500 రోజులు గడుస్తున్నా విశాఖ ఉక్కుపై మోడీ స్పందించకపోవడం బాధాకర మన్నారు. విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి చైర్మన్ ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణ మహోద్యమంలో అన్ని తరగతుల ప్రజలూ పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో లీడర్ పత్రిక సంపాదకులు వివి.రమణమూర్తి, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ జె.అయోధ్యరాం, చైర్మన్లు డి.ఆదినారా యణ, మంత్రి రాజశేఖర్, 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్, సిఎఫ్‌టియుఐ నాయకులు పి.సురేష్, హెచ్ఎంఎస్ నాయకులు డి.అప్పారావు, వైఎస్‌ఆర్‌టియుసి నాయకులు మస్తానప్ప, టిఎన్టియుసి నాయకులు రామ్మోహన్ కుమార్ పాల్గొన్నారు.