Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఒక వైపు దేశంలో పౌర హక్కులు, ప్రజాతంత్ర విలువలపై క్రూరంగా దాడులు చేస్తూ, మరో వైపు 1975 జూన్ 26 ఎమర్జెన్సీ గురించి ప్రధాని మోడీ విదేశీ గడ్డపై సుద్దులు చెప్పారు. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ భారతదేశ చరిత్రపై నల్ల మచ్చ అని ఆయన పేర్కొన్నారు. ఆదివారం మ్యూనిచ్‌లో ప్రవాస భారతీయుల నుద్దేశించి ఆయన మాట్లాడుతూ, 47 ఏళ్ల క్రితం భారత దేశంలో విధించిన అత్యయిక పరిస్థితి ,ప్రతి భారతీయుడిలో అణువణువునా ఉన్న ప్రజాస్వామ్యాన్ని అణచివేసిందని అన్నారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో అదొక నల్లటి మచ్చ.అని అన్నారు. ప్రస్తుతం భారత దేశంలో అమలు జరుగుతున్న అనధికారిక ఎమర్జెన్సీ గురించి ఆయన ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. మాట్లాడలేరు కూడా. రెండు రోజులపాటు జర్మనీ పర్యటన నిమిత్తం మ్యూనిచ్కు చేరుకున్న ప్రధాని మోదీ జి7 సదస్సులో పాల్గొని ఇంధనం, ఆహార భద్రత, ఉగ్రవాద వ్యతిరేకత, పర్యావరణం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై ధనిక దేశాల కూటమి, దాని భాగస్వామ్య దేశాల నేతలతో చర్చిస్తారు.. మరో వైపు ఆదివారం నాడిక్కడ ప్రారంభమైన రెండు రోజుల జి-7 శిఖరాగ్ర సదస్సు ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత ఎగదోసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించింది. రష్యా నుంచి బంగారం దిగుమతులపై నిషేధాన్ని విధించాలని ఈ సదస్సు నిర్ణయించింది. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానం మేరకు జీ7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ప్రపంచంలోని ఏడు సంపన్న దేశాల కూటమి సదస్సుకు జర్మనీ అధ్యక్షత వహిస్తున్నది.