Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగింపు వద్దని కేంద్ర ఆర్థిక శాఖ సలహా
- ద్రవ్యలోటు జీడీపీలో 6.4శాతానికి చేరుకుందని ఆందోళన
న్యూఢిల్లీ : పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన (ఉచిత రేషన్ పంపిణీ) పథకాన్ని ఇకపై కొనసాగించ వద్దని కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. కరోనా మొదటి వేవ్ సమయంలో (మార్చి 2020) ఉచిత రేషన్ పథకాన్ని మోడీ సర్కార్ ప్రకటించింది. కరోనా కఠిన నిబంధనలు, లాక్డౌన్ కారణంగా ఎంతోమంది ఉపాధి, ఆదాయం కోల్పోయారు. వీరికి ఉపశమనం కలిగించేందుకు పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచిత రేషన్ పంపిణీ ప్రకటించింది. లబ్దిదారులుగా ఉన్న 80కోట్లమందిలో ప్రతి పౌరుడికి 5కిలోల గోధుమలు లేదా బియ్యం పంపిణీ చేస్తున్నామని కేంద్రం చెబుతోంది. అయితే కరోనా మహమ్మారి భయాలు తొలిగిపోయినందున ఈ పథకం కొనసాగించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. ఈమేరకు కేంద్రానికి పంపిన నోట్లో '' కేంద్ర బడ్జెట్ ద్రవ్యలోటు 6.40 శాతానికి (జీడీపీలో) చేరుకుంది. ఇంతకుముందు ఎన్నడూలేనంతగా ద్రవ్యలోటు రికార్డుస్థాయిలో పెరిగింది. దీనిని నియంత్రించకపోతే ముందు ముందు గడ్డు పరిస్థితి ఎదురయ్యే ప్రమాదముంది. ప్రధానమైన సబ్సిడీల పెంపు, పన్ను మినహాయింపులు ఇవ్వటం సాధ్యం కాదు'' అని నోట్లో కేంద్ర ఆర్థికశాఖ పేర్కొన్నది. ఈ ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్లో మోడీ సర్కార్ ఆహార సబ్సిడీపై రూ.2.07లక్షల కోట్లు కేటాయించింది. ఆర్థికశాఖ తాజా నోట్ ప్రకారం, ఈ సబ్సిడీలకు కోతలు పడే అవకాశం కనపడుతోంది. ఉచిత రేషన్ పంపిణీ ఆపేయాలని స్పష్టంగా పేర్కొన్నది.